కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో రెండు నెలలుగా పనుల్లేక వలస కూలీలు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉన్నారు. ఇంకా ఎన్నాళ్లకు తమకు కూలి పనులు లభిస్తాయో కూడా తెలియని పరిస్థితుల్లో.. కేంద్ర ప్రభుత్వం తమను ఏ రకంగానూ ఆదుకోదని స్పష్టం అయిన నేపథ్యంలో.. ఉత్తరాదిన వలస కూలీలు తమ తమ సొంతూళ్లకు నడకన చేరుకోవడానికి సాగుతున్నారు. వందల కిలోమీటర్ల దూరంలోని సొంతూళ్లకు కూడా వాళ్లు నడుచుకుని వెళ్తున్నారు. అలా ఎలా నడుస్తారు? ఎందుకు నడుస్తారు? అంటూ ఫ్యాన్ల కింద కూర్చుని లాజిక్ లు ప్రశ్నిస్తే సమాధానాలు దొరక్కపోవచ్చు.
లాక్ డౌన్ అనగానే.. హైదరాబాద్, బెంగళూరుల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్లు కూడా ఎలా సొంతూళ్లకు వెళ్లాలని ప్రయత్నించారో, ఎలా సొంతూళ్లకు వెళ్లారో అనే అంశం ఆధారంగా చూస్తే.. వలస కూలీలు నడుచుకుని అయినా సొంతూళ్లకు వెళ్లాలనే ప్రయత్నం ఎందుకో అర్థం అవుతుంది. నగరాల్లో కోట్ల రూపాయల విలువైన ఫ్లాట్లలో నివసించే వాళ్లు, వాళ్లకు సమస్త సౌకర్యాలూ అందుబాటులో ఉన్నా.. సొంతూళ్ల బాట పట్టారు. వాళ్లంటే కార్లు, బైకుళ్లో ఎలాగోలా సొంతూళ్లకు చేరుకున్నారు. అలాంటి వారికి ప్రభుత్వ రవాణా వ్యవస్థతో పని లేదు. అయితే ప్రభుత్వ, ప్రైవేట్ వెహికల్స్ ను రాత్రికి రాత్రి ఎక్కడిక్కడ ఆపేయిస్తే ఆ కష్టాలు ఎలా ఉంటాయో కూలి పనులు చేసుకునే వాళ్లకే తెలుస్తుంది.
ఈ క్రమంలో ఇప్పటికే పలువురు వలస కూలీలు ప్రమాదాలకు గురయ్యారు. రైలు రోడ్డును పట్టుకుని నడుస్తూ.. రైలు రాదు అనే అమాయకత్వంతో , పట్టాల మీదే విశ్రమిస్తూ తెల్లవారుఝామున అలసటతో కూడిన గాఢమైన నిద్రలోనే 17 మంది వలస కూలీలు ఉత్తరభారతంలో మరణించారు. గూడ్స్ రైల్ కింద పడి వాళ్లంతా ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలాంటి ప్రమాదాలు ఉత్తరాదిన కొనసాగుతూనే ఉన్నాయి. నడుస్తూ.. అలసిపోయి ప్రాణాలు కోల్పోతున్న వాళ్లు కొందరు.
వాటికి తోడు.. ఉత్తరప్రదేశ్ లో మరో ప్రమాదం జరిగింది. రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ కు ట్రక్ లో ప్రయాణిస్తున్న వలస కూలీలు 21 మంది మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి. వారు ప్రయాణిస్తున్న ట్రక్ ను మరో ట్రక్ ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగిందని, 21 మంది కూలీలు మరణించారని తెలుస్తోంది. ఇలా వలస కూలీలపై కరోనా, లాక్ డౌన్ రూపంలో పగబట్టిన విధి, ఇలాంటి ప్రమాదాలతో వారి ప్రాణాలనే తీస్తోంది.