Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: వెనుకచూపూ కావాలి, చంద్రన్నా! - 2/3

ఎమ్బీయస్‌: వెనుకచూపూ కావాలి, చంద్రన్నా! - 2/3

అతివృష్టి - అనావృష్టి - బాబు దృక్పథంలో కొట్టవచ్చినట్లు కనబడిన మార్పు - అతివృష్టి, అనావృష్టి. మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఫిలాసఫీ - ఆకలేసినవాడికి చేప నివ్వడం సరికాదు. చేపలు పట్టే విద్య నేర్పించాలి అనేది. అందుకే దీర్ఘకాలిక ప్రణాళికతో అనేక మార్పులు తెచ్చారు. అది దేశమంతటా ఆయనకు అభిమానులను తెచ్చిపెట్టింది. సాంప్రదాయిక రాజకీయ నాయకులకు భిన్నంగా ఆలోచించే రాజకీయ నాయకుడిగా అందరూ ప్రశంసించారు. ఆ పొగడ్తలు ఆయనను ఒళ్లు మరిచేట్లు చేశాయి. తను పాతికేళ్లపాటు నిరాఘంటంగా పాలిస్తానని, తన యీనాటి సంస్కరణలు అప్పటికి ఫలితాల నిచ్చి ప్రజలు కలకాలం తనను గుర్తు పెట్టుకుంటారని అనుకున్నారు. ఆ క్రమంలో పబ్లిసిటీ తెచ్చిపెట్టే కొన్ని రంగాలపైనే దృష్టి పెట్టి, అనేక ముఖ్యమైన రంగాలను పట్టించుకోలేదు. బాధితులైన ప్రజలకు తక్షణ ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టలేదు. ఒక్క భారీ ప్రాజెక్టు కూడా కట్టలేదు, అంతకుముందు వాటిని పూర్తి చేయలేదు. నాగార్జునసాగర్‌ ఎండిపోయింది, శ్రీశైలంలో నీరు లేక విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. పంట దిగుబడులు పడిపోయాయి. కోస్తా, రాయలసీమ ప్రజలు హైదరాబాదుకి తరలి వెళ్లి తాపీ పనులు, కూలీ పనులు చేసుకున్నారు.

బాబు వీటి కేసి దృష్టి సారించలేదు. హైదరాబాదులో ఫ్లయిఓవర్లు, రోడ్లు కట్టించి అదే ప్రగతి అనుకున్నారు, అనుకోమన్నారు. ప్రపంచబ్యాంకు మెచ్చుకుంటే అదే పదివేలు అనుకుని మురిశారు. వాళ్లు చెప్పినట్లే నడుచుకున్నారు. అప్పుడు వివిధ రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన కఠినమైన సంస్కరణలు ప్రజలు తట్టుకోలేక పోయారు. విద్యుత్‌, ఆర్టీసీ చార్జీలు ప్రతీ ఆర్నెల్లకీ పెరిగేవి. అనేక ప్రాంతాలు కరువుతో అలమటిస్తూ ఉంటే బాబు సూక్తులు చెప్పడం ఎవరూ హర్షించలేదు. కరంటు బకాయిలుంటే వందలాది బోర్లను అధికారులు స్వాధీనం చేసుకునేవారు. విద్యుత్‌ సంస్కరణల వంటివి అంచెల వారీగా కాకుండా ఒకేసారి తెచ్చి ప్రజాగ్రహానికి గురయ్యారు. బాబు అనుయాయులు యీ విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చినా ఆయన వినలేదు. వామపక్షాలు బషీర్‌బాగ్‌లో చేపట్టిన ఉద్యమాన్ని బాబు అణచివేశారు. పెంచిన పన్నులతో పోగుపడిన సంపదను హైదరాబాదులో కుమ్మరించి, పల్లెసీమలను ఎండగట్టారు.   దీన్నే వైయస్‌ ఎన్‌క్యాష్‌ చేసుకున్నారు. రైతు రాజ్యం తెస్తానని, విద్యుత్‌ సమస్య తీరుస్తాననే హామీతో ఆకట్టుకున్నారు.

2004లో ఓడిపోయినపుడు బాబు దిగ్భ్రమ చెందారు. ఉచిత విద్యుత్‌ హామీ యిచ్చి కాంగ్రెస్‌ తనను ఓడించిందని, సంక్షేమ పథకాలకు పడినంతగా సంస్కరణలకు ఓట్లు పడటం లేదని అనుకున్నారు. రెండింటికీ మధ్య సమన్వయం సాధించడం ఆయన వలన కాలేదు. లోలకం యిటు పూర్తిగా వచ్చేసింది. ఇక అప్పణ్నుంచి సంక్షేమ పథకాల గురించే మాట్లాడుతూ వచ్చారు. అది అతివృష్టి అయిపోయింది. 2009లో నగదు బదిలీ పథకం ప్రకటించినా నెగ్గలేదు. 2014లో కాలం కలిసివచ్చి, విభజన కారణంగా మళ్లీ గద్దెనెక్కారు. తన గెలుపుకి కారణం తనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం అనుకోకుండా, తనిచ్చిన ఋణమాఫీ హామీయే గెలిపించింది అనుకున్నారు.

అలాటప్పుడు దాన్నయినా పూర్తిగా అమలు చేయవలసినది. అది సగంలో ఆపి, చెప్పని పథకాలు చేయడం మొదలు పెట్టారు. గత ఐదేళ్లలో ఆయన ప్రవేశ పెట్టిన కొత్త పథకాలు 107ట! నిజానికి ప్రజలు ఆయన నుంచి కోరుకున్నది రాష్ట్రపునర్మిర్మాణం. కానీ ఆయన అది చేయకపోగా చంద్రన్న కానుక, మరోటీ మరోటీ అంటూ సంక్షేమ పథకాలపై విపరీతంగా ఖర్చు పెట్టి ఖజానా గుల్ల చేశారు. తాయిలాలు యిస్తే చాలు, ఓట్లు కురుస్తాయి అనుకున్నారు. చివరకు తెలిసింది - మంచి పరిపాలనకు తాయిలాలు ప్రత్యామ్నాయం కాదు అని. (ఈ విషయాన్ని జగన్‌ గ్రహించి, తన పథకాలను అదుపులో పెట్టుకుంటే బాగుపడతాడు) బాబులో కొట్టవచ్చినట్లు కనబడిన మరొక మార్పు - చాదస్తాలు. గతంలో పూజలు, పునస్కారాల గురించి, వాస్తు గురించి బాబు యింత మాట్లాడేవారు కారు. ఈ సారి అవి తప్ప మరొకటి మాట్లాడలేదు. వీటికోసం ఎన్ని కోట్లు ఖఱ్చు పెట్టారో లెక్కే లేదు. అన్ని ఊళ్ల నుంచి అమరావతికి కలశాలు తెప్పించి, హెలికాప్టర్‌లోంచి మన్ను చల్లి ఏం సాధించారో ఆయన ఒకసారి ఆలోచించుకోవాలి. కెసియార్‌ సంక్షేమ పథకాలతోనే గట్టెక్కారన్న తప్పుడు లెక్కలతోనే బాబు యిలాటి వాటికి పూనుకున్నారు. నిజమైన అభివృద్ధి జరిగివుంటే వీటి అవసరమే పడేదికాదు.

ఆంధ్రజ్యోతి (జూన్‌ 16) రాసినది - 'టిడిపి అమలు చేసిన సంక్షేమ పథకాల వలన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గుల్లగుల్ల అయిపోయింది. ప్రతీ నెలా ఓవర్‌డ్రాఫ్ట్‌కి వెళ్లవలసిన పరిస్థితి. దొరికిన చోటల్లా అప్పులు చేశారు. పసుపు-కుంకుమ పథకం కింద మహిళలకు చెల్లించిన 10 వేల కోట్లు కూడా అప్పుగా తెచ్చినదే. ఇప్పటికే ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు వేల కోట్లకు చేరుకున్నాయి. గత రెండు నెలలుగా ఏ ఒక్క బిల్లూ చెల్లింపులకు నోచుకోలేదు. బాబు అధికారులతో సుదీర్ఘ సమీక్షలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోలేక పోయారు. పార్టీ ఎమ్మెల్యేల అవినీతిని అదుపు చేయలేక పోయారు. అభ్యర్థుల ఎన్నికలో అలసత్వాన్ని ప్రదర్శించారు... సమస్యలు పరిష్కరించడానికి జగన్‌ వద్ద విజయసాయి రెడ్డి వంటి వారున్నారు. బాబుకి ఎవరూ లేరు. ప్రణాళికా బద్ధంగా పార్టీని తీర్చిదిద్దడానికి ఆయన శ్రద్ధ చూపలేదు. భావోద్వేగాలే నేపథ్యంగా ఏర్పడిన టిడిపిలో భావోద్వేగమే లేకుండా పోయింది.'

రైతుల అసంతృప్తి - బాబు పాలనలో రైతుల స్థితి మెరుగుపడలేదు. వాగ్దానం చేసిన ఋణమాఫీ పూర్తిగా చేయలేదు. ఎన్నికల ముందు అన్ని రకాల ఋణాలను మాఫీ చేస్తామని చెప్పి, తర్వాత అనేక కారణాలు చూపి, ఆ జాబితాను తగ్గిస్తూ పోయారు. గుర్తించినవారికైనా పూర్తిగా మాఫీ చేయలేదు. రైతులపై వడ్డీల భారం పెరిగింది. అప్పు పుట్టడం కష్టమైంది. అనేక పంటలకు గిట్టుబాటు ధర లేదు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నారు కానీ చేయలేదు. కాంగ్రెసు చేస్తూ వచ్చిన అనేక ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. పల్లెలను పాడు పెట్టి, సింగపూరు కబుర్లు చెప్పడంతో రైతులు విసుగు చెందారు.

చివరకు బాబు వారిని ఊరించడానికి అన్నదాతా సుఖీభవ పథకం కింద 40 లక్షల మంది రైతులకు తొలి విడతగా ఒక్కోరికి 4 వేల రూ.ల చొప్పున యిచ్చారు కానీ అది వారిని మండించింది. ఇది ఓట్ల కోసం యిస్తున్నది తప్ప, తమ సంక్షేమం కోసం కాదని, తమ మేలు కోరి ఉంటే ఎప్పుడో, అవసరం పడినప్పుడే యిచ్చేవారని వారు ఫీలయ్యారు. బజెట్‌ కేటాయింపులు ఉన్న రైతు ఋణమాఫీ బాకీలు తీర్చకుండా (ఇప్పుడు టిడిపి వారు ఋణమాఫీ బకాయిలు వెంటనే తీర్చాలి అని డిమాండు చేస్తున్నారు. వారెందుకు తొక్కిపెట్టారో చెప్పటం లేదు) అది తర్వాతి ప్రభుత్వం నెత్తిన పడేసి, ముందుగా చెప్పని పసుపు-కుంకుమ, అన్నదాతా.. వంటి పథకాల కింద యివ్వడం మోసగించడమే అనుకున్నారు. సర్వే ప్రకారం 37% మంది రైతులు టిడిపి తమ గోడు పట్టించుకోలేని భావించగా, 48% మంది ఫర్వాలేదు లెండి అన్నారు. 8% మాత్రమే సంతృప్తి వెళ్లబుచ్చారు.

మహిళల ఆగ్రహం - పొదుపు సంఘాల మహిళలకు ఋణమాఫీ చేస్తానని హామీ యిచ్చి, చేయకుండా తర్వాత దాన్ని పెట్టుబడి నిధిగా మార్చి.. చివరకి పసుపు-కుంకుమ పేరుతో పోలింగుకి మూడు నాలుగు రోజుల ముందు పదేసి వేల రూ.ల వంతున ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లో జమ చేసింది. అది 90 లక్షల మహిళలపై సమ్మోహనాస్త్రం అని బాబు గట్టిగా నమ్మారు. పార్టీ ద్వారా డబ్బు పంపిణీ చేస్తే మధ్యలో కార్యకర్తలే నొక్కేసేరేమోనన్న అనుమానాలుంటాయి. దీనిలో దానికి తావే లేదు. 'తన' డబ్బు తీసుకుని కృతజ్ఞతాభావంతో ఓట్లేసి తీరతారన్న గట్టి నమ్మకంతో ఉన్న మహిళలు అర్ధరాత్రి వరకు క్యూలలో నిలబడి ఓట్లు వేసేరనేసరికి పొంగిపోయారు. కానీ ఆ పథకమే వారిని యిరిటేట్‌ చేసిందని ఫలితాల తర్వాత గ్రహించేసరికి 'ఎందుకు ఓడిపోయామో తెలియలేదు' అని పలవరించ సాగారు. 'మీ డబ్బే యిన్నాళ్లూ తొక్కిపెట్టి, యిప్పుడు ఏదో మెహర్బానీగా యిస్తున్నారు. పైగా సగమే, తక్కిన సగం ఎన్నికల్లో ఆయన నెగ్గితేనట! ఇదో రకమైన బ్లాక్‌మెయిల్‌. మీ బాకీలు అలాగే ఉంటాయి.' అని ప్రత్యర్థులు చెప్పిన మాటలకు వాళ్లు కన్విన్స్‌ అయ్యారు. 2014తో పోలిస్తే మహిళల ఓటింగు శాతం అధికంగా పెరిగిన తొలి 10 నియోజకవర్గాల్లో వైసిపియే నెగ్గింది.

యువత నిరాశ - 2014 మానిఫెస్టోలో మూడు అంశాలను ప్రధానంగా పేర్కొన్నారు. రైతు ఋణమాఫీ, డ్వాక్రా ఋణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం! వీటిలో ఏవీ సవ్యంగా అమలు జరగలేదు. బాబు వస్తే జాబు అన్న నినాదం వట్టిపోవడంతో యువత నిస్పృహ చెందారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడంతో పరిశ్రమలు రాలేదు. బాబు చెప్పిన డాబు కబుర్లతో భూముల రేట్లు పెరిగిపోయాయి. దాంతో యితర రాష్ట్రాల నుంచి తరలి వద్దామనుకున్న పరిశ్రమలు ఆగిపోయాయి. కనీసం సినిమా పరిశ్రమైనా హైదరాబాదు నుంచి కదలలేదు. వైజాగ్‌లో సదస్సులు పెట్టి వారొస్తారు, వీరొచ్చేస్తున్నారు అని హంగామా చేయడమే తప్ప, అంతిమంగా పదో వంతు కూడా రాలేదు. అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ ప్రతీ జిల్లాకు వరాలు ప్రకటించారు బాబు. పరిశ్రమలు వస్తాయి, యూనివర్శిటీలు వస్తాయి అంటూ ఊదరగొట్టారు. అవేమీ కాలేదు. ఆంధ్ర యువత ఉపాధి కోసం హైదరాబాదుకి తరలి వెళ్లడం ఆగలేదు. ఓ సర్వేలో 47% మంది యువత (18-25) టిడిపి యువకుల ప్రయోజనాలను కాపాడలేదని చెప్పారు. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తామని కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువతీయువకు లనేకులు చెప్పారు.

ప్రత్యేకహోదా వస్తే పరిశ్రమలు వచ్చి తమకు ఉద్యోగాలు వచ్చి వుండేవని, కానీ బాబు దాన్ని పట్టించుకోక పోవడం చేతనే రాలేదని యువత నమ్మారు. దాని కోసం దిల్లీ చాలాసార్లు వెళ్లి వచ్చానని బాబు చెప్పినా బిజెపి నాయకులు - 'ఆయన హోదా గురించి ఎన్నడూ మాట్లాడలేదు. వచ్చిన ప్రతీసారీ జగన్‌పై కేసులు త్వరగా విచారణ చేయించి జైల్లో పెట్టించండి, ఫిరాయింపుదార్లను ఎకామడేట్‌ చేయడానికి అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచండి, యుసిల గురించి పట్టుబట్టకుండా నిధులు విడుదల చేయండి అనే అడిగారు' అని బహిరంగంగా చెప్పేశారు. దేశవ్యాప్తంగా యువతకు మోదీపై మోజు ఉంది. ఆంధ్ర యువతకు కూడా అంతే. మోదీని వ్యక్తిగతంగా కూడా దూషిస్తున్న బాబుకి బుద్ధి చెప్పాలంటే ఆంధ్ర బిజెపికి బలం లేదు కాబట్టి వైసిపికి ఓటేశారు. 2017 నవంబరు నుండి 2019 జనవరి వరకు మొత్తం 134 నియోజకవర్గాలలో చేసిన 3648 కి.మీ.ల పాదయాత్ర ద్వారా జగన్‌ వారిని ఆకట్టుకోగలిగారు.

ఉద్యోగులలో చికాకు - ఉద్యోగులకు బాబు ప్రభుత్వం చాలా సౌకర్యాలిచ్చింది. అయినా వారు వ్యతిరేకంగా మారడానికి కారణమేమిటో మే 24 ఈనాడు రాసింది - 'పరిపాలన అంటే సమీక్షలే అన్నట్లుగా మారింది. స్వయంగా బాబు రోజంతా తీరిక లేకుండా సమీక్షించటం, అన్ని స్థాయిల్లోనూ యిదే విధానం కొనసాగటం, యంత్రాంగంలో నిరాసక్తతకు దారి తీసింది. కలక్టర్లతో సమావేశాలంటే రెండేసి రోజులు రాత్రి పొద్దుపోయే వరకు సమీక్షించటం యంత్రాగానికి విసుగు పుట్టించింది.' ఈ సమీక్షల వలన మేలేమైనా జరిగిందా అనే సందేహం కలుగుతుంది - ప్రస్తుతం నడుస్తున్న విత్తనాల కొరత వివాదం గమనిస్తే! నవంబరులో ప్రారంభం కావలసిన విత్తనాల సేకరణకు అతీగతీ లేకపోయింది. నిధుల విడుదలకై విత్తనాల కార్పోరేషన్‌ 46 ఉత్తరాలు రాసినా జవాబు లేదు. 2019లో విత్తనాల సంక్షోభం ఏర్పడుతుందని హెచ్చరిస్తూ వ్యవసాయ శాఖ కార్యదర్శి ఫిబ్రవరి, మార్చిల్లో ఘాటు లేఖలు రాసినా చర్యలు లేవు. ఇప్పుడు రైతులు అగచాట్లు పడుతున్నారు. సమావేశాల్లో కలక్టర్లు దీని గురించి మాట్లాడలేదా? లేదా ఆ నిధులను పసుపు-కుంకుమలకు మళ్లించడానికి అప్పటికే నిశ్చయించుకున్న బాబు వినలేదా? ఆయనే నెగ్గి మళ్లీ వస్తే ఏం చేద్దామనుకున్నారో ఏమో!

మంచి అధికారులను బాబు ఎలా దూరం చేసుకున్నారో ఆంధ్రజ్యోతి జూన్‌ 9 న రాసింది - 'బాబు పేషీలో పని చేసిన ఒక ముఖ్య అధికారి కారణంగా ఐవైఆర్‌, అజయ్‌ కల్లం వంటి మాజీ చీఫ్‌ సెక్రటరీలు బాబుకి వ్యతిరేకంగా మారారు. భవిష్యత్తులో తాను చీఫ్‌ సెక్రటరీ కావడానికి అడ్డు వస్తారనుకున్న అధికారులను సదరు అధికారి యిబ్బందుల పాలు చేశారు. అధికారుల నియామకాల్లో అడుగడుగునా బాబు కళ్లకు గంతలు కట్టారు. ప్రస్తుతం జగన్‌ పేషీలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితుడైన దళిత వర్గానికి చెందిన పివి రమేశ్‌ సమర్థుడు, సౌమ్యుడు. ఆయన రాష్ట్రంలో ఉంటే సీనియారిటీ ప్రకారం అడ్డు వస్తాడని కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయేలా పొగబెట్టారు. అంతేకాకుండా అజయ్‌ కల్లం, రమేశ్‌ మధ్య విభేదాలు సృష్టించారు... చెప్పుకుంటూపోతే యిలాంటి ఉదంతాలు ఎన్నో!' అని రాధాకృష్ణ కొత్తపలుకులో రాశారు. ఇది నిజమని నమ్మితే బాబుకి తన ముక్కు కింద ఏం జరుగుతోందో తెలియలేదనిపిస్తుంది. మరి గ్రామాల్లో ఏం జరుగుతోందో ఎలా తెలుస్తుంది? ఐవైఆర్‌ మొత్తుకున్నారు - బ్రాహ్మణ కార్పోరేషన్‌ చైర్మన్‌గా తను ఎన్నిసార్లు ఎపాయింట్‌మెంట్‌ అడిగినా యివ్వలేదని. బాబు ఒకసారి పిలిచి మాట్లాడితే తన పేషీలో పెద్దమనిషి గురించి తెలిసేదేమో! చూడబోతే 'అందర్నీ గమనిస్తున్నా, ఎవరినీ వదలను' అని హెచ్చరించే బాబు నిజానికి గుడ్డిమారాజులా ఉన్నారన్నమాట! (సశేషం)

ఎమ్బీయస్‌: వెనుకచూపూ కావాలి, చంద్రన్నా! - 1/3

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?