గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బెయిల్ కోసం ఆయన భార్య ఉషాభాయ్ న్యాయపోరాటానికి దిగారు. తన భర్తను పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించిన పిటిషన్‌లో ఆమె కీలక అంశాలను ప్రస్తావించడం గమనార్హం. కేవలం కొందరిని సంతృప్తిపరచడం కోసమే తన భర్తను పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి జైల్లో ఉంచారని పేర్కొన్నారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తరచూ మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. హిందువులపై ప్రేమ, ముస్లింలపై ద్వేషాన్ని ప్రదర్శించేలా ఆయన వ్యాఖ్యలుంటాయి. ఈ నేపథ్యంలో ముస్లింలకు సంబంధించి ఫేస్‌బుక్‌లో తీవ్ర విద్వేష వ్యాఖ్యలు చేయడంపై సొంత పార్టీ బీజేపీ కూడా సీరియస్ అయ్యింది. పార్టీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేసింది. అంతేకాదు, పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదని బీజేపీ షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే.
మరోవైపు టీఆర్ఎస్ ప్రభుత్వం రాజాసింగ్‌పై కఠిన చర్యలకు ఉపక్రమించింది. రాజాసింగ్‌ను అరెస్ట్ చేసి ఇప్పటికి 12 రోజులైంది. భర్త బెయిల్ కోసం ఉషాభాయ్ కోర్టును ఆశ్రయించారు. తన భర్త అరెస్ట్ ఎలా రాజ్యాంగం విరుద్ధమై పిటిషన్‌లో ఆమె పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 14, 21 అధికరణాలకు వ్యతిరేకంగా రాజాసింగ్‌ను అక్రమంగా నిర్బంధించారని ఉషా పేర్కొన్నారు.
కేసుల గురించి చెప్పకుండానే పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం అన్యాయని ఆమె వాపోయారు. రాజాసింగ్‌కు నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని, రిమాండ్‌కు పంపేందుకు కింది కోర్టు అంగీకరించలేదని హైకోర్టుకు వివరించారు. కేవలం ‘కొందరి’ని సంతృప్తి పరిచేందుకే తన భర్తను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని పరోక్షంగా అధికార పార్టీ నేతల గురించి ప్రస్తావించారు.