జ‌గ‌న్ మ‌నిష‌నే ముద్ర నుంచి…!

ఏపీ బీజేపీ నేత‌లు సొంత పార్టీ కంటే ప్రాంతీయ పార్టీల అనుకూల‌, వ్య‌తిరేకులుగా గుర్తింపు పొందారు. ఏపీ బీజేపీలో మొద‌టి నుంచి ఉన్న నేత‌లు టీడీపీని వ్య‌తిరేకించే వారిగా, ఇదే సంద‌ర్భంలో జ‌గ‌న్ అనుకూలురుగా…

ఏపీ బీజేపీ నేత‌లు సొంత పార్టీ కంటే ప్రాంతీయ పార్టీల అనుకూల‌, వ్య‌తిరేకులుగా గుర్తింపు పొందారు. ఏపీ బీజేపీలో మొద‌టి నుంచి ఉన్న నేత‌లు టీడీపీని వ్య‌తిరేకించే వారిగా, ఇదే సంద‌ర్భంలో జ‌గ‌న్ అనుకూలురుగా గుర్తింపు పొందుతున్నార‌నేది వాస్తవం. ఏపీలో అధికార మార్పిడితో కేసుల భ‌య‌మో, ఆస్తుల‌ను కాపాడుకోవ‌డానికో, చంద్ర‌బాబును ర‌క్షించుకోడానికో… లేదా అన్ని ప్ర‌యోజ‌నాల కోస‌మే అన్న‌ట్టు కొంద‌రు టీడీపీ ముఖ్య నేత‌లు బీజేపీలో చేరారు.

ఈ జాబితాలో సీఎం ర‌మేష్‌ నాయుడు, సుజ‌నాచౌద‌రి, మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి త‌దిత‌రులున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని వీళ్లంతా ఏపీలో జ‌గ‌న్‌ను బెదిరించేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు. ఈ నేప‌థ్యంలో వైఎస్ జ‌గ‌న్ అనుకూల నాయ‌కుడ‌నే ముద్ర నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు తెగ ఆరాట ప‌డుతున్నారు. ప్ర‌తిరోజూ ఏదో ఒక సాకుతో జ‌గ‌న్‌పై సోము వీర్రాజు విమ‌ర్శ‌లు చేస్తుండ‌డం వెనుక అస‌లు కార‌ణం ఏంటో ఆ పార్టీలో అంత‌ర్గ‌త చ‌ర్చ జ‌రుగుతోంది.

జ‌గ‌న్ ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై సోము వీర్రాజు నేతృత్వంలోని బీజేపీ స‌రిగా పోరాడ‌డం లేద‌నే విమ‌ర్శ‌లున్నాయి. ఇప్ప‌టికీ ఇంకా ప్ర‌తిప‌క్ష టీడీపీనే సోము వీర్రాజు విమ‌ర్శిస్తున్నార‌నే చ‌ర్చ బీజేపీలో అంత‌ర్గ‌తంగా సాగుతోంది. దీని నుంచి బ‌య‌ట ప‌డేందుకు వీర్రాజు వీరావేశంతో ఊగిపోతున్నారు. ఇవాళ తిరుప‌తిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఏపీలో పాల‌న గాడిత‌ప్పింద‌ని విమ‌ర్శించారు.

జ‌గ‌న్ ప్రభుత్వం రైతాంగం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనిఆరోపించారు. రైతన్నల ఆత్మహత్యలకు పురిగొల్పుతోందని మండిప‌డ్డారు. అధికారులు కూడా ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించడం దారుణమన్నారు. జగన్ ప్రభుత్వం స్టిక్కర్ ప్రభుత్వమని అన్నారు. కేంద్ర నిధులతోనే ఏపీ ప్రభుత్వం కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని.. ఇసుక, లిక్కర్, భూ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని విమ‌ర్శించారు.

ప‌నిలో ప‌నిగా జ‌గ‌న్‌తో క‌లిపి చంద్ర‌బాబును కూడా సోము వీర్రాజు విమ‌ర్శించారు. సీఎం జగన్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అధికార యావ తప్ప మరో ధ్యాస లేదని విమ‌ర్శించారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వీర్రాజు నీతిసూత్రాలు చెప్పారు. ఏపీ బీజేపీ నేత‌లు టీడీపీ, వైసీపీ ట్రాప్‌లో ప‌డి సొంత ఉనికి కోల్పోతున్నార‌నేది వాస్త‌వం. ఇత‌ర పార్టీల కోసం మాట్లాడుతున్నారే త‌ప్ప‌, త‌మ‌కంటూ సొంత ఎజెండా లేకుండా పోయింది. ఇదే బీజేపీ ఎదుగుద‌ల‌కు అడ్డంకిగా మారింది.