టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ భలే విచిత్రంగా ఉంది. ఆల్రెడీ కన్నుకు తీవ్రగాయమై ఒక నాయకుడు బాధపడుతుంటే, మరోసారి రిపీట్ అయితే బాగోదని చంద్రబాబు హెచ్చరికలను ఎలా అర్థం చేసుకోవాలో? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
రెండు రోజుల క్రితం వైసీపీ శ్రేణుల దాడిలో టీడీపీ విజయవాడ సిటీ నాయకుడు చెన్నుపాటి గాంధీ కంటికి తీవ్రగాయమైంది. కంటి చూపు పోతుందేమోనని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురి అయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇవాళ ఆయన్ను చంద్రబాబు పరామర్శించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ధోరణిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఖబడ్దార్…ఇలాంటి ఘటన మరొకటి జరిగితే వదిలి పెట్టే సమస్యే లేదని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించడం గమనార్హం. కన్ను పొడవడం దుర్మార్గమన్నారు. దోషులకు శిక్ష పడే వరకూ న్యాయపోరాటం సాగిస్తామని ఆయన హెచ్చరించారు.
ఇలాంటి ఘటన మరోసారి జరిగితే వదిలి పెట్టే ప్రసక్తే లేదంటే, ఇప్పుడు విడిచి పెట్టారని భావించాలా? గాంధీ కంటి చూపు పోయేంతగా దాడి జరిగితే, తీవ్రస్థాయిలో ప్రతిఘటించడానికి బదులు హెచ్చరికతో కాలయాపన చేయడం ఏంటో చంద్రబాబుకే తెలియాలి. హత్య కంటే ఇది తీవ్రమైన నేరంగా భావించాల్సి వుంటుంది.
ఎందుకంటే మనిషిని అంధుని చేసే హక్కు ఎవరికీ లేదు. కంటి చూపు పోతే జీవితం నరకప్రాయమే. అలాంటి నేరానికి ఎవరు పాల్పడినా క్షమించకూడదు. కానీ చంద్రబాబు మాత్రం మిగిలిన ఘటనల మాదిరిగానే ఈ సంఘటనను చూడడం ఆశ్చర్యం కలిగిస్తోంది.