ఎన్నికలు ముగిసి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏదో హడావుడి చేస్తున్నప్పటికీ జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ మాత్రం సైలెంటుగా ఉన్నారు. జగన్‌కు కౌంట్‌డౌన్ మొదలైందని బాబు అంటుండగా, పవన్ నెగెటివ్‌గా కాని, పాజిటివ్గాని కామెంట్లు చేయలేదు. రాజకీయంగా ఆయన ఎలాంటి అడుగులు వేస్తాడో ఎవ్వరికీ అర్థం కావడంలేదు. సినిమాలకు సంబంధించిగాని, రాజకీయాలకు సంబంధించిగాని ఆయన ఎలాంటి సంకేతాలు ఇవ్వనప్పటికీ రకరకాల ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. వాటిల్లో ఎంతవరకు నిజముందో, నిప్పు ఎంతో, పొగ ఎంతో ఇప్పటివరకైతే నిర్ధారణ కావడంలేదు. వచ్చే ఎన్నికల నాటికి పవన్ అలా చేయొచ్చని, ఇలా చేసే అవకాశముందని ఊహాగానాలు చేస్తున్నారు. ఇక సినిమా రంగం విషయానికొస్తే సినిమాల్లో నటించాల్సిందిగా ఆయనపై ఇప్పటికీ తీవ్రమైన ఒత్తిళ్లు వస్తూనే ఉన్నాయని హైదరాబాదులోని కొందరు సినిమా విలేకరులు చెబుతున్న సంగతి.
పవన్‌పై ఒత్తిళ్లు వస్తున్నాయంటూ ఓ ప్రముఖ దినపత్రికలో వార్త కూడా వచ్చింది. దీన్ని పూర్తిగా అబద్ధమని కొట్టిపారేయలేం. అయిదేళ్లపాటు పవన్ ఏం చేస్తాడు? అనే ప్రశ్న పవన్‌తో సినిమాలు నిర్మించాలనుకునే దర్శక నిర్మాతలకు ఎదురవుతోంది. ఆయన పార్టీకి పాతికో, ముప్పయ్యో అసెంబ్లీ స్థానాలు వచ్చుంటే, పవన్ కూడా గెలిచివుంటే అప్పుడు కథ మరోలా ఉండేదేమో. కాని ఎన్నికల్లో పవన్ రెండుచోట్లా ఓడిపోవడంతోపాటు పార్టీ జీరో (ఒక్కరు గెలిచాకనుకోండి) అయింది. సో… ఆయన రాజకీయంగా బిజీగా ఉండే అవకాశం లేదనే భావన సినీవర్గాల్లో ఉంది. జగన్ పార్టీకి బంపర్ మెజారిటీ ఉంది కాబట్టి ఈ అయిదేళ్లలో ప్రభుత్వంలో సంక్షోభం వచ్చే అవకాశం లేదు. కాబట్టి టీడీపీగాని, జనసేనగాని ఎలాంటి కీలకపాత్రా పోషించే పనిలేదు.
చంద్రబాబు, పవన్ చేయాల్సిన పని ఏమిటంటే జగన్ ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రజల్లో ఎండగట్టడం, అవసరమైతే పోరాటాలు చేయడం. ఈ ఐదేళ్లలో ఏదో ఒక సమస్యపై ప్రతిపక్షాలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేయకపోతే మనుగడ కష్టం కాబట్టి ఆ పనులు చేయకతప్పదు. ముఖ్యంగా పవన్ చేయాల్సిన పని వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసుకోవడం, అంతకు ముందుగా పార్టీని సరిగ్గా నిర్మించుకోవడం. అయినప్పటికీ సినిమాలకు సమయం కేటాయించినందువల్ల రాజకీయంగా కలిగే కష్టం ఏమీ ఉండదని సినిమా వర్గాలు భావిస్తుండవచ్చు. పవన్ ఇక సినిమాల్లో నటించడని, ఎవరైనా నిర్మాతలు, దర్శకులు మరీ బవవంతం చేస్తే అతిథి పాత్రల్లో నటిస్తాడని సోదరుడు నాగబాబు ఈమధ్యనే చెప్పాడు. దీనిపై పవన్ స్పందించలేదు. అవుననిగాని, కాదనిగాని చెప్పలేదు. ఆయన ఎంతసేపటికీ రాజకీయాల గురించే మాట్లాడుతుండటంతో సినిమా రంగానికి వీడ్కోలు పలికినట్లేనని సినిమా రంగంలోని కొందరు అభిప్రాయపడుతున్నారు.
అయినప్పటికీ ఆశ చావనివారు కథలు సిద్ధం చేసి పెట్టుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో సోదరుడు నాగబాబు ఓడిపోయినప్పటికీ పవన్ ఆయన్ని వదిలేయలేదు. పార్టీలో సమన్వయకర్తగా నియమించాడు. నాయకులకు-కార్యకర్తలకు మధ్య అనుసంధానకర్తగా నాగబాబు వ్యవహరిస్తాడు. నాగబాబును కూడా పూర్తిగా పార్టీలోకి తెచ్చిన పవన్ కళ్యాణ్ తాను సినిమాల్లో నటించాలనుకుంటాడా? అనే ప్రశ్న ఎదురవుతోంది. అయితే నాగబాబు హీరో కాడు. బిజీ ఆర్టిస్టూ కాడు. ఆయన్ని గురించి దర్శక నిర్మాతలు తహతహలాడే పరిస్థితి లేదు. నాగబాబు ఎలా ఉన్నా రాజకీయంగా కాని, సినిమా పరంగా కాని నష్టపోయే పరిస్థితి లేదు. రాజకీయాల్లోకి రాకముందు కూడా పవన్ ఇబ్బడిముబ్బడిగా సినిమాలు చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు సినిమాలు చేయాలనుకున్నా ఏడాదికి రెండుకంటే మించకపోవచ్చు. మిగిలిన సమయమంతా పార్టీకి కేటాయించవచ్చు.
కాని పార్ట్‌టైమ్ పొలిటీషియన్ అనే విమర్శలు వస్తాయనే భయం ఉండొచ్చు. గతంలో ఇలాంటి విమర్శలే వచ్చాయి. పవన్ విపరీతంగా సినిమాల్లో నటించకపోయినప్పటికీ జనాలకు ఆయనంటే క్రేజ్ ఉంది. కాని అది రాజకీయాల్లో వర్కవుట్ కాలేదు. ఎన్నికల్లో చిరంజీవికి లభించిన జనాదరణ కూడా పవన్ లభించలేదు. ఇందుకు ఆయన స్వయంకృతాపరాధాలు చాలా ఉన్నాయి. అది వేరే విషయం. ఒంటరిగా పోటీచేసి జనసేన ఓడిపోయింది కాబట్టి వచ్చే ఎన్నికల్లో టీడీపీతోగాని, బీజేపీతోగాని పొత్తు పెట్టుకోవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు.
తానా సభల్లో బీజేపీ ప్రముఖ నాయకుడు రాంమాధవ్‌తో పవన్ ఏపీ రాజకీయాల గురించి సుదీర్ఘంగా చర్చించినట్లు వార్తలొచ్చాయి. దీంతో మీడియా పండితులు కొందరు వచ్చే ఎన్నికల వరకు వెళ్లిపోయారు. పొత్తుల గురించి పవన్ ఇప్పటినుంచి ఎందుకు ఆలోచిస్తాడు?