ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ కవిత తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమె పాత్రపై సీబీఐ విచారణ కూడా జరుపుతోంది. కవిత పాత్రకు సంబంధించి బీజేపీ నేతలు రోజుకో అంశాన్ని తెరపైకి తెస్తూ, ఆమెను మరింత ఇరకాటంలో పడేస్తున్నారు. లిక్కర్ స్కాంలో కవిత పాత్ర సంగతేమో గానీ, బీజేపీ రిలీజ్ చేస్తున్న ఫొటోలు, ఇతర ఆధారాలతో ఆమె సతమతమవుతున్నారు.
లిక్కర్ స్కాం నిందితులతో కలిసి కవిత తిరుమలకు వెళ్లడాన్ని ఫొటోలతో సహా బీజేపీ నేత, ఎమ్మెల్యే రఘునందన్‌రావు బయట పెట్టడం ఆసక్తికర పరిణామం. న్యాయవాది కూడా అయిన రఘునందన్‌రావు మీడియాతో మాట్లాడుతూ ప్రజాకోర్టులో కవితను దోషిగా నిలబెట్టే ప్రయత్నం గట్టిగా చేశారు. లిక్కర్ స్కాంలో సీబీఐ కేసులో నిందితుడైన రామచంద్ర పిళ్లై కుటుంబంతో కలిసి కవిత తిరుమలకు వెళ్లారంటూ ఫొటోలు విడుదల చేసి రాజకీయ బాంబు పేల్చారు.
బోయినపల్లి అభిషేక్‌రావుతో కలిసి కవిత తిరుమల వెళ్లారని ఆయన అన్నారు. రామచంద్రపిళ్లైని కలవనే లేదని గతంలో కవిత చెప్పారని రఘునందన్‌రావు గుర్తు చేశారు. అసలు ఆయనెవరో తెలియనే తెలియదని చెప్పిన కవిత నిందితుని కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి ఎలా వెళ్లారని నిలదీశారు. లిక్కర్ స్కాంతో కవితకు సంబంధం ఉందని నిరూపించేందుకు రఘునందన్‌రావు బలమైన వాదనను వినిపించారు.
న్యాయస్థానంలో కవిత పాత్రపై ఎలాంటి తీర్పు వస్తుందనే విషయాన్ని కాసేపు పక్కన పెడదాం. కానీ రాజకీయ నాయకులకు ప్రజాకోర్టుకంటే మరేది ఇంపార్టెంట్ కాదు. రఘునందన్ మీడియా ఎదుట చూపిన ఫొటోలు, లిక్కర్ స్కాంతో కవితకు సంబంధం ఉందని బల్లగుద్ది మరీ చెప్పడం చూస్తే… ఎవరికైనా ఆమె పాత్రపై అనుమానం రాకమానదు. దీని నుంచి ఆమె ఎలా బయట పడుతుందనేది ఆసక్తికరంగా మారింది.