తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన రాజకీయ అవసరం మేర తెచ్చి పెట్టిన పాత్రల్లో ఒకరు నందమూరి సుహాసిని. ఎన్టీఆర్ మనవరాలు, నందమూరి హరికృష్ణ కూతురు. ఇది వరకూ ఒకసారి చంద్రబాబు నాయుడు వ్యూహాల మేరకు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు నందమూరి సుహాసిని. ఓడిపోవడం మాట అటుంచితే.. ఆమె కనీసం పోటీ ఇవ్వలేకపోయారు. అంతా మనదే అనుకుని ఆమె పోటీ చేస్తే.. చంద్రబాబు ఆడిన ఆటలో ఆమె పావయ్యారు.
ఆమె తరఫున ఎన్టీఆర్ చేత ప్రచారం చేయించాలనే ప్రయత్నం చేసి కూడా చంద్రబాబు విఫలం అయ్యారు. నందమూరి ఫ్యామిలీలో విబేధాలు కూడా అలా బహిర్గతం అయ్యాయి. ఆ సంగతలా ఉంటే.. నందమూరి సుహాసిని కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని సమాచారం. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి కూకట్ పల్లి నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి.
ఇదంతా చంద్రబాబు తాజా స్కెచ్ ప్రకారం జరుగుతోందని భోగట్టా. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కథ కంచికి చేరింది. ఈ నేపథ్యంలో సుహాసినిని కాంగ్రెస్ లోకి చేరడానికి చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ తెలంగాణ విభాగం అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు అవసరాలను కాదనే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో సుహాసినిని చేర్చుకోవడానికి అయినా, ఆమెకు టికెట్ విషయంలో అయినా చంద్రబాబు అవసరాలు చకచకా తీరిపోయే అవకాశాలున్నాయి.
మరి కాంగ్రెస్ తరఫున అయినా సుహాసిని ఏ మేరకు పోటీ ఇవ్వగలదనేది వేరే సంగతి. ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ ను బీజేపీ దువ్వుతోంది. మరి ఈ పరిణామం సుహాసినిని ఆలోచనలో పడేస్తుందా లేక చంద్రబాబు లెక్కల ప్రకారం ఆమె కాంగ్రెస్ లోకి చేరి పోటీ చేస్తారో!