లైగర్ సినిమా దారుణంగా ఫెయిలయింది బాక్సాఫీస్ దగ్గర. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే…నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే అని శ్రీశ్రీ చెప్పినట్లు…సినిమా ముందు ఆకాశమంత ఎత్తు బజ్… విడుదల తరువాత సీన్ అంతకు అంతా రివర్స్. దీంతో రకరకాల వార్తలు..గ్యాసిప్ లు.
మరోపక్క జనగణమన సినిమా ఆగిపోయింది. నిజానికి లైగర్ సినిమా విడుదల అయిన మర్నాడే హీరో ఆ సినిమాను ఇక పక్కన పెడదాం అని చార్మికి చెప్పేసాడని వార్తలు వచ్చాయి. అదే ముందుగా గ్రేట్ ఆంధ్ర వెల్లడించింది కూడా. మొత్తానికి అదే ఫైనల్ అయింది.
ఇప్పుడు పూరి తరువాత సినిమా కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. మెగాస్టార్ ను పూరిని కలిపే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని బోగట్టా. ఇక్కడ చిన్న అడ్డంకి వుందని తెలుస్తోంది. మెగాస్టార్ చేస్తే వేరే బ్యానర్ అంటారు. కానీ పూరి తన పిసి కనెక్ట్స్ నే అంటారు. ఇది కాక వేరే ఆలోచనలు కూడా సాగుతున్నాయి.
ఇదిలా వుంటే ఆర్థికంగా కూడా పూరికి సమస్యలు ఏమీ లేవని తెలుస్తోంది. లైగర్ సినిమా వల్ల ఆయన వెనక్కు ఇవ్వాల్సిన మొత్తం అంటు హిందీ, తెలుగు, హీరో, ఇలా అన్నీ కలిపినా 60 కోట్ల మేరకు వుంటుందని, అయితే లైగర్ సినిమా మార్కెటింగ్ వల్ల మిగిలిన మొత్తం దాని కన్నా ఎక్కువే అని లెక్కలు చెబుతున్నారు. ఈ లెక్కలు పూరికి సన్నిహితమైన క్యాంప్స్ నుంచే వినిపిస్తున్నాయి.
హిందీ బెల్ట్ లో ఇద్దరికి, తెలుగునాట వరంగల్ శ్రీను, ఎన్వీ ప్రసాద్ కు, వెనక్కు ఇవ్వాల్సి వుంటుంది అంటున్నారు. పూరి అన్నీ క్లియర్ చేసినా ఒక రూపాయి మిగులు లోనే వుంటారు తప్ప లోటు అనే ప్రసక్తి లేదని విశ్వసనీయ వర్గాల బోగట్టా.