ఎమ్బీయస్‌: వెనుకచూపూ కావాలి, చంద్రన్నా! – 1/3

చంద్రబాబు అంటే ముందుచూపుకి మారుపేరని చాలామంది నమ్మకం. ఒక బాబు అభిమాని నాకు మెయిల్‌ రాశారు – 'తక్కిన రాజకీయ నాయకులు రాబోయే ఐదేళ్ల గురించి ఆలోచిస్తారు, బాబు రాబోయే అయిదు తరాల గురించి…

చంద్రబాబు అంటే ముందుచూపుకి మారుపేరని చాలామంది నమ్మకం. ఒక బాబు అభిమాని నాకు మెయిల్‌ రాశారు – 'తక్కిన రాజకీయ నాయకులు రాబోయే ఐదేళ్ల గురించి ఆలోచిస్తారు, బాబు రాబోయే అయిదు తరాల గురించి ఆలోచిస్తారు' అని. మంచిదే! దానితో బాటు వెనుకచూపూ ఉండాలి. సింహం ఎంత మృగరాజైనా చాలా జాగ్రత్తగా ఉంటుంది. నడుస్తూ, నడుస్తూ ఎక్కణ్నుంచైనా ప్రమాదం ఉందాని మధ్యలో వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటుంది, అదే సింహావలోకనం. బాబు గతంలో యిలాటిది చేసుకున్నా ఈ మధ్య ఆ విద్య మర్చిపోయారేమో! లేకపోతే 'మేం ఎందుకు ఓడిపోయామో తెలియటం లేదు' అనడమేమిటి? కొన్ని రోజుల క్రితం 'మనం జనాల్ని యింత కష్టపెట్టామా?' అని విస్తుపోయారని వార్తలు వచ్చినపుడు ఆయన మనసులో ఆర్ద్రత ఉందనిపించింది. ఈ స్టేటుమెంటుతో ఆయన సరైన సమీక్ష చేయడానికి యిష్టపడటం లేదేమోనన్న అనుమానం వచ్చింది.

ఫలితాలు వచ్చిన కొత్తల్లో బాబు యిలా మాట్లాడారు కానీ యిప్పుడు ధైర్యం పుంజుకుని 'మన వలన ఏ తప్పూ జరగలేదు' అని తన అనుయాయులకు చెపుతున్నారు. అంటే తప్పంటూ జరిగితే ఓటర్లదేనన్నమాట! శభాష్‌! బాబు ఐదేళ్ల పాలనా హడావుడిగా సాగిపోయింది. స్టాండు వేసిన సైకిలు తొక్కుతూ అలసిపోయారు తప్ప కథ ముందుకు సాగలేదు. మధ్యమధ్యలో వెనక్కి తిరిగి చూసుకున్నా తెలిసేది – బండి ముందుకు సాగటం లేదని. బాబు అప్పుడు ఆ పని చేయలేదు, 'మేము ఏ తప్పూ చేయలేదు' అంటూ బింకానికి పోకుండా కనీసం యిప్పుడైనా చేయాలి. టిడిపి అభిమానులు తమ ఓటమికి కారణాలుగా ఇవిఎం, జనసేన, మోదీ, కెసియార్‌… అంటూ వల్లిస్తున్నారు. తమపై ప్రజాగ్రహం లేదని అనుకుంటున్నారు.

వారిలో కొందరు ఉదారవాదులు జనాలకి తమపై కోపం లేకపోయినా, జగన్‌ 'ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌, నేనేమిటో నిరూపించుకుంటాను' అన్నందుకు పోనీలే అని జాలిపడి ఓటేశారని కూడా అంటున్నారు. (''నేనింతే'' సినిమాలో చూపించినట్లు ఆ మాట అనని ఆర్టిస్టు, టెక్నీషియన్‌ ఉండడు. అయినా అందరికీ ఛాన్సు రాదు. జనాలు కొందరి మాటే వింటారు. అది ఎందుకు అని ఆలోచించాలి) కార్యకర్తలు యిలా అనుకున్నా ఫర్వాలేదు కానీ నాయకుడు కూడా అలా అనుకుంటే ఎలా? సాధారణంగా ఓడిన వాళ్లు 'మా తప్పులు మేం గ్రహించి, సవరించుకున్నాం. ఈసారి విజయం మాదే' అంటారు. బాబు మా వలన తప్పులే జరగ లేదంటున్నారు. 'పరీక్ష అద్భుతంగా రాశాను, అయినా మేస్టారు ఫెయిల్‌ చేశాడు' అని హైస్కూలు కుర్రాడు చెపితే తండ్రి నమ్ముతాడా? 'ఇప్పటికైనా ఏ సబ్జక్టులో వీకో చెప్పి చావు, ట్యూషన్‌ పెట్టించి తగలడతాను' అంటూ కసురుకుంటాడు. అప్పటికీ కుర్రాడు చెప్పకపోతే ఇక తండ్రే పూనుకుని పేపర్లు తిరగేస్తాడు. మనం యిప్పుడు ఆ పాత్ర వేయాలి.

తెలుగుదేశం ఓటమికి కారణాలేమిటి? అంటూ పత్రికలలో అనేక వ్యాసాలు వచ్చాయి. బాబు యివేమీ చదవటం లేదేమో! చదివినా నమ్మటం లేదేమో! అందుకే అంత ఆశ్చర్యపడుతున్నారు. లేదా ఆశ్చర్యపడుతున్నట్లు మనల్ని నమ్మించాలని చూస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో వైసిపి బలంగా ఉందని జాతీయ సర్వేలు ఎప్పణ్నుంచో చెపుతున్నాయి. అవి చూసో, మరెందుకో గానీ ఎన్నికలకు వెళ్లే ముందే ఒక దశలో బాబుకి అధైర్యం కలిగిందని అందుకే ఆఖరి దశలో పసుపు-కుంకుమ పెట్టారని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఓ సారి రాశారు. పైకి ఏం చెప్పినా బాబు అంతర్గతంగానైనా నిశ్చయంగా సింహావలోకనం చేసుకోవాలి. ఓటమికి కారణాలేమిటో ఆయనను సమర్థించే పత్రికలుగా ముద్ర పడిన ''ఈనాడు'', ''ఆంధ్రజ్యోతి''లలో వచ్చిన విషయాలను తేదీలతో సహా యిస్తున్నాను. నా యితర వ్యాఖ్యలను పట్టించుకోకపోయినా బాబు కనీసం వాటికైనా విలువ నిచ్చి ఆత్మపరిశీలన చేసుకోవాలి.

ఈ ఎన్నికలలో టిడిపికి 39% ఓట్లు వచ్చాయి. అదేమీ తక్కువ కాదు. కానీ 2014లో వైసిపి కంటె 1.6% ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న పార్టీ యీసారి 10.7% తక్కువ (33.83 లక్షల ఓట్లు) తెచ్చుకుంది. రాష్ట్రమంతా యిదే పరిస్థితి కావడంతో 23 సీట్లు, 3 సీట్ల దగ్గర ఆగిపోయింది. మొత్తం 25 మంది మంత్రుల్లో 19 మంది అసెంబ్లీకి పోటీ చేసి 15 మంది ఓడిపోయారు. లోకసభకు పోటీ చేసిన యిద్దరు మంత్రులు ఓడిపోయారు. స్పీకరు, డిప్యూటీ స్పీకరు, చీఫ్‌ వ్హిప్‌, వ్హిప్‌ ఓడిపోయారు. ఏపి టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు ఓడిపోయారు. టిడిపిలో నైరాశ్యం వ్యాపించింది. బిజెపికి వలసలు ప్రారంభమయ్యాయి. 12-15 మంది ఎమ్మెల్యేలు గోడ దూకుదామని చూస్తున్నారని వార్తలు. ఇప్పటికైనా సిన్సియర్‌గా సమీక్షించుకోకపోతే పార్టీకి గోరీ కట్టినట్లే!

చెప్పినదీ- చేసినదీ – ఐదేళ్ల పాలనలో బాబు ఏమీ చేయలేదని అనడం సత్యదూరమౌతుంది. ఇళ్లు, రోడ్ల నిర్మాణంలో, ప్రైమరీ హెల్త్‌ సెంటర్ల విషయంలో ఎన్నదగిన ఫలితాలు చూపించారు. కానీ చేస్తానన్నదానికి, చేసినదానికి ఎక్కడా లంగరందక ప్రజలు నిరాశ పడ్డారు.  ఆర్థికంగా రాష్ట్ర దుస్థితి తెలిసి కూడా బాబు అరచేతిలో స్వర్గాన్ని చూపించారు. ఎన్నికలకు ముందు హామీలిచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల తర్వాత కూడా అది చేస్తా, యిది చేస్తా, మన రాష్ట్ర ప్రగతి చూసి ప్రపంచం నివ్వెరపోయి చూసేట్లా చేస్తా అంటూ ప్రగల్భాలు పలికారు. (ఈరోజు ఆయనే ఫలితాల కేసి నివ్వెరపోయి చూస్తున్నారు) పోనీ అధికారం వచ్చిన కొత్త రోజుల్లో అంటే ప్రజల మానసిక స్థయిర్యం పెంచడానికి అనుకోవచ్చు. కానీ ఎదురు దెబ్బలు తగుల్తున్నా, కేంద్రం సహాయనిరాకరణ చేస్తూన్నా యీయన గొప్ప కబుర్లు ఆపలేదు. ప్రజల్లో అన్ని ఆశలు పెంచాక, వారిని తృప్తి పరచడం ఎవరికైనా కష్టమే. దానికి తోడు కనీసం జరగాల్సినవి కూడా జరగలేదు. పైగా అభివృద్ధి పనుల్లో జరిగిన అవినీతి, చేసినవాటికి ఖ్యాతి రాకుండా చేసింది.

భోగాపురంలో ఎయిర్‌పోర్టు కడతానన్నారు. వైజాగ్‌ను ఎంతో వృద్ధి చేసేశానన్నారు. రైల్వే జోన్‌ సాధిస్తామని తెగ ఊరించారు కానీ, చివరకు చూస్తే పాడియావు లాటి వాల్తేర్‌ను ఒడిశాకు వదులుకోవలసి వచ్చింది. ఫలితాలు చూడబోతే విశాఖ జిల్లాలోని 15 సీట్లలో గతంలో 12 గెలిస్తే యీసారి మూడో వంతు 4 గెలిచారు. కొంతలో కొంత నయం శ్రీకాకుళంలో 10కి రెండే గెలిచారు. 9 సీట్లున్న విజయనగరంలో గుండుసున్న. టిడిపికి పట్టున్న ఉత్తరాంధ్ర యీసారి ఈ విధంగా దెబ్బ తీసింది.

అమరావతి మైకం – అన్నిటికంటె దెబ్బ తీసినది అమరావతి. బాబు ప్రాధాన్యతాక్రమం మర్చిపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంతసేపూ హైదరాబాదు మీదనే దృష్టి వుండడంతో, ఆంధ్రలో మౌలిక సదుపాయాలు సరిగ్గా ఏర్పడక పరిశ్రమలు రాలేదు. ఆ పని చూడకుండా బాబు అమరావతి జపం వల్లించారు. లక్ష కోట్ల రూ.ల పెట్టుబడి కబుర్లు చెప్పి చివరకు లీకయ్యే తాత్కాలిక భవనాలు కొన్ని కట్టి తప్పుకున్నారు. ఆ ప్రాంతవాసులు ఎంత నిరాశ చెందారంటే, అక్కడ ముఖ్యమంత్రి కొడుకుతో సహా అనేకమంది ఓడిపోయారు. రాజధాని ప్రాంతమూ, టిడిపికి గట్టి పట్టు ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఫలితాలు ఘోరంగా వచ్చాయి. కృష్ణాలో 16 సీట్లుంటే గతంలో 14 వస్తే యీ సారి 2 వచ్చాయి. విజయవాడలోని దుర్గ గుడి దగ్గర పూర్తి కాని ఫ్లయిఓవర్‌ బాబు డాబు కబుర్లను వెక్కిరించే దిష్టిబొమ్మలా  కనిపిస్తూ ఉంటే మరెలా వస్తాయి? గుంటూరులో 17 ఉంటే గతంలో 12 వస్తే యీసారి 2 వచ్చాయి. పొరుగున ఉన్న ప్రకాశం జిల్లాలో కాస్త మెరుగు. 12 సీట్లలో గతంలో 5 వస్తే యీసారి 4 వచ్చాయి.

ఇంతకీ అమరావతిలో ప్రజలకు యింత నిరాశానిస్పృహలు ఎందుకు కలిగాయి? వస్తున్న వార్తల ప్రకారం రాజధాని ప్రకటించడానికి ముందే బాబు, ఆయన సన్నిహితులైన ధనికులు, ఎన్నారైలు అక్కడి ప్రాంతాలన్నీ కొనేశారు. ఓ పక్క బాబు సింగపూరు, జపాన్‌ కబుర్లు చెపుతూండగా ఆ గాలిమేడల్ని చూపించి, యీ యిన్వెస్టర్లు మధ్యతరగతి వాళ్లకు హెచ్చు ధరలకు అమ్మేసి లాభపడ్డారు. ఇంతకింత వస్తుందని ఆశపడిన మధ్యతరగతి కొనుగోలుదార్లు కొంతకాలానికి తాము మోసపోయామని గ్రహించారు. అందుకే ఓట్ల ద్వారా కసి తీర్చుకున్నారు. ఆ ప్రాంతంలో గత నాలుగేళ్లగా జరిగిన రిజిస్ట్రేషన్‌ వివరాలు యివ్వాలని ఉండవల్లి సమాచార హక్కు కింద అడిగితే లక్షలాది ఉన్నాయంటూ యివ్వకుండా తప్పించుకున్నారట. ఇది ఆయనే ప్రెస్‌మీట్‌లో చెప్పారు. అవి బయటకు వస్తే ఎవరు లాభపడ్డారో, ఎవరు దగాపడ్డారో తెలిసి, యీ వాదనలో నిజానిజాలు తెలుస్తాయి.

భారమైన పోలవరం – పోలవరం ప్రాజెక్టు వనరులు లేని కొత్త రాష్ట్రానికి తలకు మించిన భారం. అది కేంద్రం చేపడతానంటే హమ్మయ్య అని ఊరుకోవాలి. ఆలస్యమైతే వాళ్లనే తిట్టవచ్చు. ఎందుకంటే అభ్యంతరాలు పెట్టే పొరుగు రాష్ట్రాలను అదిలించే శక్తి కేంద్రానికే ఉంది. కానీ కాంట్రాక్టులంటే ఒళ్లు తెలియదు బాబు గారికి. అది మేమే చేస్తాం అంటూ దిగారు. 2010-2011లో ఆ ప్రాజెక్టు వ్యయం రూ.12,294 కోట్లు. ఇప్పుడది రూ.55,549 కోట్లకు చేరింది. ఆలస్యమైన కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. 2013-14 రేటు ప్రకారమే నిధులిస్తామని కేంద్రం మడతపేచీ పెట్టింది. ఆ రేట్లలో చేయలేనని కాంట్రాక్టరు చేతులెత్తేశాడు. అప్పుడైనా ఆ రేటులో మీరే చేసి చూపించండి అని వాళ్లకు వదిలేయాల్సింది. అబ్బే, ముందుకు వెళ్లారు. 2018కో, 19కో చేసి చూపిస్తాం అంటూ సవాలు చేశారు బాబు. అడుగడుగునా, ప్రతీ స్టేజిలో పూజలంటూ, ప్రారంభోత్సవాలంటూ అట్టహాసం చేసి, హైప్‌ పెంచారు.

అక్కడ పనులు జరగటం లేదని ఉండవల్లి అంటే ఆయన్ను తిట్టిపోశారు. మోదీ వచ్చి బాబుపై అవినీతి ఆరోపణలు చేశారు. పోలవరాన్ని ఎటిఎంలా వాడుకున్నారని దెప్పారు. పోలవరం ప్రజలు కూడా టిడిపిని గెలిపించలేదంటే దాని అర్థం ఏమిటి? 70% పనులు పూర్తయ్యాయని కొత్త అసెంబ్లీలో కూడా టిడిపి చెపుతోంది. భూసేకరణే పూర్తి కాలేదని వైసిపి అంటోంది. జగన్‌ వెళ్లి చూసి ఏ పనీ పూర్తిగా చేయలేదు, ఎవరికీ నీళ్లు వచ్చే పరిస్థితి లేదు, గోదావరి వరదలు వస్తే పనులు ఆగిపోతాయి – అంటున్నారు. పనులు ఎంత వరకు జరిగాయో, పూర్తవడానికి ఎన్నేళ్లు పడుతుందో, ఎంత ఖర్చవుతుందో కొత్త ప్రభుత్వం ఒక శ్వేతపత్రం ద్వారా ప్రజలకు చెప్పాలి. దాంతో పాటు ఆ ప్రాజెక్టును కేంద్రానికి తిరిగి అప్పగిస్తే వచ్చే నష్టమేమిటో వివరించాలి.

రాయలసీమ ప్రతీకారం – టెక్నాలజీతో అనంతపురంలో కరువు బాపానని బాబు తెగ చెప్పుకున్నారు. కియా ప్రాజెక్టు తెచ్చి ఆ జిల్లాను ఉద్ధరించారన్నారు. వాళ్లు ఏడాదికి 3 లక్షల కార్లు తయారు చేస్తామన్నారు. 2019 జూన్‌ నుంచి కమ్మర్షియల్‌ ప్రొడక్షన్‌ అన్నారు. అలా అనగానే బాబు 535 ఎకరాలు ప్లాంటుకి, 36 ఎకరాలు టౌన్‌షిప్‌కు, 11 ఎకరాలు ట్రైనింగ్‌ సెంటరుకు కట్టబెట్టారు. నిజానికి అంత భూమి వాళ్లకు మరే దేశంలోనూ యిచ్చి ఉండరు. జూన్‌ వచ్చింది, కియా కార్లు బయటకు వచ్చాయా? దగ్గరుండి చూసినవాళ్లు కాబట్టి పెనుకొండ వాసులు 'కుఛ్‌ నహీ కియా' అంటూ టిడిపిని ఓడించారు. ఆది నుండి టిడిపికి పెట్టని కోట అయిన అనంతపురం జిల్లాలో 14 సీట్లలో రెండే గెలిచారు. (ఒకటి బాలకృష్ణ) గతంలో 12 వచ్చాయి. జెసి దివాకరరెడ్డి కుటుంబం కూడా దెబ్బ తినేసింది. ఉత్తరాంధ్రలోని విజయనగరంలోనే కాదు, కోస్తాలోని నెల్లూరు, రాయలసీమలోని కడప, కర్నూలులో కూడా సున్నా సీట్లే వచ్చాయి.

గతంలోనే రాయలసీమలోని 52 సీట్లలో వైసిపి 30 గెలుచుకుంది. దాన్ని బలహీన పరచడానికి రాయలసీమకు కొన్ని సౌకర్యాలు కల్పించి, అక్కున చేర్చుకోవాల్సింది. ఏమీ యివ్వకపోగా ఎక్కడ గొడవ జరిగినా రాయలసీమ రౌడీలే చేశారంటూ అవమాన పరిచారు. పట్టిసీమ నీరు రాయలసీమ కోసం అని నమ్మబలికారు. చాలాభాగం పూర్తయిన పనుల్లో గ్యాప్‌లు పూరించి, కృష్ణాకు జలాలు అందించారు. మంచిదే. కానీ అటు రాయలసీమ, యిటు కృష్ణా ఎవరూ తృప్తి పడలేదు. ఓట్లేయలేదు. తాత్కాలికమైన ఆ ప్రాజెక్టు కోసం అంత ఖర్చు పెట్టడం దేనికి అని వైసిపితో బాటు వాళ్లూ అనుకున్నారేమో! అందుకే గతంలో 22 సీట్లు యిచ్చిన రాయలసీమ యీసారి 3 యిచ్చి సరిపెట్టింది.

బాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో గెలిచిన అభ్యర్థి ఆయన ఒకరే. అదీ కౌంటింగులో ఒక దశలో వెనకబడ్డారు. చివరకు జగన్‌కు వచ్చిన మెజారిటీలో మూడో వంతుతో బయటపడ్డారు. గతంలో కంటె 17 వేలు తక్కువ ఓట్లు ఎందుకు వచ్చాయి అన్నదాని గురించి మే 24 ఆంధ్రజ్యోతి ఒక వివరణ యిచ్చింది – 'బాబు పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు నియోజకవర్గానికి దూరంగా ఉన్న టిడిపి నేతలు ఎవరి వ్యాపారాల్లో వారు మునిగిపోయారు. 2014లో ఆయన సిఎం కాగానే మళ్లీ తెరపైకి వచ్చి, నియోజకవర్గంలో పెత్తనం చేశారు. గ్రామ పంచాయితీలకు కోట్ల రూ.లలో విడుదలైన నిధులు, ఎలా పోతున్నాయో తెలియకుండానే సర్పంచులు, వారు ఆశ్రయించిన నాయకులు ఖర్చు పెట్టేశారు. ఈ ఐదేళ్లలో అక్కడ జరిగినన్ని అభివృద్ధి పనులు రాష్ట్రంలో మరే నియోజకవర్గంలోను జరగలేదు. 'మీ వీధిలో సిమెంటు రోడ్డు వేస్తున్నాం' అని నాయకులంటే 'ఎవరి కోసం వేస్తారు? మీ కమిషన్ల కోసమే కదా' అని జనం వారిని గ్రామాల్లో నిలదీశారంటే అవినీతి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అభివృద్ధంతా నాయకుల అస్మదీయుల ఖాతాలోకే వెళ్లిపోయిందని ప్రజలు అనుకున్నారు.'

ఎంతైనా కుప్పం సేఫ్‌ సీట్‌ కాబట్టి అక్కడ లోకేశ్‌ను నిలబెట్టి, తను రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో నిలబడితే బాబు తక్కువ మెజారిటీతో నైనా నెగ్గేసేవారు. ఆయనైతే నియోజకవర్గం పేరు తప్పుగా పలికి జనాలకు కోపం తెప్పించేవారు కాదు కదా! లోకేశ్‌కు సేఫ్‌ సీటు యిచ్చి ఉంటే అతను పార్టీ జనరల్‌ సెక్రటరీగా తక్కిన వ్యవహారాలు చూసుకునేవాడు. ఆళ్ల రామకృష్ణారెడ్డికి ప్రత్యర్థిగా నిలబెట్టడంతో బెదిరిపోయి, అక్కడే ఉండిపోవలసి వచ్చింది. అది పార్టీకి చెరుపు చేసింది. (సశేషం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2019)
[email protected]

ఎమ్బీయస్‌: వెనుకచూపూ కావాలి, చంద్రన్నా! – 2/3