అన్న క్యాంటీన్లపై టీడీపీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి షాక్ ఇచ్చారు. అన్న క్యాంటీన్లతో రాజకీయ ఆకలి తీర్చుకోవాలని ఉత్సాహ పడిన టీడీపీ ఆశలపై జగన్ ప్రభుత్వం నీళ్లు చల్లింది. అసలు అన్న క్యాంటీన్ల ఊసే ఎత్తకూడదని పార్టీ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం.
కుప్పం, తెనాలి తదితర ప్రాంతాల్లో అన్న క్యాంటీన్ల ఏర్పాటు తీవ్ర వివాదానికి దారి తీసిన సంగతి తెలిసింది. తాము ప్రజానీకం ఆకలి తీరుస్తుంటే, వైసీపీ అడ్డుకుంటూ పస్తులు పెడుతోందనే నెగెటివ్ సందేశాన్ని తీసుకెళ్లేందుకు టీడీపీ ప్రయత్నించింది.
ఈ నేపథ్యంలో టీడీపీ ఎత్తుకు వైసీపీ పైఎత్తు వేసింది. ప్రతిరోజూ టీడీపీ ఆధ్వర్యంలో ఎన్ని వేల మందికి ఉచిత భోజనం పెడతారో చూద్దామంటూ… అందులో జోక్యం చేసుకోవద్దని పార్టీ పెద్దల నుంచి ఆదేశాలు వెళ్లినట్టు తెలిసింది. ఇవాళ తిరుపతిలో మున్సిపల్ కార్పొరేషన్ సమీపంలో అన్న క్యాంటీన్ పేరుతో టీడీపీ ఉచిత అన్నదానం చేపట్టింది.
దీన్ని వైసీపీ అడ్డుకుంటుందని టీడీపీ ఎంతో ఆశించింది. అందుకు విరుద్ధంగా తిరుపతి వైసీపీ నేతలు వ్యవహరించారు. అసలు టీడీపీ అన్నదానం కార్యక్రమాన్నే పట్టించుకోకపోవడం చర్చనీయాంశమైంది. ఇదేంటి… వైసీపీ అడ్డుకుంటుందని అన్నదానం ప్రోగ్రాంను చేపడితే, ఎవరూ రాలేదని టీడీపీ నేతలు చర్చించుకోవడం విశేషం.
టీడీపీ అన్నదానం కార్యక్రమం వద్ద పట్టుమని 20 మంది కూడా లేకపోవడం గమనార్హం. నిజానికి అన్న క్యాంటీన్ల పేరుతో వైసీపీపై నెగెటివ్ క్రియేట్ చేయాలని టీడీపీ పక్కా ప్రణాళిక వేసింది. మొదట టీడీపీ ట్రాప్‌లో వైసీపీ పడింది.
పేదలకు అన్నం పెట్టడంపై కంటే అధికార పార్టీని దూషించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం కనిపించింది. దీంతో టీడీపీ అసలు ఎజెండాను గుర్తించిన వైసీపీ… పేదలకు అన్నం పెట్టడం మంచిదే కదా అంటూ వారితో ఖర్చు పెట్టించడానికే మొగ్గు చూపింది. వైసీపీ అడ్డుకోకపోతే అన్న క్యాంటీన్ల నిర్వహణపై టీడీపీ చిత్తశుద్ధి ఏంటో ఒకట్రెండు రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.