ఉపాధ్యాయ దినోత్సవం నాడు పొలిటికల్ పంచ్‌లు పేలుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. అధికార పార్టీపై ఉపాధ్యాయులను రెచ్చగొట్టేందుకు ఈ కార్యక్రమాన్ని వాడుకోవాలని ప్రతిపక్ష పార్టీలు చురుగ్గా వ్యవహరించాయి.
చంద్రబాబు, పవన్‌కల్యాణ్, సోము వీర్రాజు… వేర్వేరు పార్టీల నేతలైనప్పటికీ , అందరూ జగన్‌పై గురిపెట్టారు. ఉపాధ్యాయ లోకానికి జగన్ వ్యతిరేకమని, తీవ్రంగా వేధిస్తున్నాడని, తగిన గుణపాఠం చెప్పాలని గురువులను వేడుకోవడం విశేషం.
ప్రతిపక్షాలకు దీటుగా అధికార పక్షం కౌంటర్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తన మార్క్ పంచ్‌లను విసిరి ఆకట్టుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని 176 మంది గురువులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సత్కరించడం టీడీపీ నేతలకు మింగుడు పడటం లేదని తప్పు పట్టారు.
టీచర్స్ డే నాడు కూడా వారిని టీడీపీ నేతలు అవహేళన చేసేలా మాట్లాడారని మండిపడ్డారు. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు ఎంత దిగజారిపోయాడో తేలిపోయిందన్నారు. చంద్రబాబుకు సమయం, సందర్భం, పండుగ, పబ్బం లాంటివేవీ లేవన్నారు. బతుకంతా, ఒళ్లంతా రాజకీయమే అని మండిపడ్డారు.
మానవత్వం, విలువలు ఆయనలో ఏ కోణంలో చూసినా ఏ మాత్రం కనిపించడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ చంద్రబాబు, టీడీపీ వ్యవహరించిన తీరును ఖండిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఇది దురదృష్టకరమైన ప్రక్రియ అన్నారు. సెప్టెంబర్ 5 టీచర్స్ డే అంటే చంద్రబాబు ఇష్టపడే రోజు కాదని సెటైర్ విసిరారు.
వెన్నుపోటు పొడిచిన రోజంటే బాబుకి ఇష్టమని బొత్స సత్యానారాయణ దెప్పి పొడిచారు. సెప్టెంబర్ 1న ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన రోజన్నారు. ఆ తేదీ అంటే మాత్రం ఆయనకు బాగా మక్కువ అన్నారు. ఇలాంటి రాజకీయాలు, చీటింగులు ఆరోజు మాట్లాడుకోవాలని హితవు పలికారు. వెన్నుపోటుకు ఆజ్యం పోసిన రామోజీ, రాధాకృష్ణలు చంద్రబాబుకు గురువులని వ్యంగ్య కామెంట్ చేశారు. అలాగే వెన్నుపోటుకు వత్తాసు పలికిన సహచర నాయకుడు యనమల రామకృష్ణుడు ఆయనకు గురువున్నారు.
నీ హయంలో విద్యారంగానికి ఏం చేశావో రెండు ముక్కలు చూపించాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఫౌండేషన్ స్థాయి నుంచి విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. చెప్పుకోడానికి ఏమీలేని చంద్రబాబునాయుడు లాంటి ప్రతిపక్ష నాయకుడు ఏపీలో ఉండటం మన కర్మ అని బొత్స ఘాటు విమర్శలు చేశారు.