అసభ్య‌క‌ర పోస్టు పెట్టింద‌ని ఆమె కోసం వెతుక్కుంటూ!

అనంత‌పురం జిల్లా వైసీపీ మ‌హిళా ఎమ్మెల్యే జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తిపై సోష‌ల్ మీడియాలో ఓ అస‌భ్య‌క‌ర పోస్టు వైర‌ల్ అవుతోంది. ఈ పోస్టును ప్ర‌త్య‌ర్థి పార్టీకి చెందిన సోష‌ల్ మీడియా యాక్టివిస్ట్ పెట్టార‌ని పోలీసుల‌కు ఫిర్యాదు…

అనంత‌పురం జిల్లా వైసీపీ మ‌హిళా ఎమ్మెల్యే జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తిపై సోష‌ల్ మీడియాలో ఓ అస‌భ్య‌క‌ర పోస్టు వైర‌ల్ అవుతోంది. ఈ పోస్టును ప్ర‌త్య‌ర్థి పార్టీకి చెందిన సోష‌ల్ మీడియా యాక్టివిస్ట్ పెట్టార‌ని పోలీసుల‌కు ఫిర్యాదు అందింది. దీంతో అసభ్య‌క‌ర పోస్టు పెట్టిన స‌ద‌రు మ‌హిళ కోసం అనంత‌పురం జిల్లా పోలీసులు వెతుక్కుంటూ జిల్లా ప‌రిధి దాటి వెళ్లారు.

ఉండ‌వ‌ల్లి అనూష‌… ఐ-టీడీపీ అధికార ప్ర‌తినిధి. సోష‌ల్ మీడియాలో టీడీపీ త‌ర‌పున బ‌ల‌మైన వాయిస్. త‌న పార్టీ నేత‌ల‌పై ప్ర‌త్య‌ర్థుల విమ‌ర్శ‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొడుతూ వుంటారు. ప్ర‌త్య‌ర్థుల నుంచి అదే స్థాయిలో విమ‌ర్శ‌ల‌ను కూడా ఎదుర్కొంటూ వుంటారు. ఒక్కోసారి సొంత పార్టీ నేత‌ల నుంచే వేధింపులు ఎదుర్కోవ‌డం తీవ్ర ఆవేద‌న క‌లిగిస్తోంద‌ని క‌న్నీటి ప‌ర్యంతమ‌వుతూ కూడా క‌నిపించారు.

ఇదిలా వుండ‌గా శింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే ప‌ద్మావ‌తిపై సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌ర పోస్టు పెట్టార‌ని ఫిర్యాదు రావ‌డం, దానికి కార‌కురాలిగా అనూష‌ను అనంత‌పురం జిల్లా పోలీసులు గుర్తించారు. దీంతో ఏలూరులోని ఆర్ఆర్‌పేట‌లో వ‌స్త్ర దుకాణం నిర్వ‌హిస్తున్న అనూష వ‌ద్ద‌కు అనంత‌పురం పోలీసులు వెళ్లారు. 41ఎ కింద ఆమెకు నోటీసులు అంద‌జేశారు. మూడు రోజుల్లోపు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరారు.

అయితే అనూష స్పంద‌న మ‌రోలా వుంది. అస‌లు పోలీసులు తన‌విగా చెబుతున్న ఐడీలతో త‌న‌కు ఏ మాత్రం సంబంధం లేద‌న్నారు. ఎవ‌రో ఏదో ఫిర్యాదు చేస్తే… అంత దూరం నుంచి వ‌చ్చి నోటీసు ఇవ్వ‌డం ఏంట‌ని ఆమె ప్ర‌శ్నించారు. న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించ‌నున్న‌ట్టు ఆమె తెలిపారు. 

టీడీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌ను అరెస్ట్ చేయ‌డం అంత ఈజీ కాద‌ని ఏపీ పోలీసుల‌కు ఒక్కో అనుభ‌వం ఒక్కో గుణ‌పాఠం చెబుతోంది. అనూష విష‌యంలోనూ అలాంటి అనుభ‌వ‌మే ఎదురుకానుంది. ఎందుకంటే త‌ప్పు చేసే వాళ్లెవ‌రైనా చ‌ట్టానికి చిక్కేంత అజాగ్ర‌త్త‌గా ఉంటారా?