తెలుగులో అర్జున్ రెడ్డి రిలీజై చాన్నాళ్లయింది. తాజాగా హిందీలో కూడా కబీర్ సింగ్ పేరిట ఈ సినిమాను రీమేక్ చేసి రిలీజ్ చేశారు. అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. ఇటు తమిళనాట మాత్రం అర్జున్ రెడ్డి రీమేక్ కు ఆటంకాలు తప్పడంలేదు. పడుతూ లేస్తూ సాగుతున్న ఆ సినిమా తాజాగా మరోసారి ఆగిపోయింది.
అవును.. విక్రమ్ కొడుకు ధృవ్ ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న ఆర్జున్ రెడ్డి రీమేక్ ఆగిపోయింది. ఈ మూవీకి తమిళ్ లో ఆదిత్య వర్మ అనే టైటిల్ పెట్టారు. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ ఆశించిన స్థాయిలో లేదంటూ కామెంట్స్ పడుతున్నాయి. మరీ ముఖ్యంగా కబీర్ సింగ్ రిలీజ్ తర్వాత ఈ నెగెటివ్ కామెంట్స్ మరీ ఎక్కువయ్యాయి. దీంతో యూనిట్ మరోసారి ఆలోచనలో పడింది.
నిజానికి ఈ ప్రాజెక్టును ముందుగా డైరక్టర్ బాల హ్యాండిల్ చేశాడు. దానికి వర్మ అనే టైటిల్ పెట్టాడు. కానీ అవుట్-పుట్ పై అసంతృప్తి వ్యక్తంచేసిన విక్రమ్, బాలను తప్పించి ఆ బాధ్యతను గిరీశయ్యకు అప్పగించాడు. అర్జున్ రెడ్డి సినిమాకు ఇతడు పనిచేయడంతో అవుట్-పుట్ బాగుంటుందని అంతా ఊహించారు. వర్మ టైటిల్ ను కూడా మార్చేసి ఆదిత్య వర్మ అనే టైటిల్ పెట్టారు.
అయితే టైటిల్ మారినా సినిమా అవుట్-పుట్ మాత్రం మారలేదు. పైగా ఈసారి టీజర్ పై కూడా విమర్శలు రావడంతో యూనిట్ కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. దీంతో ఈ నెలలోనే విడుదల చేయాలనుకున్న ఈ సినిమాను నిరవధికంగా వాయిదావేశారు.
కొడుకును హీరోగా పరిచయం చేస్తూ, కాంప్రమైజ్ అవ్వకూడదని నిర్ణయించుకున్నాడు విక్రమ్. అందుకే అసలు ఈ సినిమాను రిలీజ్ చేయాలా వద్దా అనే అంశంపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటాడు.