బిగ్‌బాస్ షోపైన రివ్యూలు చెప్పి పాపులర్ అయిన గలాటా గీతు స్టార్టింగ్ నుంచే గొడవలు స్టార్ట్ చేసింది. శకునం చెప్పే బల్లి కుడితిలో పడినట్టు, బయట నుంచి మాట్లాడ్డం వేరు, హౌస్‌లో అందరినీ కలుపుకుని పోవడం వేరు.
ఆదివారం హౌస్‌లోకి రాగానే హాయ్ చెప్పుకుని ఆలింగనం చేసుకున్నారు. సోమవారం అసలు ఆట ప్రారంభమైంది. గీతు తనది ప్రత్యేక ధోరణి అన్నట్టు, మొహం మీదే మాట్లాడుతాను అన్నట్టు వ్యవహరించడం చాలా మందికి ఇరకాటంగా ఉంది. అందుకే ఆమెని నామినేషన్‌లో ట్రాష్ కేటగిరికి చేర్చారు. ఈ వారం ఆమె డైరెక్ట్ నామినేషన్‌లో వున్నట్టు. బాధ కలిగించిన ఒక సంఘటన చెప్పమని బిగ్‌బాస్ టాస్క్ ఇస్తే చాలా సేపు ఒంటరిగా తనలో తాను మాట్లాడుతూ చేసిన యాక్షన్ కొంచెం ఓవర్ అనిపించింది.
ఇంతా చేస్తే ఆమె ఎదుర్కొన్న దారుణమైన విషాదాలు ఏమీ లేవు. యాక్సిడెంట్ అయినపుడు తండ్రి దగ్గరుండి చూసుకోవడం కొంచెం కదిలించింది. బాత్‌రూమ్ క్లీనింగ్ విషయమై పెద్ద గొంతుతో అందరినీ అరవడం చిరాకు తెప్పించింది. ఇనయా సుల్తాన్ ఈ విషయమై గట్టిగా గొడవ పడింది కూడా.
యూట్యూబ్ వీడియోల్లో ఆమె ఇష్టం. ఏం మాట్లాడినా చెల్లుతుంది. కానీ బిగ్‌బాస్ హౌస్ అందరిదీ. ఎవరి అభిప్రాయాలు వాళ్లకుంటాయి. స్మూత్‌గా వ్యవహరించకపోతే నష్టం ప్లెజెంట్‌గా కాకుండా, ఎప్పుడూ చిరాగ్గా చిటపటలాడుతూ వుండడం గీతూకి డేంజర్. ఒక రోజులోనే జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. కానీ యాటిట్యూడ్ తెలిసిపోతుంది. పైగా ఇప్పుడు నాన్‌స్టాఫ్ స్ట్రీమింగ్ వుంది.
ట్రాష్‌లోకి వెళ్లిన రెండో వ్య క్తి రేవంత్. తాను కొంచెం అధికుడనే ఫీలింగ్ రేవంత్‌లో ఉన్నట్టుంది. కనిపిస్తూ వుంది కూడా. బిగ్‌బాస్‌లో ఎపుడూ కులాల ప్రస్తావన రాదు. రేవంత్ తాను ఎవరో చెప్పడం యాటిట్యూడ్.
ఆదిరెడ్డి నిమ్మళంగా, బ్యాలెన్సింగ్‌గా వున్నాడు. బిగ్‌బాస్ చూసిచూసి ఎలా వుండాలో బాగా నేర్చుకున్నట్టున్నాడు. పైమా అమాయకంగా జోక్స్ వేస్తూ నవ్విస్తూ వుంది. ముందుముందు పైమా బలమైన కంటెస్టెంట్. అందరితో సున్నితంగా, బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నది బాలాదిత్య, అభినయశ్రీ. ఆదిత్య అందరినీ కలుపుకుంటూ పెద్దన్నయ్యలా వ్యవహరిస్తూ వుంటే, అభినయశ్రీ స్పష్టమైన అభిప్రాయాలతో హుందాగా వుంది.
చలాకీ చంటి కామెడీ యాంగిల్ ఇంకా బయట పడలేదు. కాసేపు రజనీకాంత్ మిమిక్రీ చేసాడు (రెగ్యులర్ షోలో ఈ సీన్ లేదు). ఇనయా సుల్తానా తండ్రి గురించి చెప్పి అందరినీ ఏడ్పించింది. యాక్సిడెంట్‌లో కుటుంబాన్ని పోగొట్టుకున్న కీర్తి అది విని వెక్కివెక్కి ఏడ్చింది.
ఆరోహిరావు కలుపుగోలుకి ప్రయత్నిస్తూ వుంది. కానీ ఇంకా సెట్ కాలేదు. రాజశేఖర్, ఆర్జే సూర్య, షానీ, అర్జున్‌కల్యాణ్, శ్రీహాన్ ఇంకా ఓపెన్ కావడం లేదు. టాస్క్‌ల్లో వాళ్లేమిటో తెలుస్తుందేమో. పింకీ, నేహా ఊరికే కనిపిస్తూ అటూఇటూ తిరుగుతున్నారు. శ్రీసత్య డల్‌గా వుంది. మెరీనా కిచెన్‌లో ఎక్కువగా ఉంది. రోహిత్ యాక్టీవ్‌గా లేడు. వాసంతి కృష్ణన్ క్యూట్‌గా నవ్వుతూ వుంది. వాచీ, ఫోన్ బయట ప్రపంచం లేని బిగ్‌బాస్ హౌస్‌కి అలవాటు పడడానికి ఇంకా టైమ్ పడుతుంది. అడ్జెస్ట్ అయిన వాళ్లు వుండగలుగుతారు. కాని వాళ్లు బయటికొస్తారు. నిజానికి ప్రపంచమే ఒక బిగ్‌బాస్ హౌస్. ఎక్కడైనా అదే మనుషులు!
జీఆర్ మహర్షి