తానాకు వెళ్లినా పవన్ ని వదలట్లేదుగా!

పవన్ కల్యాణ్ ని జిడ్డులా తగులుకున్నారు బీజేపీ నేతలు. ఎన్నికల ముందే జనసేనానికి గాలమేశారు కానీ అది వర్కవుట్ కాలేదు. ఫలితాల తర్వాత తమ బలం చూపించి పవన్ ని తమవైపు లాక్కునేందుకు వ్యూహాలు…

పవన్ కల్యాణ్ ని జిడ్డులా తగులుకున్నారు బీజేపీ నేతలు. ఎన్నికల ముందే జనసేనానికి గాలమేశారు కానీ అది వర్కవుట్ కాలేదు. ఫలితాల తర్వాత తమ బలం చూపించి పవన్ ని తమవైపు లాక్కునేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. కాపు సామాజిక వర్గాన్నంతటినీ దగ్గరకు తీసి, ఆ సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్న పవన్ కల్యాణ్ ని తమ ప్రతినిధిగా పెట్టుకుని ఏపీలో చక్రం తిప్పాలని చూస్తున్నారు. తాజాగా తానా వేదికగా ఈ ప్రయత్నాలు మరింత ముమ్మరం అయ్యాయి.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తానాలో తనవంతు ప్రయత్నాలు ప్రారంభించారు. పవన్ తో ఏకాంతంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై వీరిమధ్య చర్చలు జరిగాయి. అదే సమయంలో బీజేపీలోకి రావాలని కూడా రామ్ మాధవ్ పవన్ ని ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అయితే పవన్ మాత్రం గుంభనంగానే ఉన్నారు. అవునని చెప్పలేదు, అలా అని రామ్ మాధవ్ ప్రతిపాదనను తోసిపుచ్చలేదు కూడా.

ఒంటరి పోరాటం, పాతికేళ్ల ఆరాటం అంటూ చెబుతున్న పవన్ కల్యాణ్ కి ఓటమి ఎంత బాధాకరంగా ఉంటుందో.. రోజులు గడిచేకొద్దీ తెలిసొస్తోంది. సొంతంగా ఏది చేయాలన్నా రివర్స్ అవుతుండే సరికి.. ఏదో ఒక అండ ఉండాలనే భావనలోకి వెళ్తున్నారు జనసేనాని. ఈ విషయాన్ని గ్రహించింది కాబట్టే బీజేపీ తన ప్రయత్నాల్ని మరింత ముమ్మరం చేసింది. ఏపీలో పవర్ సెంటర్ గా మారుస్తామంటూ హామీ ఇస్తోంది. ఇక్కడ కూడా ఓ బలమైన మీడియా ప్రతినిధి రాయబారం యమ జోరుగా నడిచింది.

అయితే పవన్ మాత్రం ఎక్కడా లొంగినట్టు కనపడలేదు. చివరకు తానా సభలకు వచ్చినా కూడా బీజేపీ నేతలు తనని వదలకపోయే సరికి జనసేనాని కాస్త ఇబ్బంది పడినట్టు తెలుస్తోంది. జనసేనాని బీజేపీ రాయబారాలకు తలొగ్గుతారా లేక ఇంకొన్ని రోజులు ఇదే విషయాన్ని నాన్చుతారా.. తేలాల్సి ఉంది. 

వికేంద్రీకరణకే వైఎస్ జగన్ మొగ్గు?