బిగ్‌బాస్ ఎందుకు చూడాలి?

బిగ్‌బాస్ ఒక టైం వేస్ట్ షో, అంతా స్కెచ్‌, ముందే స్క్రీన్ ప్లే ఇచ్చి యాక్ట్ చేయిస్తారు, నారాయ‌ణ (సీపీఐ) లాంటి వాళ్లైతే పిచ్చిగా తిడ్తారు. బిగ్‌బాస్‌పైన చాలా నెగెటివ్ అభిప్రాయాలున్నాయి. ఎన్ని వున్నా…

బిగ్‌బాస్ ఒక టైం వేస్ట్ షో, అంతా స్కెచ్‌, ముందే స్క్రీన్ ప్లే ఇచ్చి యాక్ట్ చేయిస్తారు, నారాయ‌ణ (సీపీఐ) లాంటి వాళ్లైతే పిచ్చిగా తిడ్తారు. బిగ్‌బాస్‌పైన చాలా నెగెటివ్ అభిప్రాయాలున్నాయి. ఎన్ని వున్నా ప్ర‌తిరోజూ ల‌క్షల మంది చూస్తున్నారు (కోట్ల మంది అనేది అతిశ‌యోక్తి కావ‌చ్చు).

బిగ్‌బాస్ టైం వేస్ట్ షో అనే అనుకుందాం. మ‌రి మ‌న‌మంతా టైంని ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసుకోకుండా స‌ద్వినియోగం చేసుకుంటున్నామా? స‌మాజానికి ప‌నికి వ‌చ్చే ప‌నులు, ఆలోచ‌న‌లే చేస్తున్నామా? అదేం లేదు. ప‌నికి మాలిన యూట్యూబ్ వీడియోలు చూస్తున్నాం, గ్యాసిప్స్ చ‌దువుతున్నాం, ఉద్యోగంలో చాడీలు చెబుతున్నాం, బాస్‌ల‌ని పొగ‌డుతున్నాం (పొగ‌డ్త‌లు, చాడీలు, ఆరోప‌ణ‌లు అన్నీ క‌లిస్తే మ‌నం కూడా తెలిసోతెలియ‌కో బిగ్‌బాస్ షోలో ఉన్న‌ట్టే). టైం వేస్ట్ అనేది ఎవ‌రికి వ‌ర్తిస్తుందంటే ప్ర‌తి నిమిషాన్ని వేస్ట్ చేయ‌కుండా వుండేవాళ్ల‌కి. కోట్లాది మంది ఆ స్థితిలో లేరు.

అంతా స్కెచ్‌, స్క్రీన్ ప్లే అనేది కూడా నిజం కాదు. షో రేటింగ్స్ పెంచుకోడానికి కొంత వాస్త‌వం వుండొచ్చు. టాస్క్‌లు, ల‌వ్ ట్రాక్‌లు, ట్విస్ట్‌లు ఇవి కొంత ప్రీప్లాన్ ఉన్నా మొత్తం షో అంతా స్కెచ్ ప్ర‌కారం న‌డ‌ప‌డం బిగ్‌బాస్ వ‌ల్ల కూడా కాదు. ఇప్పుడు నాన్‌స్టాప్ స్ట్రీమింగ్‌. కాబ‌ట్టి స్కెచ్ 90 శాతం అబ‌ద్ధం.

అమ్మాయిలు, అబ్బాయిలు ఒకే ఇంట్లో క‌లిసి వుండ‌డం ఏంటి? అని సీపీఐ నారాయ‌ణ గ‌తంలో తిట్టాడు. ఈ మ‌ధ్య కూడా తిట్టాడు. కాలం మారింది కానీ, క‌మ్యూనిస్టులు మార‌లేదు. మార్క్సిజం చ‌దివితే ఫెమినిజం అర్థం కాదు. అది వేరే స‌బ్జెక్ట్‌. చైత‌న్య‌శీల సంఘాల్లో ప‌ని చేస్తున్న మ‌హిళ‌లు కూడా జెండ‌ర్ వివ‌క్ష ఎదుర్కోడానికి కార‌ణం ఇదే.

చ‌దువు కోసం అమెరికా వెళ్లిన మ‌న అమ్మాయిలు అబ్బాయిల‌తో క‌లిసి ఒకే ఇంట్లో అద్దెకి వుండ‌డం చాలా కామ‌న్‌. ఎవ‌రి బెడ్‌రూంలు వాళ్ల‌కి వుంటాయి. హాలు, కిచెన్‌ని షేర్ చేసుకుంటారు. అక్క‌డేం ఘోరాలు, నేరాలు జ‌ర‌గ‌డం లేదు. జెండ‌ర్ తేడాని అధిగ‌మించే మెచ్యూరిటీ లెవెల్స్ వాళ్ల‌కి వున్నాయి. ఇది మ‌న‌కి కూడా వ‌చ్చేసింది. హైద‌రాబాద్‌లో హాస్ట‌ల్ తిండి ప‌డ‌ని వాళ్లు, ఒకే ఇంట్లో అబ్బాయిల‌తో షేర్ చేసుకుని జాబ్ చేస్తున్న వాళ్లు బోలెడు మంది ఉన్నారు. ఒకే ఇంట్లో వుంటే వాళ్ల‌ని తేడాగా చూడ‌డం మ‌న దృష్టి దోష‌మే త‌ప్ప‌, వాళ్ల సంస్కార లోపం కాదు.

బిగ్‌బాస్‌లో వేర్వేరు నేప‌థ్యం వున్న 21 మంది ఒకే ఇంట్లో వున్నారు. ప్ర‌తిసారి జ‌ర్న‌లిస్టునో, సీనియ‌ర్ ఏజ్ గ్రూప్ వాళ్ల‌నో సెలెక్ట్ చేసేవాళ్లు. ఈ సారి దాదాపు ఒకే ఏజ్ గ్రూప్ వాళ్లు వున్నారు. వీళ్లంతా స్నేహితులుగా, శ‌త్రువులుగా ఉండ‌బోతున్నారు. అర్థంప‌ర్థం లేని ప‌నికిమాలిన విష‌యాలు ఎన్నో దొర్లుతుంటాయి. అయితే వీళ్ల నుంచి నేర్చుకోవాల్సిన , ప్రేర‌ణ పొందాల్సిన విష‌యాలు కూడా చాలా వున్నాయి. 80 కెమెరాల మ‌ధ్య జాగ్ర‌త్త‌గా మాట్లాడ్డం, న‌టించ‌డం చేసినా ఒక్కోసారి అస‌లు మ‌నుషులు వ‌చ్చేస్తారు.

అభిన‌య‌శ్రీ బ్రేక‌ప్ ల‌వ్ స్టోరీ చెబుతున్న‌ప్పుడు, ఆ అమ్మాయి కేవ‌లం ఐటం సాంగ్ డ్యాన్స‌ర్‌గానే తెలుసు. మాన‌సికంగా ఎంత స్ట్రాంగో ఆమె మాట‌లు విన్న‌ప్పుడే అర్థ‌మైంది. చిన్న క‌ష్టాల‌కే భ‌య‌ప‌డుతుంటాం. కుటుంబాన్ని మొత్తం యాక్సిడెంట్‌లో పోగొట్టుకుని, ధైర్యంగా కెరీర్ కొన‌సాగించిన కీర్తి కంటే రోల్ మోడ‌ల్ ఎవ‌రున్నారు?

దిగువ‌, మ‌ధ్య త‌ర‌గ‌తి జీవితాన్ని ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నాడో ఆదిరెడ్డిని చూస్తే తెలుస్తుంది. చిన్న వ‌య‌సులో తండ్రిని కోల్పోయి, గాయ‌కుడిగా ఎదిగిన రేవంత్ ఒక ఇన్‌స్ఫిరేష‌న్‌. మ‌నం ఒప్పుకున్నా ఒప్పుకోక‌పోయినా వీళ్లే మ‌న ఆధునిక యువ‌త‌. వీళ్లే రేపు నాయ‌కులు అయ్యేది, స‌మాజాన్ని న‌డిపేది. ఛాంద‌సత్వం నుంచి బ‌య‌టికొస్తే బిగ్‌బాస్ అర్థ‌మ‌వుతాడు. లేదంటే అది కేవ‌లం రియాల్టీ షో మాత్ర‌మే.

అమ్మాయిలు, అబ్బాయిలు ఎలా వుంటారో, ఎలా వుండ‌బోతున్నారో, ఎలా వుంటున్నారో మ‌న‌కి అర్థం కాక‌, బిగ్‌బాస్‌ని నిల‌దీస్తే ఇది నిజంగా టైం వేస్ట్‌.

జీఆర్ మ‌హర్షి