వైసీపీ సోషల్ మీడియా గోడు పార్టీ పెద్దలు తప్పక వినాలి. వాళ్ల బాధ వర్ణనాతీతం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు పొందిన వాళ్లలో పని చేసిన వాళ్లెందుకు, షో చేసిన వాళ్లెందరు అనే చర్చ జరుగుతోంది. వైఎస్ జగన్ సీఎం కావాలని ఎంతో శ్రమించిన వాళ్లను పార్టీ ఇప్పటికీ గుర్తించడం లేదనే ఆవేదన వుంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించి కన్వీనర్లు, కో కన్వీనర్లను పార్టీ నియమించింది. రెండు రోజుల పాటు విజయవాడలో మీటింగ్ కూడా నిర్వహించింది.
అనంతరం గ్రామ స్థాయి వరకూ సోషల్ మీడియా కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలనే పెద్ద బాధ్యతను కన్వీనర్లు, కో కన్వీనర్లపై వైసీపీ అధిష్టానం మోపింది. ఇంత వరకూ బాగానే వుంది. జిల్లా వ్యాప్తంగా తిరిగి, కమిటీలను వేయడానికి కనీసం దారి ఖర్చులకైనా ఇవ్వకపోతే, తాము అప్పులపాలవుతామనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కొందరు అంతర్గతంగా వైరల్ చేస్తున్న పోస్టు ఒకటి వెలుగు చూసింది. ఈ పోస్టు చదివితే వైసీపీ సోషల్ మీడియాలో ఎంత ఆవేదనతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఆ పోస్టులోని ముఖ్యమైన విషయాలను పరిశీలిద్దాం.
“మొన్న వైస్సార్‌సీపీ సోషల్ మీడియాలో 130+ మందికి కన్వీనర్, కో కన్వీనర్ పదవులు ఇవ్వడం అందరికీ తెలిసిందే. రానున్న రోజుల్లో వాళ్ళ కర్తవ్యం ఏంటి ? మండల ,గ్రామ స్థాయిల్లో పార్టీ సోషల్ మీడియాని బలోపేతం చేయడం. అలా చేయాలి అంటే వాళ్ళు వాళ్ళ పనులన్నీ మానుకోవాలి కదా !! మరి వాళ్ళకి ఆదాయం ఎక్కడ నుంచి వస్తుంది ?
మాకు తెలిసి వాళ్లలో చాలామందికి ఎలాంటి ఉద్యోగం, ఆదాయ మార్గం కూడా లేదు. ఇంకొంత మందికి ఏదో చిన్నచిన్న వ్యాపారాలు ఉన్నట్టున్నాయ్. మెజార్టీ మాత్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవాళ్లే. అలాంటి వాళ్లకి ఆర్థికంగా భరోసా ఇవ్వాల్సిన బాధ్యత వైసీపీ పెద్దలకు లేదా?
రాష్ట్రస్థాయిలో సోషల్ మీడియాని లీడ్ చేస్తున్న వాళ్లు ఎలాంటి ఆదాయాన్ని ఆశించకుండా, జీతాలు తీసుకోకుండా పార్టీ కోసం ఉచితంగా పని చేస్తున్నారా? ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్లంతా ఏదో రకంగా లాభాలు పొందుతున్నారు కదా! వాళ్లు కూడా పార్టీ కోసం ఉచితంగా పనిచేసి ఆదర్శంగా ఉంటే బాగుంటుంది. కొత్తగా నియమించిన ఈ 130+ మందిని మాత్రం వాళ్ళు పనులన్నీ పక్కన పెట్టి ఉచితంగా పనిచేయాలి అనడం ఎంతవరకు సమంజసం? వాళ్ళకి ఎందుకు జీతాలు ఇవ్వకూడదు?
ఆర్థికంగా భరోసా ఇస్తే వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టి ఇంకాస్త ఫోకస్ గా పార్టీ కోసం పని చేస్తారు కదా! ఇప్పుడు డిజిటల్ మీడియాలో కొంత మంది జీతాలు తీసుకొని పని చేస్తున్నారు కదా! మరి కొత్తగా నియమితులైన వాళ్లు భారమవుతారా?
టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నా జీతాలు ఇచ్చి ITDP అని ఆఫీషియల్ సోషల్ మీడియాని నడుపుతోంది. అలాగే సింగిల్ సీట్ ఉన్న జనసేన కూడా IPhone లు ఇచ్చి సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తోంది. మరి మనకేం పోయేకాలం చెప్పండి? 2012 నుంచి 2019 దాకా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని నమ్ముకొని ఎన్నో త్యాగాలు చేసి ఎంతోమంది చితికిపోయారు. ఇప్పుడు అలాంటి వాళ్లలో కొంతమందిని అయినా ఆదుకోవాల్సిన అవసరం ఉందా లేదా చెప్పండి?
ఇప్పుడు అధికారంలో ఉండి కూడా మీరు త్యాగాలు చేయండి ,పై లెవెల్లో ఉన్న మేము పదవులు, హోదాలు అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తాం అనడం ఎంత వరకు కరెక్ట్ ?” అని నిలదీస్తూ రాసిన పోస్టు వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరీ ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీలు తమ సోషల్ మీడియా యాక్టివిస్టులను బాగా చూసుకుంటున్నాయని రాయడం వైసీపీకి ఆందోళన కలిగించే అంశం. ఏది ఏమైనా వైసీపీ సోషల్ మీడియాలో నివురుగప్పిన అసంతృప్తి నిప్పును ఈ పోస్టు ప్రతిబింబిస్తోంది.