ఏపీకి తనను రానివ్వడం లేదని పదేపదే చెప్పడానికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సిగ్గు అనిపించడం లేదా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. చివరికి సర్వోన్నత న్యాయస్థానంలో కూడా రాజకీయ ఆరోపణలే చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎంపీ రఘురామకృష్ణారాజు కస్టోడియల్ టార్చర్‌పై విచారణ చేపట్టాలంటూ ఆయన తనయుడు భరత్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరిపింది. విచారణలో భాగంగా పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ రెండున్న రేళ్లుగా రఘురామను రాష్ట్రానికి రాకుండా అడ్డంకులు సృష్టించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల ప్రధాని మోదీ తన పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలో పర్యటిస్తున్నప్పుడు కూడా పాల్గొనకుండా ఏపీ ప్రభుత్వం అడ్డుకుందని కోర్టుకు తెలిపారు. కేంద్రప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమానికి రఘురామను ఆహ్వానించని మోదీ సర్కార్‌ను ప్రశ్నించడానికి మాత్రం రఘురామకు దమ్ము లేదు.
రఘురామను ఆహ్వానించని విషయాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, రాజకీయ పరమైన వివాదాలను పరిష్కరించడం తమ బాధ్యత కాదని గతంలో ఆయన తేల్చి చెప్పారు. మోదీ పర్యటనలో పాల్గొనేందుకు వెళుతున్నానంటూ రైలు ప్రయాణం డ్రామాను రఘురామ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. కనీసం హైదరాబాద్ నగరాన్ని కూడా దాటకుండానే మధ్యలో వచ్చిన స్టేషన్‌లో దిగి రఘురామ పలాయనం చిత్తగించారు.
తాజాగా సుప్రీంకోర్టులో విచారణలో భాగంగా ఏపీకి రఘురామను అడ్డుకుంటున్నట్టు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సొంత రాష్ట్రానికి కూడా వెళ్లలేని అసమర్థ, పిరికి లోక్‌సభ సభ్యుడు ప్రజలకేం చేస్తాడనే ప్రశ్నకు ఏం జవాబు చెబుతారు. చిల్లర ప్రచారం కోసం ఎంతకైనా దిగజారే నాయకుల జాబితాలో రఘురామ చేరారంటే ఎవరైనా కాదనగలరా?
ఇదిలా వుండగా కస్టోడియల్ టార్చర్‌పై ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఏపీ ప్రభుత్వ వాదన విన్న తర్వాతే సీబీఐ విచారణకు ఆదేశించే సంగతి చూస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో రఘురామకు ఆశించిన ఫలితం ప్రస్తుతానికి దక్కలేదనే చెప్పాలి.
ఏపీ ప్రభుత్వంపై కొంత కాలంగా రఘురామ తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొందరిపై వ్యక్తిగత దూషణలకు కూడా ఆయన దిగడం తెలిసిందే. సీఐడీ విచారణలో భాగంగా తనకు ఆ రాత్రి కాళరాత్రిగా మిగిలిందని రఘురామ ఆవేదన చెందుతున్నారు.