పట్టు వదలని విక్రమార్కుడు

పట్టు వదలని విక్రమార్కుడు ఎవరో మనకు తెలుసు. చిన్నప్పుడు చందమామ కథల్లో చదువుకున్నాం. ఇప్పుడు పట్టువదలని విక్రమార్కుడు ఎవరయ్యా అంటే ఏపీ సీఎం జగన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జగన్ కు…

పట్టు వదలని విక్రమార్కుడు ఎవరో మనకు తెలుసు. చిన్నప్పుడు చందమామ కథల్లో చదువుకున్నాం. ఇప్పుడు పట్టువదలని విక్రమార్కుడు ఎవరయ్యా అంటే ఏపీ సీఎం జగన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జగన్ కు వ్యతిరేకమైన ఎల్లో మీడియా ఆయన్ని మొండోడు అంటుంది. అనుకున్న పనే చేసి తీరాలన్న సంకల్పం అనండి, పట్టుదల అనండి, మొండితనం అనండి ఇవన్నీ జగన్ లో పుష్కలంగా ఉన్నాయి. 

ఏ ముహూర్తాన మూడు రాజధానులు అన్నాడోగానీ దాన్నుంచి ఇంతవరకు వెనక్కి వెళ్ళలేదు. దాని పర్యవసానాలు ఎలా ఉన్నా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి మొదలవుతాయి. ఏపీలో కూడా త్వరలోనే జరుగుతాయి.

ఈ సమావేశాల్లోనే మళ్ళీ మూడు రాజధానుల మెరుగుపరిచిన బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోందట. ఈ బిల్లును గతంలో ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే కదా. ఆ సమయంలోనే దీన్ని అప్ డేట్ చేసి మళ్ళీ అసెంబ్లీలో ప్రవేశపెడతామని జగన్, మంత్రులు ప్రకటించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో దానికి సమయం ఆసన్నమైందంటున్నారు. 

ఏపీలో 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆలోపు కేంద్రం జమిలి ఎన్నికలకు వెళ్తే మాత్రం 2023లోనే ఎన్నికలు ఉండొచ్చు. దీంతో మూడు రాజధానుల ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలనే పట్టుదల జగన్ సర్కార్ కనిపిస్తోంది.

అసెంబ్లీలో రెండుసార్లు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించడంతో పాటు గవర్నర్ ఆమోదం కూడా తీసుకుంది. అయితే ఈ బిల్లులు న్యాయసమీక్షకు నిలబడకపోవడంతో వాటిని వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత హైకోర్టు అమరావతే రాజధాని అంటూ తీర్పు ఇచ్చింది. దీనిపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయని ప్రభుత్వం.. అసెంబ్లీలోనూ మరోసారి మూడు రాజధానుల బిల్లు పెట్టలేదు. అయితే తాజాగా మరోసారి ఈ రెండు పనులు చేసేందుకు సిద్దమవుతోంది. 

ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో పాటు అసెంబ్లీలోనూ మరోసారి బిల్లు ప్రవేశపెట్టేందుకు వ్యూహరచన చేస్తోంది. అసలే ఎన్నికలకు రెండేళ్ల సమయం కూడా లేని నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయక తప్పని పరిస్ధితి ఏర్పడింది.

అమరావతి స్ధానంలో వైసీపీ సర్కార్ ప్రతిపాదించిన మూడు రాజధానులు చెల్లవని పేర్కొంటూ హైకోర్టు గతంలో కీలక తీర్పు ఇచ్చింది. అయితే హైకోర్టు తీర్పుపై హైకోర్టులోనే అప్పీలుకు వెళ్లడం కానీ, సుప్రీంకోర్టులో సవాల్ చేయడం కానీ చేయలేదు. దీంతో మూడు రాజధానులపై సాంకేతిక కారణాలతో ప్రభుత్వం ముందుకు వెళ్లడం అసాధ్యమని అంతా భావించారు. కానీ తిరిగి తాజాగా హైకోర్టులో ప్రభుత్వం గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తామని చెప్పడంతో మూడు రాజధానుల వ్యవహారం మరోసారి తెరపైకి వస్తోంది. 

గతంలో అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లులు ఉపసంహరించుకన్న నేపథ్యంలో వాటిని సరిచేసి కొత్త బిల్లు ప్రవేశపెడతామని స్వయంగా జగన్ హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ నెరవేరలేదు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. అయితే అంతకు ముందే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి స్టే ఉత్తర్వు తీసుకొచ్చి బిల్లు ప్రవేశపెట్టే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే మంత్రి గుడివాడ అమర్నాథ్ మూడు రాజధానులు తధ్యమన్నాడు. బిల్లు మళ్ళీ ప్రవేశపెట్టే ఆలోచన ఉండబట్టే మంత్రి ఆ విధంగా అని ఉండొచ్చు.