భాజపా రెండు గుర్రాల స్వారీ

తెలుగునాట ఏ పార్టీ అయినా కావచ్చు. కులాల ఈక్వేషన్లు లేకుండా, సామాజిక వర్గాల అండ లేకుండా విజయాలు సాధించలేదు. అధికారం అందుకోలేదు. హిందూత్వ పునాదులపై ఏర్పడిన భారతీయ జనతా పార్టీ కూడా ఈ సత్యం…

తెలుగునాట ఏ పార్టీ అయినా కావచ్చు. కులాల ఈక్వేషన్లు లేకుండా, సామాజిక వర్గాల అండ లేకుండా విజయాలు సాధించలేదు. అధికారం అందుకోలేదు. హిందూత్వ పునాదులపై ఏర్పడిన భారతీయ జనతా పార్టీ కూడా ఈ సత్యం బాగానే గ్రహించినట్లు కనిపిస్తోంది.

తెలుగునాట రాజకీయాలను ప్రభావితం చేసే సామాజిక వర్గాలు నాలుగు. రెడ్డి, కమ్మ, కాపు, బిసి. తెలుగుదేశం, వైకాపా రెండు ప్రధాన సామాజిక వర్గ పునాదులపై బలమైన పార్టీ నిర్మాణాలు చేసుకున్నాయి. మిగిలిన బిసి, కాపువర్గాలు సమయానుకూలంగా తమ మద్దతు అందిస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో కాపులు చీలిపోవడం, బిసిలు వైకాపాకు అండగా వుండడంతో, తేదేపా ఘోర పరాజయం చవిచూసింది.

ఎన్నికలు చాలా దూరంగా వుండగానే కాపులకు పార్టీ అధ్యక్ష పీఠం కట్టబెట్టి, కమ్మ వర్గాన్ని దూరంపెట్టి, ఓ ప్రయోగం చేసే ప్రయత్నం చేసింది భాజపా. కానీ అవకాశం వచ్చినా కన్నా లక్ష్మీనారాయణ పెద్దగా ఏదీ సాధించలేకపోయారు. దాంతో ఇప్పుడు భాజపా స్ట్రాటజీ మార్చినట్లు కనిపిస్తోంది.

ఆర్థికంగా, ఇంకా అన్నివిధాలా బలమైన కమ్మవర్గ నాయకులను వరుసగా పార్టీలో చేర్చుకుంటూనే, కాపులను కూడా దగ్గరకు తీసే ప్రయత్నం చేస్తోంది. ఇలా అయితే అధికారం సాధించడం సులువు అని భాజపా నేతలు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో ఇంకో విషయం కూడా వుంది. చరిష్మా వున్న నేతలు లేకుండా పార్టీలు మన జాలవు అని వర్తమాన సంఘటనలు చెబుతున్నాయి. ఎన్టీఆర్, వైఎస్సార్, జగన్, కేసిఆర్, అలాగే కేంద్రంలో మోడీ బలమైన నాయకులుగా వున్నారు. చంద్రబాబు బలమైన నాయకుడు అయినా వృధ్యాప్యం వల్ల యువతరాన్ని అంతగా ఆకట్టుకోలేకపోతున్నారు.

అందువల్ల భాజపాకు కూడా ఆంధ్రలో ఇలాంటి నాయకుడు ఒకరు కావాలి. అటు కాపులను దగ్గరకు తీసినట్లు అవుతుంది. ఇటు అలాంటి నాయకత్వ లోటు పూడ్చుకున్నట్లు అవుతుంది. పవన్ కళ్యాణ్ ను కనుక దగ్గరకు తీయగలిగితే. భాజపానేత రామ్ మాధవ్ ఇప్పుడు అదే పని మీద వున్నట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ జనసేనను దగ్గరకు తీసి, కమ్మ నాయకులను పార్టీలో చేర్చుకుంటే, అటు తెలుగుదేశాన్ని నీరసింప చేసినట్లు అవుతుంది. ఇటు కాపుల అండ సంపాదించినట్లు అవుతుంది.

స్ట్రాటజీ బాగానే వుంది కానీ..
భాజపా నాయకులకు తెలియని సంగతి ఏమిటంటే, కమ్మ, కాపుల వైఖరి. భాజపాను తెలుగదేశం పార్టీ 2గా  మార్చాలని పెద్దాయిన వెంకయ్య నాయుడు ఏనాడో ప్రయత్నించారు. ఆంధ్రలో రెండు పార్టీలే వుండేలా, రెండింటిలో కమ్మ సామాజిక వర్గ ఆధిపత్యమే వుండేలా ఆయన గట్టి ప్రయత్నమే చేసారు. కానీ కమ్మవారితో సమస్య ఏమిటంటే, అది వ్యాపార వర్గం. అధికారం వున్నచోటే అది వుండగలదు. వైఎస్సార్ వున్నపుడు ఆయన దగ్గర చేరి పనులు చేయించుకున్నవారిలో ఆ వర్గమే ఎక్కువ. అయితే ఆ వర్గం తీరు తెలిసింది కాబట్టి, జగన్ ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టారు.

వెంకయ్య భాజపాలోకి లాగిన కమ్మ వర్గం, కేంద్రంలో భాజపా అధికారంలో లేని ప్రతిసారీ సైలంట్ అయిపోయింది. దాంతో వైకుంఠపాళిలో పాము నోట్లో పడి కిందకు జారినట్ల, మళ్లీ మొదటికి వచ్చేది భాజపా పరిస్థితి. అదీకాక, ఎన్నికల్లో తేదేపా వున్నన్నాళ్లు, కమ్మ సామాజిక వర్గం ఓట్లు పొరపాటున కూడా మరో పార్టీకి పడవు.

ఇక కాపుల సంగతికి వస్తే, ఆ వర్గం ఎప్పుడూ స్థిరంగా లేదు. ఐక్యంగా అంతకన్నా లేదు. అది చేదు వాస్తవం. అలా వుండి వుంటే చిరంజీవి, పవన్ పరిస్థితి ఇలా వుండేది కాదు. బిసిలు వున్నంత ఐక్యంగా కాపువర్గం ఏనాడూ లేదనే చెప్పాలి. పైగా కాపులను చేరదీస్తే, బిసిలు కచ్చితంగా భాజపా వైపు వుండరు. అయితే తేదేపా, లేదా వైకాపా వైపు వుంటారు. కమ్మవారిని చేరదీసి తేదేపాను వీక్ చేసి, పవన్ తో చేతులు కలిపితే, అది వైకాపాకు మరింత మేలుచేసినట్లు అవుతుంది. ఎందుకంటే రెడ్లు, బిసిలు కలిసి, కాపుల ఓట్లు ఎన్నో కొన్ని తెచ్చుకోవడం అన్నది ప్లస్ అవుతుంది. కమ్మ, కాపు దూరం అయితే తేదేపా వీక్ అవుతుంది.

మరి తెలిసే ఈ స్ట్రాటజీ చేస్తున్నారో? లేక రెడ్లు, బిసిల సంగతి తరువాత చూద్దామని భాజపా అనుకుంటోందో? లేదా జగన్ ను వేరే విధంగా కట్టడి చేసే వ్యూహాత్మక ఆలోచన భాజపా మదిలో దాగి వుందో? మొత్తానికి ప్రస్తుతానికి మాత్రం, కమ్మ-కాపు అనే జోడు గుర్రాల స్వారీ దిశగా వెళ్తోంది భాజపా.
-ఆర్వీ