ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ప్రత్యర్థి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడ్డాలో అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 22న కుప్పానికి జగన్ వెళ్లనున్నట్టు సమాచారం. నవరత్నాల్లో భాగంగా సంక్షేమ పథక లబ్ధి చేకూర్చే క్రమంలో కుప్పంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. అయితే కుప్పం చంద్రబాబు అడ్డా అనేది గత కాలపు మాట అని వైసీపీ నేతలు అంటున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు, తర్వాత అని కుప్పంలో బలం గురించి మాట్లాడుకోవాల్సి వుంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. 2019కు ముందు వరకూ కుప్పం చంద్రబాబుకు కంచుకోట అనడంలో ఎలాంటి భిన్నాభిప్రాయం లేదంటున్నారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పంలో సీన్ మారిందని, ఇందుకు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే నిదర్శనం అని వారు చెబుతున్నారు.
ఎలాగైనా కుప్పంలో చంద్రబాబును ఓడించాలని జగన్ పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగా కుప్పాన్ని తన నియోజకవర్గమైన పులివెందులలా చూస్తానని ఆయన పదేపదే చెబుతున్న సంగతి తెలిసిందే. కుప్పాన్ని అభివృద్ధి చేసి చూపించి, ఆ తర్వాత ఓట్లు అడగాలనే ఉద్దేశంతో జగన్ ఉన్నారు. దీంతో కుప్పం మున్సిపాల్టీకి రూ.60 కోట్లకు పైగా నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
కుప్పం అభివృద్ధిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. కుప్పంలో వైసీపీని బలోపేతం చేసేందుకు ఏ చిన్న అవకాశాన్ని కూడా వారు వదిలిపెట్టడం లేదు. ఈ క్రమంలో కుప్పంలో వైఎస్ జగన్ బహిరంగ సభను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
రాష్ట్రంలో మరెక్కడా జరగని రీతిలో జగన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వారు ఇప్పటి నుంచే రంగంలోకి దిగినట్టు సమాచారం.