టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి సొంత పార్టీ నేతలు ఝలక్ ఇస్తున్నారు. ఈ దఫా ఎన్నికలను చావోరేవోగా తీసుకుని పోరాడాలని చంద్రబాబు పార్టీ నేతలు, కార్యకర్తలకు పదేపదే దిశా నిర్దేశం ఇస్తున్నారు. ఇంత వరకూ బాగానే వుంది. చంద్రబాబు ఆదేశాలను చెవికెక్కించుకునే నేతలే కరువయ్యారు. చంద్రబాబు ఆదేశాలతో జనంలోకి వెళుతున్న టీడీపీ నాయకులను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు.
టికెట్ ఇస్తారో, ఇవ్వరో తెలియకుండా ఊరికే డబ్బు ఖర్చు పెట్టుకోవడం ఎందుకనే భావనలో టీడీపీ నేతలు ఉన్నారు. చంద్రబాబు చివరి వరకూ టికెట్ సంగతి తేల్చరని, అంత వరకూ ఖర్చు ఎవరు పెడతారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తీరా కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన తర్వాత టికెట్‌ను మరెవరికో ఇస్తే తమ గోడు ఎవరికి చెప్పుకోవాలని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఇలా చంద్రబాబును నమ్ముకుని ఆస్తులు అమ్ముకుని, చివరికి రోడ్డున పడ్డ నాయకులు ఎంతో మంది ఉన్నారని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు చివరి నిమిషంలో బాగా డబ్బున్న వాళ్లను తీసుకొచ్చి, ఏదో ఒకసాకుతో నెత్తిన రుద్దుతారని ఉదాహరణలతో సహా టీడీపీ నేతలు చెబుతున్నారు. ఉదాహరణకు రాజంపేట లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా శ్రీహరి అనే పెద్ద వ్యాపారిని తీసుకొచ్చారు. అలాంటి వాళ్ల కోసమో చంద్రబాబు వెతుకుతున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో డోన్ టీడీపీ అభ్యర్థిగా సుబ్బారెడ్డిని ప్రకటించారు. ఇతను బాగా డబ్బున్న నాయకుడు. అందుకే రెండో ఆలోచనే లేకుండా అక్కడ అభ్యర్థిని ఖరారు చేశారు. అదే జిల్లాలో ఆళ్లగడ్డ విషయానికి వస్తే మాజీ మంత్రి అఖిలప్రియ, అలాగే నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డిలకు ప్రస్తుతానికి మొండిచెయ్యి చూపారు. అక్కడ అభ్యర్థుల ఖరారు చేయడంలో… వేచి చూద్దాం అనే ధోరణిని అవలంబిస్తున్నారు.
పుట్టపర్తిలో కూడా ఇదే పరిస్థితి. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి బదులు జేసీ బ్రదర్స్ ప్రతిపాదిస్తున్న శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యాపారికి టికెట్ ఇచ్చే అవకాశాలు మెరుగుపడ్డాయి. ప్రొద్దుటూరులో టికెట్ ఎవరికి స్తారో తెలియక మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి, ఉక్కు ప్రవీణ్ జేబు నుంచి ఖర్చయ్యే పనులు తప్ప, మాటలతో సరిపెడుతున్నారు. తిరుపతిలో కూడా అదే పరిస్థితి. తనకు టికెట్ ఇవ్వరనే అనుమానంతో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ..కేవలం మొక్కుబడి కార్యకలాపాలకే పరిమితం అయ్యారు. అక్కడ జేబీ శ్రీనివాస్ అనే వడ్డీ వ్యాపారికి టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయి.
నేతల క్యారెక్టర్ కంటే, క్యాష్ చూసే టికెట్లు ఇచ్చే పరిస్థితి వుందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇలాగైతే ప్రజల్లో ఉన్న నాయకుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. జనంలో తాము తిరగడం, చివరికి టికెట్ మాత్రం మరెవరూ తన్నుకుపోయే పరిస్థితి వుందని, అందుకే బాబును నమ్మి డబ్బు ఖర్చు చేయడానికి ఏ ఒక్క నాయకుడు ముందుకు రావడం లేదనే చర్చ టీడీపీ వర్గాల్లో సాగుతోంది.