ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల పరిస్థితి ఏమంత బాగున్నట్లు కనిపించడం లేదు. మహర్షి సినిమా తరువాత కాస్త మంచి కలెక్షన్ల కళ్ల చూసిన సినిమా లేకుండా పోయింది. సినిమాలు వస్తున్నాయి. వెళ్తున్నాయి. బాగాలేని సినిమాల సంగతి అలావుంచితే, బాగా వున్నాయి అని టాక్ వచ్చి, మంచి రేటింగ్ లు వచ్చినా కూడా కలెక్షన్లు అంతంత మాత్రంగా వుంటున్నాయి.
జూన్ నెల వాస్తవానికి సినిమాలకు బ్యాడ్ సీజన్. అయినా బోలెడు సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో గేమ్ ఓవర్, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, బ్రోచేవారెవరురా సినిమాలకు మంచి టాక్, మంచి రేటింగ్ లు వచ్చాయి. కానీ ఆ రేటింగ్ లు టాక్ మేరకు కలెక్షన్లు కనిపించలేదు. అయితే మూడూ కూడా చిన్న సినిమాలు కావడంతో, సమస్య లేకపోయింది. అదే వాటి బడ్జెట్ కాస్త ఆరేడు కోట్ల రేంజ్ లో వుంటే పరిస్థితి కష్టంగా వుండేది.
జూలై నెల వచ్చినా పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. స్కూళ్లు, పుస్తకాలు, ఎంట్రన్స్ లు, అడ్మిషన్లు, అలాగే రైతు వారీ పనులు ఇవన్నీ కలిసి థియేటర్ల దగ్గర హడావుడి తగ్గిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. దీనికి తోడు అక్కడ అక్కడ వర్షాలు దెబ్బతీస్తున్నాయి.
ఓబేబీ సినిమా మాంచి బజ్ తో విడుదలయింది. ఇటీవలి కాలంలో ఇంత ప్రచారం, ఇంత బజ్ మరి దేనికీలేదు. అయినా ఓపెనింగ్స్ మాత్రం ఆ రేంజ్ లో లేవు. అర్బన్ సెంటర్లలో కొన్ని చోట్ల మాత్రం ఫుల్స్ వచ్చాయి. మిగిలిన చోట లేదు. అయితే మంచి టాక్,. మంచి రేటింగ్ లు వచ్చినందున శని, ఆదివారాలు ఫుల్ గా కలెక్షన్లు వుంటాయని అనుకోవచ్చు.
అమెజాన్ ప్రభావం, సీజన్ బాగా లేకపోవడం, భారీ సినిమాలు అయితే తప్ప జనాలు థియేటర్ కు అంతగా రాకపోవడం, వీకెండ్ అయితేనే సినిమాకు రావడం వంటి మారుతున్న వ్యవహారాల కారణంగా థియేటర్లు, సినిమాలు వెలవెలబోతున్నాయని బయ్యర్లు అంటున్నారు.
ఇదిలావుంటే ఈ ప్రభావం రాబోయే సినిమాల మార్కెట్ మీద కూడా పడుతోంది. మన్మధుడు 2 సినిమాను ఆంధ్రలో ఎనిమిది కోట్ల మేరకు చెబతున్నారు. ఇస్మార్ట్ శంకర్ ఆరంభంలో బోలెడు రేటు చెప్పారు. ఇప్పుడు అది కూడా ఏడు కోట్ల రేషియోకి వచ్చేసినట్లు బోగట్టా. డియర్ కామ్రేడ్, శర్వానంద్ రణరంగం సినిమాలు ఆంధ్ర 10 కోట్ల రేషియోకే సరిపెట్టుకుంటున్నారు. దొరసాని సినిమాను ఇంకా మార్కెట్ పూర్తి చేయలేదు.
మొత్తంమీద చూసుకుంటే టాలీవుడ్ సినిమాల పరిస్థితి ఏమంత బాగున్నట్లు కనిపించడం లేదు.