ధోనీకి బీజేపీ వల.. పడతాడా?

మాజీ క్రికెటర్లు, సినీతారల మీద భారతీయ జనతా పార్టీకి చాలా మమకారమే కనిపిస్తూ ఉంది. వారి గ్లామర్ ను రాజకీయాలకు వాడుకోవాలని బీజేపీ భావిస్తూ ఉంది. ఇటీవలి లోక్ సభ సార్వత్రిక ఎన్నికల సమయంలో…

మాజీ క్రికెటర్లు, సినీతారల మీద భారతీయ జనతా పార్టీకి చాలా మమకారమే కనిపిస్తూ ఉంది. వారి గ్లామర్ ను రాజకీయాలకు వాడుకోవాలని బీజేపీ భావిస్తూ ఉంది. ఇటీవలి లోక్ సభ సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా అలాంటి వారిని చాలామందిని బీజేపీ రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. మరి కొందరిని తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కొందరు పడ్డారు, కొందరు బీజేపీ వలలో పడలేదు!

గౌతమ్ గంభీర్, సన్నీ డియోల్ వంటి వారిని ఎన్నికల్లో పోటీ చేయించింది బీజేపీ. వారు నెగ్గేశారు కూడా. ఇక జయప్రద వంటి ఔట్ డేటెడ్ పొలిటీషియన్ ను కూడా బీజేపీ చేర్చుకుని మరీ టికెట్ ఇచ్చింది. తెలుగునాట కూడా అనామక హీరోయిన్లను  బీజేపీ చేర్చుకుంది, పోటీ చేయించింది. ఆ సంగతలా ఉంటే ఇప్పుడు ఒక పెద్ద చేపకే వల వేస్తోందట కమలం పార్టీ. అది టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అని వార్తలు  వస్తున్నాయి.

త్వరలోనే ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలిగే అవకాశాలున్నాయి.  నిన్ననే 38 ఏటలోకి అడుగుపెట్టాడో ధోనీ. ప్రపంచకప్ తర్వాత ధోనీ రిటైరయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సెమిస్ లో ఇండియా గెలిచి, ఫైనల్ కు ఎంటరై విజేతగా నిలిస్తే ఆ మ్యాచే ధోనీ చివరి మ్యాచ్ అవుతుందని ఒక అంచనా. ఇండియా ప్రపంచ విజేతగా నిలవకపోతే ధోనీపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. రిటైర్మెంట్ తప్పదు.

ఈ నేపథ్యంలో ధోనీని రాజకీయాల్లోకి తీసుకురావాలని బీజేపీ భావిస్తోందట. ఇప్పటికే అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయని టాక్. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో చాలా మంది క్రికెటర్లు ఓటు హక్కును వినియోగించుకోకపోయినా ఐపీఎల్ మధ్యనే తన సొంతూరికి వెళ్లి ఓటు వేసి వచ్చాడు ధోనీ. అలా రాజకీయంపై ధోనీ క్లారిటీతోనే ఉన్నట్టున్నాడు!

ఇప్పుడు కాపీ కొడితే అవతల వాళ్లు తేలికగా వదలరు