చివరి మజిలీలో గద్దర్ ‘కాషాయం’ కడతారా?

దేశానికి కొత్త పార్లమెంటు భవనం అనేది మోడీ ప్రభుత్వ హయాంలో రూపుదిద్దుకుంటోంది. ఇది ఎప్పటినుంచో నడుస్తున్న ఆలోచన.. ప్రస్తుతం నిర్మాణం కూడా పూర్తి చేసుకునే దశలో ఉంది. ప్రతి విషయంలో చాలా ప్లానింగ్ తో…

దేశానికి కొత్త పార్లమెంటు భవనం అనేది మోడీ ప్రభుత్వ హయాంలో రూపుదిద్దుకుంటోంది. ఇది ఎప్పటినుంచో నడుస్తున్న ఆలోచన.. ప్రస్తుతం నిర్మాణం కూడా పూర్తి చేసుకునే దశలో ఉంది. ప్రతి విషయంలో చాలా ప్లానింగ్ తో ఉండే ప్రధాని నరేంద్రమోడీ.. ఇప్పటిదాకా దానికి ఒక పేరు అనుకోకుండా ఉంటారా?

తన భావజాలానికి తగినట్టుగా ఉండడంతోపాటు, పార్టీకి ఉపయోగపడగల ప్రచారాంశంగా కూడా ఉండే పేరును ప్లాన్ చేసుకోకుండా ఉంటారా? అయినా సరే.. దానికి ఫలానా పేరు పెట్టాలంటూ సూచనలు ప్రముఖులనుంచి వస్తూనే ఉంటాయి.

ఇటీవల గద్దర్ కూడా అలాంటి ప్రయత్నం  చేశారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ను కలిసి.. పార్లమెంటు కోసం నిర్మిస్తున్న నూతన భవనానికి అంబేద్కర్ పేరు పెట్టేలా ప్రధాని నరేంద్రమోడీని ఒప్పించాలని సూచించారు! ఈ విషయాన్ని బండిసంజయ్ ను కలిసిన తర్వాత ఆయనే ప్రకటించారు. 

సాధారణంగా, గద్దర్ లాంటి నాయకుడు వెళ్లి బండి సంజయ్ ను కలవగానే.. రాజకీయ చేరికలకు సంబంధించిన మాటలే, అనుమానాలే పుడతాయి. గద్దర్ బిజెపిలో చేరుతారేమో అనే ప్రచారం పుట్టినా ఆశ్చర్యం లేదు! కానీ.. వామపక్ష భావజాలంతో చాలా గాఢంగా పెనవేసుకుపోయిన జీవిత నేపథ్యం ఉన్న గద్దర్, కాషాయం కడతారా, కమలదళంతో కలుస్తారా? అంటే వెంటనే నమ్మబుద్ధి కాదు! కానీ ఏమో రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. సూర్యుడు పశ్చిమాన కూడా ఉదయించవచ్చు. 

తాను వెళ్లి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిని, ఒక సాధారణ ఎంపీని కలిసి ఒక ప్రతిపాదన పెట్టేసి, దానిని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లమని అడిగితే.. పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టేస్తారని గద్దర్ నిజంగానే నమ్మారా? ఆయన అలాంటి ప్రతిపాదన చేయదలచుకుంటే.. బండి సంజయ్ ను కలవాల్సిన అవసరం ఏమిటి? నేరుగా ప్రధాని మోడీ లేదా, అమిత్ షా ల అపాయింట్మెంట్ తీసుకోలేరా? అనేవి మనకు ఎదురయ్యే ప్రశ్నలు.

కాదూ కూడదూ.. అంబేద్కర్ మీద భక్తితోనే.. తనను తాను అంబేద్కరైట్ గా ప్రకటించుకున్న ఈ గుమ్మడి విఠల్ రావు వెళ్లి బిజెపి నేతతో ప్రతిపాదన పెట్టారనే అనుకుందాం. పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టమని సలహా ఇచ్చినట్టే, తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్ఠాత్మకంగా ఘనంగా నిర్మస్తున్న సెక్రటేరియేట్ భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని కేసీఆర్ కు ప్రతిపాదించవచ్చు కదా! అనే ఊహ ఎవరికైనా వస్తే.. అలా చేయకపోవడం వలన.. ఆయన బిజెపి పట్ల మొగ్గుతున్నారా అనే అనుమానం కలిగితే ఏమీ చేయలేం.