ఈమధ్య కాలంలో వచ్చిన పూరి జగన్నాధ్ సినిమాల్లో కథలు ఏ స్థాయిలో ఉంటున్నాయో అంతా చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ ఇతడికి హీరోలు ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారు? దీనికి కారణం ఒకటే. ఒక్కో హీరోకు ఒక్కో క్యారెక్టరైజేషన్ వినిపించి ఫ్లాట్ చేస్తుంటాడు పూరి. రామ్ కూడా అలానే పడినట్టున్నాడు. అతడి మాటల్లోనే ఆ విషయం తెలుస్తూ ఉంది.
“కొత్తగా ఏదో చేయాలనుకున్నాను. ఇంకా చెప్పాలంటే బ్యాడ్ బాయ్ క్యారెక్టర్ చేయాలనుకున్నాను. అదే టైమ్ లో పూరి జగన్నాధ్ తో చర్చలు ప్రారంభమయ్యాయి. నేను ఏ మైండ్ సెట్ తో ఉన్నానో, అదే సబ్జెక్ట్ ను పూరి చెప్పారు. అలా ఇస్మార్ట్ శంకర్ సెట్ అయింది. ఇప్పటివరకు నన్ను నేను చూడని కోణంలో ఇస్మార్ట్ శంకర్ లో చూసుకున్నాను.”
రామ్ కు కొత్త మేకోవర్ ఇవ్వడంతో పాటు.. ఇప్పటివరకు అతడు చేయని సైన్స్ ఫిక్షన్ జానర్ ను పరిచయం చేశాడు పూరి. అందుకే రామ్ వెంటనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ప్రతి సినిమాలో అతి మంచితనంతో కనిపించడం బోర్ కొట్టిందంటున్నాడు రామ్.
“గతంలో కొన్ని సాఫ్ట్ క్యారెక్టర్లు చేశాను. వాటికి సంబంధించి పెద్దగా కిక్ అనిపించలేదు. ఎందుకంటే సీన్ పేపర్ చూస్తున్నప్పుడే నా పెర్ఫార్మెన్స్ నాకు తెలిసిపోయేది. ఇంకేదో కొత్తగా చేయాలనుకున్నాను. నా పాత్రల్లో మంచితనం కూడా ఎక్కువైపోయిందనే ఫీలింగ్ వచ్చింది. అదే టైమ్ లో చాలామంది నన్ను జగడం లాంటి సినిమా చేయమన్నారు. ఇస్మార్ట్ శంకర్ ఆ లోటు తీర్చింది.”
ఇలా ఇస్మార్ట్ శంకర్ చేయడం వెనక అసలు కారణాన్ని బయటపెట్టాడు రామ్. ఏదైతేనేం, పూరి జగన్నాధ్ మరోసారి తన నెరేషన్ తో ఇంకో హీరోను సంపాదించగలిగాడు. రామ్ తన ఆకలి తీరుస్తాడంటున్నాడు. చూద్దాం.. థియేటర్లలో ఇస్మార్ట్ శంకర్ ఏం చేస్తాడో?