తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాంటి లోక్ సభ నియోజకవర్గం విజయవాడ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి ఇక్కడ సానుకూలత ఉంది. లగడపాటి రాజగోపాల్ కాంగ్రెస్ తరఫు నుంచి ఇక్కడ వరసగా రెండు సార్లు గెలిచారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ మళ్లీ ఈ సీటును చేజిక్కించుకుంది. గత ఎన్నికల్లో జగన్ గాలి గట్టిగా వీచినా విజయవాడ ఎంపీ సీట్లో మాత్రం తెలుగుదేశం పార్టీ ఉనికి చాటుకుంది. కేశినేని నాని ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా విజయం సాధించారు.
అయితే కేశినేని నాని అలకలు, తెలుగుదేశం జెండాలు తీసేయడాలు, ఈ మధ్యనే చంద్రబాబుకు ఏదో బొకే ఇవ్వమంటే దురుసుగా తోసేయడం.. వంటి పరిణామాలు అన్నీ మీడియాలో నానుతున్నవే. తెలుగుదేశం పార్టీలో ఉన్నా..చంద్రబాబుపై బాగా అసహనంతో ఉన్నారు కేశినేని నాని. ఈ క్రమంలో ఆయన బీజేపీలోకి చేరబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే తను కచ్చితంగా తెలుగుదేశం పార్టీని వీడే అవకాశాలున్నట్టుగా నాని ముందుకు వెళ్లడం లేదు. అలుగుతున్నారు. ఆ పై తెలుగుదేశం నేతగానే కొనసాగుతూ ఉన్నారు.
విజయవాడ స్థానిక తెలుగుదేశం నేతలతో కూడా నానికి వార్ కొనసాగుతూ ఉంది. వీరి విబేధాలు బహిరంగం అయ్యాయి. రచ్చ రచ్చ అయ్యింది. ఈ క్రమంలో వచ్చేసారి కేశినేని నానికి మరోసారి టికెట్ దక్కుతుందా? అనేది ప్రశ్నార్థకంగానే ఉంది.
ఇందుకు చంద్రబాబు వద్ద ప్రత్యామ్నాయం కూడా రెడీగా ఉందని వినికిడి. వాస్తవానికి విజయవాడ ఎంపీ టికెట్ ఇస్తామంటే పేరున్న కమ్మవాళ్లు చంద్రబాబు ముందు క్యూ కడతారు. వీరిలో సినిమా జనాలు, హైదరాబాద్ లో సెటిలైన కమ్మోళ్లు కూడా ఉంటారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని అయినా వారు పోటీకి సిద్ధం అవుతారు. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో కూడా అవకాశం ఉన్న సీటు ఇది. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ అభ్యర్థి చంద్రబాబుకు పెద్ద కష్టం కాదు!
కానీ, ఇక్కడ టికెట్ ను అయితే కేశినేని నాని కుటుంబీకులకే ఖరారు చేశారట చంద్రబాబు. కేశినేని సోదరుడు కేశినేని చిన్ని ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ అభ్యర్థిత్వం దాదాపు ఖరారే అని తెలుస్తోంది. ఇప్పటికే నాని, చిన్నిల మధ్య విబేధాలు ముదిరాయి. తన కారుపై ఎంపీ స్టిక్కర్ అతించుకుని తిరుగుతున్నాడంటూ సోదరుడిపై ఆయన ఇప్పటికే రచ్చకెక్కారు.
ఇలా అన్నదమ్ముల మధ్య పొలిటికల్ వార్ సాగుతోంది. వీరిలో చంద్రబాబు ఎంపిక కేశినేని చిన్ని అని తెలుస్తోంది. మరి కేశినేని రాజకీయ భవితవ్యం ఏమిటో!