తన కుటుంబ సభ్యులపై టీడీపీ, ఎల్లో మీడియా దురుద్దేశపూరిత విమర్శలు చేయడాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఇవాళ్టి కేబినెట్ భేటీలో జగన్ మాట్లాడుతూ ఎల్లో మీడియా, ప్రతిపక్షాలకు ఇక మీదట స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాల్సిందేనని దిశానిర్దేశం చేయడం గమనార్హం. అలాగే ఆయన ప్రత్యేకంగా తన కుటుంబ సభ్యులను టార్గెట్ చేయడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడాన్ని బట్టి చాలా సీరియస్‌గా తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
‘టీడీపీ, ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి ప్రతి రోజూ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయి. చివరికి కుటుంబ సభ్యులపై కూడా దుర్మార్గంగా విమర్శలు చేస్తున్నాయి. ఇక మీదట వాళ్ళ ఆగడాలను చూస్తూ ఉండడానికి వీల్లేదు. మంత్రులందరూ ప్రతి అంశం పై స్పందించాలి. తప్పుడు ఆరోపణలను దీటుగా తిప్పికొట్టండి. స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇవ్వండి’ అని మంత్రులకు జగన్ దిశానిర్దేశం చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతి, విజయసాయిరెడ్డిలకు సంబంధం వుందంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలకు ఎల్లో మీడియా సహజంగానే అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అయితే అధికార పక్షం నుంచి సరైన కౌంటర్ రావడం లేదు. జగన్ భార్యను విమర్శిస్తే… మహిళా నాయకురాళ్లు మాత్రమే ఘాటుగా స్పందించారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి మద్యం సేవించి కొట్టు కొంటారనే సమాచారం తమకు ఉందని ఎదురు దాడికి దిగారు.
ఇంతకు మించి పెద్దగా వైసీపీ నుంచి ఎదురు దాడి జరగలేదు. అదే జగన్‌కు ఆగ్రహం తెప్పించినట్టుంది. ఇకపై ఉదాసీనంగా ఉండడానికి వీల్లేదని మంత్రులకు జగన్ గట్టిగా క్లాస్ తీసుకునే వరకూ పరిస్థితి వచ్చింది. రానున్న రోజుల్లో ప్రతిపక్షాల నిరాధార ఆరోపణలకు అధికార పక్షం నుంచి ఎలాంటి కౌంటర్లు వస్తాయో చూద్దాం.