సినిమా నటుల్లో చాలామంది డబ్బింగ్ లో డైలాగులు కవర్ చేయొచ్చేమో కానీ, రియల్ లైఫ్ లో నాలుగు మాటలు సరిగ్గా మాట్లాడలేరు. అలాంటివారిలో బాలకృష్ణ కూడా ఒకరు. ఎన్టీఆర్ వారసుడే అయినా.. వాక్ చాతుర్యంలో తండ్రికి, బాలయ్యకి పోలిక పెట్టలేం.
బాలయ్య రాజకీయ ప్రసంగాలు విన్న ఎవరికైనా ఇది ఈజీగా అర్థమవుతుంది. ఎక్కడో స్టార్ట్ చేసి ఎక్కడికో వెళ్లిపోతారు. మా తండ్రిగారు.. అంటూ ఇంకెక్కడో ముగిస్తారు. అందులో సగం ఎవ్వరికీ అర్థంకాదు.
చంద్రబాబు తర్వాత టీడీపీ అధ్యక్ష పదవి లోకేష్ కి ఇవ్వడానికి పార్టీలో 70శాతం మందికి ఇష్టంలేదు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. మరి మధ్యే మార్గంగా బాలయ్యకు ఆ పదవి ఇస్తే ఎలా ఉంటుందనే వాదన కూడా ఉంది. కాస్తో కూస్తో జనాకర్షణ ఉన్న నాయకుడు. నందమూరి వారసత్వం ఉంది. మిగతా కుటుంబ సభ్యులు కూడా కలిసొచ్చే అవకాశం ఉంది. మరి బాలయ్యకు ఆ పదవి ఇస్తే..?
లాభం కంటే నష్టమే ఎక్కువ..
ఇస్తే ఇంకేముంది.. మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అంటూ.. అందరూ మా వాళ్లే మాకు ఓట్లు వేయాలంటే అప్పుడేమవుతుంది? భారతరత్న చెప్పుతో సమానం అని ఓ పార్టీ అధ్యక్షుడి హోదాలో నోరు జారితే ఇంకేమైనా ఉంటుందా. ఇలాంటి మాటలు ఒకటి కాదు, వంద మాట్లాడారు బాలయ్య.
ఎమ్మెల్యే మినహా ఆయనకి ఇంకే పదవీ లేదు కాబట్టి, ఆయన మాట తీరు తెలుసు కాబట్టి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ పార్టీ అధ్యక్షుడిగా ఆ వ్యాఖ్యలు చేసి ఉంటే మాత్రం టీడీపీకి మరింత నష్టం జరిగేది. అందుకే బాలయ్య లేకపోతేనే మేలు అనుకుంటున్నారు టీడీపీ నేతలు.
సబ్జెక్ట్ లేకుండా ఎంత తింగరిగా మాట్లాడతారో, అదే స్థాయిలో ఎవరికీ అర్థం కాకుండా జవాబు చెప్పి తప్పించుకుంటారు బాలకృష్ణ. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం గురించి ఆమధ్య ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకు అస్సలు సంబంధం లేకుండా సమాధానం చెప్పిన బాలయ్యను మెచ్చుకోవాలో, తిట్టుకోవాలో తెలియని పరిస్థితి.
అంతే ఆయన మాట్లాడితే ఎవరికీ ఓ పట్టాన అర్థం కాదు. అయితే ఇదీ ఒకందుకు మంచిదే అనుకుంటున్నారు అంటున్నారు టీడీపీ నేతలు. ఆయన అర్థమయ్యేలా మాట్లాడితే అసలుకే మోసం వస్తుందని భయపడుతున్నారు. అందుకే బాలయ్య మాట్లాడినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు.
పదవిని దూరం చేసేవి మాటలే..
లోకేష్ కి మాటలు పెగలవు, బాలయ్యకి మాటలు ఆగవు. మామా అల్లుళ్లు ఇద్దరూ ఇద్దరే. అందుకే వీరిద్దరికీ టీడీపీ అధ్యక్ష పదవి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.
ఇప్పుడే కాదు, బాలకృష్ణ ఎప్పటికీ టీడీపీకి అధ్యక్షుడు కాలేరు. దీనికి కారణం ఆయన మాట తీరు.