2023లో తెలంగాణలో అధికారమే టార్గెట్‌గా వలసలకు తెరలేపిన బీజేపీకి ఆ పార్టీ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు గట్టి షాక్ ఇచ్చారు. కాసేపటి క్రితం ఆయన బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీతో విమర్శలు, సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. దళితులకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టిన సీఎం కేసీఆర్‌ను దళిత బాంధవుడిగా మోత్కుపల్లి అభివర్ణించారు.
బీజేపీలో తనకు సముచిత స్థానం ఇవ్వలేదన్నారు. తన అనుభవాన్ని ఆ పార్టీ వినియోగించుకోలేదని తప్పు పట్టారు. బీజేపీ జాతీయ కార్యవర్గంలో తనకు చోటు ఇవ్వలేదన్నారు. దళిత బంధు సమీక్ష సమావేశానికి వెళితే తప్పేంటని ఆయన బీజేపీని నిలదీశారు.
ఆ సమావేశానికి వెళ్లాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు సూచించారని ఆయన చెప్పడం గమనార్హం. ఈటల రాజేందర్‌ను బీజేపీలో చేర్చుకోవడం బాధించిందని మోత్కుపల్లి అన్నారు.
ఈటల రాజేందర్ అవినీతిపరుడని ఆయన ఆరోపించారు. అలాంటి అక్రమార్కుడిని బీజేపీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. ఈటల రాజేందర్‌కు వేలాది ఎకరాల భూములు ఎలా వచ్చాయని మోత్కుపల్లి ప్రశ్నించారు. ఈటల రాజేందర్‌ను హుజూరాబాద్ ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
హుజూరాబాద్‌లో దళిత సామాజిక వర్గమంతా టీఆర్ఎస్కు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. తాను ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు ఆశించి టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వలేదన్నారు. అలాగే దళిత వర్గీయులెవరూ బీజేపీలో చేర వద్దని ఆయన కోరారు.