ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు గురువులు కనువిప్పు కలిగించాల్సిన సమయం ఆసన్నమైందని జనసేనాని పవన్‌కల్యాణ్ గుర్తు చేశారు. ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పవన్ వారి గొప్పతనాన్ని చెబుతూనే, మరోవైపు కర్తవ్య బోధన చేయడం విశేషం. ఇదే రీతిలో చంద్రబాబు కూడా ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పాలనపై యుద్ధం ప్రకటించాలని పవన్ ఆకాంక్షించడం గమనార్హం.
సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గురువులందరితో పాటు సర్వేపల్లిని కూడా గౌరవించుకున్నట్టే అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన బాల్యంలోకి వెళ్లారు. చిన్నప్పుడు నెల్లూరులో చదువుకున్నప్పటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. నెల్లూరులో తనకు పాఠాలు చెప్పిన గురువుల యోగక్షేమాల గురించి స్నేహితుల ద్వారా ఇప్పటికీ తెలుసుకుంటూ వుంటానన్నారు.
గురువుల గురించి తెలుసుకున్నప్పుడల్లా మనసు ఆనందంతో నిండిపోతుందన్నారు. చివరిగా ఆయన ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. వైసీపీ ప్రభుత్వం పెడుతున్న మానసిక క్షోభ, హింసకు వ్యతిరేకంగా ఉపాధ్యాయ దిన వేడుకలను బహిష్కరించారని గుర్తు చేశారు. ఈ చర్య ద్వారా ఉపాధ్యాయులు ఎంతగా వేదనతో ఉన్నారో అర్థమవుతోందన్నారు.
జ్ఞానాన్ని పంచే గురువులను వేధించిన వారందరూ చరిత్ర హీనులుగా మిగిలిపోయారని తెలిపారు. వేధిస్తూ పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఉపాధ్యాయులు కనువిప్పు కలిగించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన చెప్పుకొచ్చారు. జగన్ ప్రభుత్వంపై తన అక్కసు ప్రదర్శించడానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా పవన్ వదులుకోవడం లేదని ఈ ప్రకటన ద్వారా నిరూపించుకున్నారు. అయితే క్షేత్రస్థాయిలో నేరుగా పోరాటాలకు మాత్రం పవన్ దూరంగా ఉండడం గమనార్హం.