కర్ణాటకలో సంకీర్ణ సర్కారు పతనావస్థ వెనుక ఉన్నది సిద్ధరామయ్యే అనే టాక్ వినిపిస్తూ ఉంది. కాంగ్రెస్-జేడీఎస్ సర్కారులో తనకు తగిన ప్రాధాన్యత దక్కలేదని అలక వహించిన సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని కూలదోసేందుకు తనవంతు సహకారం అందిస్తూ ఉన్నారనే మాట వినిపిస్తోంది.
స్వయంగా కాంగ్రెస్ హై కమాండ్ నుంచి, జేడీఎస్ నేతల నుంచి ఈ మేరకు అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. పదిమంది ఎమ్మెల్యేలు రాజీనామా అంటూ ముంబై వెళ్లిపోవడం వెనుక సిద్ధూ స్కెచ్ కూడా ఉందని ఆ పార్టీల నేతలు అంటున్నారు.
ప్రాధాన్యత దక్కడం లేదని ప్రభుత్వాన్ని కూలదోసేందుకు సిద్దరామయ్య ప్రయత్నాలు సాగిస్తున్నారని వారు వాపోతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ హై కమాండ్ కూడా సిద్దూను నిలదీస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే అసంతృప్త ఎమ్మెల్యేల్లో తన వర్గం వాళ్లు ఉన్నా.. వారు తన మాట వినడంలేదని సిద్దరామయ్య అంటున్నాడట. తన వాళ్లే తన మాట వినడం లేదని సిద్దూ అంటున్నారని సమాచారం.
ఏదేమైనా అసలే ప్రభుత్వాన్ని కూల్చేయాలనే ఆకలితో ఉన్నారు కర్ణాటక బీజేపీ నేతలు. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ నేతల తీరు ఆ పార్టీకి మరింత అనుకూలంగా మారింది. ఇలాంటి రాజకీయాలతో ప్రజలు కూడా కాంగ్రెస్-జేడీఎస్ మీద మరింత అసహనాన్ని పెంచుకునే అవకాశాలు లేకపోలేదు. ఇప్పుడు చర్చంతా కుమారస్వామి ప్రభుత్వం ఇంకెన్ని రోజులు నిలబడుతుందనేదే!