నిన్నమొన్నటి వరకూ వీర తెలుగుదేశం నేతలుగా పేరు పొందిన వారు ఒక్కొక్కరుగా తట్టాబుట్టా సర్దేస్తూ ఉండటం గమనార్హం. వారిలో చంద్రబాబు నాయుడే కొందరిని బీజేపీలోపి పంపిస్తున్నారనే ప్రచారం జరుగుతూ ఉంది. బీజేపీలో తన బినామీలను ఉంచే స్కెచ్ ను చంద్రబాబు నాయుడు అమలు పరుస్తూ ఉన్నారని సామాన్య ప్రజానీకం అనుకుంటూ ఉన్నారు.
మరి కొందరు మాత్రం కేసులు, కాంట్రాక్టుల వ్యవహారాల కోసం కమలం పార్టీ తీర్థం పుచ్చుకుంటూ ఉన్నారని కూడా ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పటికే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ వంటి వారు ఇదే బాపతుగా బీజేపీలోకి చేరారు.
కాంట్రాక్టుల వ్యవహారాలను కాపాడుకోవడానికి ఆయన కమలం పార్టీలో చేరారు. ఆయనే కాదట.. ఇప్పుడు దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని కూడా ఇదే ప్రయత్నంలో ఉన్నారని వార్తలు వస్తుండటం గమనార్హం.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చింతమనేని చిందులు ఎలా ఉండేవో అందరికీ తెలిసిందే. అయితే అధికారం చేజారగానే ఆయన ఏ కలుగులో దాక్కున్నారో కానీ.. టీడీపీ కార్యకలాపాలకు పూర్తిగా దూరం అయ్యారట. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలోకి చేరే ప్రయత్నంలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
చింతమనేనిపై చాలా కేసులే ఉన్నాయి. ఒక కేసులో శిక్ష కూడా ఖరారు అయ్యింది. ఇక మిగతా దందాలపై ఇప్పుడు కేసుల కదలికలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. అందుకే బీజేపీ షెల్టర్ తీసుకునేందుకు ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నారని ప్రచారం జరుగుతూ ఉంది.