దేవినేని ఉమ‌కు దారేదీ?

ఒక‌వైపు ప్ర‌వాస క‌మ్మ వాళ్ల‌ను క‌లిసి తెలుగుదేశం పార్టీని ఏపీలో తిరిగి అధికారంలోకి తీసుకురావ‌డానికి కృషి చేస్తున్న తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు విష‌యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్…

ఒక‌వైపు ప్ర‌వాస క‌మ్మ వాళ్ల‌ను క‌లిసి తెలుగుదేశం పార్టీని ఏపీలో తిరిగి అధికారంలోకి తీసుకురావ‌డానికి కృషి చేస్తున్న తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు విష‌యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ద‌క్కుతుందా, ద‌క్కినా ఆయ‌న నెగ్గుకు రాగ‌ల‌రా? అనే అంశంపై చ‌ర్చ జ‌రుగుతూ ఉంది. 

దేవినేని ఉమ నిస్సందేహంగా చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడు. ఆ సాన్నిహిత్యం ఇప్ప‌టికీ ఉంది. దాంతోనే ఆయ‌న అమెరికా వ‌ర‌కూ తెలుగుదేశం పార్టీ కార్య‌క్ర‌మంలో వెళ్ల‌గ‌లిగారని స్ప‌ష్టం అవుతోంది.

ఆ సంగ‌త‌లా ఉంటే.. మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో మాత్రం దేవినేని ఉమ‌పై ఏ మాత్రం సానుకూల‌త లేద‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్నా.. దేవినేని ఉమ పెద్ద పెద్ద మాట‌లే మాట్లాడుతున్నా, త‌న టార్గెట్ ముఖ్య‌మంత్రి జ‌గ‌నే త‌ప్ప మ‌రొక‌రు కాద‌న్న‌ట్టుగా దేవినేని ప్ర‌సంగాలిస్తున్నా…. ఆయ‌న‌కు నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో మాత్రం ప‌ట్టు చిక్క‌డం లేద‌ని స్ప‌ష్టం అవుతోంది.

మైల‌వ‌రం నుంచి 2009, 2014 ఎన్నిక‌ల్లో నెగ్గిన దేవినేని ఉమ గ‌త ఎన్నిక‌ల్లో మాత్రం ఓడిపోయారు. మంత్రి హోదాలో ఎన్నిక‌ల‌కు వెళ్లినా వసంత కృష్ణ ప్ర‌సాద్ చేతిలో ఉమామ‌హేశ్వ‌ర‌రావు ఓట‌మి పాల‌య్యారు. దేవినేని వంటి ప్ర‌త్య‌ర్థిపై నెగ్గిన వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో ప‌ట్టు బిగించుకున్నారు. దీంతో వ‌చ్చేసారి కూడా ఉమ‌కు ఏ మాత్రం సానుకూల‌త ఉండ‌ద‌నే అభిప్రాయాలు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి.

చంద్ర‌బాబు నాయుడు దేవినేని ఉమ‌పై అభిమానంతోనో, లేక మ‌రో దిక్కు లేద‌నో మైల‌వ‌రం టికెట్ ఆయ‌న‌కే కేటాయిస్తే ఆ నియోజ‌క‌వ‌ర్గంపై టీడీపీ ఆశ‌లు పెట్టుకునే ప‌రిస్థితి ఉండ‌ద‌ని గ్రౌండ్ రిపోర్ట్ చెబుతోంది. ఉమ‌పై నియోజ‌క‌వ‌ర్గంలో ఆ స్థాయిలో వ్య‌తిరేక‌త ఉంద‌ని, దేవినేని ఉమ పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విజ‌యం న‌ల్లేరు మీద న‌డ‌కే అనేది టాక్. మ‌రి పెద్ద పెద్ద మాట‌లు మాట్లాడే ఉమామహేశ్వ‌ర‌రావు నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం త‌న పరిస్థితిని దిద్దుకోలేక‌పోతున్న‌ట్టున్నారు!