ఎమ్బీయస్‌: వెనుకచూపూ కావాలి, చంద్రన్నా! – 3/3

తటస్థుల నిరాసక్తత – 2014లో టిడిపి గెలుపుకి కారణం – తటస్థుల ఓట్లు! బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలు, మధ్యతరగతి విద్యావంతులు అందరూ జగన్‌ యిమేజిని చూసి భయపడి బాబుని గెలిపించారు. ఈయనైతే నిదానస్తుడు,…

తటస్థుల నిరాసక్తత – 2014లో టిడిపి గెలుపుకి కారణం – తటస్థుల ఓట్లు! బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలు, మధ్యతరగతి విద్యావంతులు అందరూ జగన్‌ యిమేజిని చూసి భయపడి బాబుని గెలిపించారు. ఈయనైతే నిదానస్తుడు, నెమ్మదస్తుడు, మంచీ మర్యాదా తెలిసినవాడు అని. కానీ యీ సారి వీళ్లలో సగానికి కంటె ఎక్కువమంది వైసిపికి ఓటేశారు. ఎందుకు? ఎందుకంటే బాబు తన పక్షపాత ధోరణితో వారందరినీ నిరుత్సాహ పరిచారు. వనజాక్షి కేసు ఉంది. చింతమనేని ప్రభాకర్‌ను ఓ ఆర్నెల్లపాటు పార్టీ నుంచి సస్పెండు చేస్తే ఏం పోయేది? ఇప్పుడు తెలంగాణలో ఫారెస్టు ఆఫీసరుపై దాడి విషయంలో తెరాస ప్రభుత్వం చేసినదానిలో పావు వంతైనా ఆరోజు జరిగిందా? ఎన్నికలలో చింతమనేనికి మళ్లీ టిక్కెట్టు యివ్వడం అన్యాయం కాదా?

అలాగే కాల్‌మనీ రాకెట్‌లో ఒక్క కేసు కూడా పెట్టకపోవడం, గోదావరి పుష్కరాల చావుల విషయంలో ఎవరిదీ తప్పులేదని తేల్చడం, జగన్‌పై దాడి జరగగానే కాస్తయినా తమాయించుకోకుండా దాన్ని ఎద్దేవా చేయడం, వైసిపిని కోడికత్తి పార్టీ అని, జగన్‌ను ఏ1 అనీ మాటిమాటికీ వెక్కిరించడం, ఏం జరిగినా కడప రౌడీలంటూ, రాయలసీమ గూండాలంటూ మొత్తం ప్రాంతాన్ని అవమానపరచడం.. యిలా ఎన్నో ఉన్నాయి. అసెంబ్లీ నిర్వహణలో బాబు గతంలో కనబరచిన సంయమనం యీ టెర్మ్‌లో కనబడలేదు. రైతుల నుంచి తీసుకున్న భూమిని అనేక సంస్థలకు ధారాళంగా పంచిపెట్టడం కూడా తటస్థులను విస్మయపరచింది. ఎన్టీయార్‌ ట్రస్టు పేర అనేక జిల్లాలలో భూముల్ని యిచ్చేశారు. అక్కడ టిడిపి ఆఫీసులు వెలిశాయిట.

ఇసుక మాఫియా, గనుల మాఫియా వంటి పెద్దపెద్ద మాఫియాలపై చర్య తీసుకోక పోవడమే కాదు, తప్పు చేసిన కాలేజీ ప్రిన్సిపల్‌పై కూడా చర్య తీసుకోవడానికి బాబు వెనకాడారు. నారాయణ కాలేజీలపై ఎన్నో ఆరోపణలు, అయినా బాబు కిమ్మనలేదు. దాంతో ఆయన తన వాళ్లని రక్షిస్తున్నాడనే భావం అందరికీ కలిగింది. బాబుని ప్రగాఢంగా అభిమానించే వారు సైతం 'ఈసారి ఆయన చుట్టూ చెత్త సలహాలు చెప్పేవాళ్లు తయారయ్యారండీ, పాపం ఆయనకు తెలియటం లేదు' అని వాపోయారు. వైసిపి నుండి ఫిరాయింపుదార్లను చేర్చుకోవడం తటస్థులకు మింగుడు పడలేదు. పైగా అసెంబ్లీలో వైసిపి వారు ఏం మాట్లాడబోయినా అల్లరి చేయడం వలన టిడిపి తన యిమేజిని పాడు చేసుకుంది. మే 24 ఈనాడు ప్రకారం – '..ఈ ఫిరాయింపులు ఎన్నో చోట్ల బెడిసికొట్టాయి. ఆయా స్థానాల్లో స్థానికి టిడిపి యంత్రాంగంతో వారు సర్దుబాటు కాలేకపోయారు. చివరకి జమ్మలమడుగులో రెండు బలమైన వర్గాల్ని కలపటానికి బాబు కొన్ని నెలలపాటు కష్టపడినా, ఎన్నికల సమయంలో యిరువురి మధ్య సఖ్యత కొరవడింది.'

ఏది ఏమైనా టిడిపికి నగరవాసుల్లో, మధ్యతరగతిలో యింకా పట్టుందని ఫలితాల్లో తేలింది. పారదర్శకమైన పాలనతో యీ వర్గాల్లో కూడా జగన్‌ ఆదరణ సంపాదించుకుంటే టిడిపికి నిజమైన కష్టకాలం దాపురిస్తుంది. టిడిపి ఓటమిపై మే 25 ''ఈనాడు''లో వచ్చిన కారణాలు – ' … 2014లో బాబు గెలుపుకి కారణాల్లో ఒకటి కింది స్థాయి నాయకులు అడ్డగోలు అవినీతికి పాల్పడితే బాబు సహించరని తటస్థులు భావించడం! ఎన్నికల తర్వాత వారి ఆశలను బాబు నెరవేర్చలేక పోయారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత అధికారయోగం పట్టడంతో అనేక ప్రాంతాల్లో టిడిపి ప్రజాప్రతినిథులు, నేతలు దారి తప్పారు. ఇసుక, గనుల వంటి అంశాల్లో అక్రమాలు సాగించారు. అలాటివారిపై బాబు కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుకున్నారు. అది నెరవేరలేదు.

'క్షేత్రస్థాయిలో అవినీతిపై ప్రభుత్వం ఎంత ఉదాసీనంగా ఉందో చెప్పడానికి ఒక ఉదాహరణ – గుంటూరు జిల్లా గురజాలలో తెలుగుదేశం ప్రజా ప్రతినిథులు సున్నపురాయి గనులను – గనులశాఖ నివేదిక ప్రకారం 12 లక్షల మెట్రిక్‌ టన్నుల ఖనిజాన్ని, – లూటీ చేశారు. దీనిపై విచారణ చేపట్టమని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం ముగ్గురు కూలీలపై కేసులు పెట్టి అధికార పార్టీ నేతల పైకి వెళ్లకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక పింఛన్‌ కార్డులు, రేషన్‌ కార్డులు, స్వయం ఉపాధి పథకాలు, ఇళ్లు వంటివి మంజూరు చేయడానికి పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీల అరాచకం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రభుత్వ కార్పోరేషన్ల నుంచి ఋణం పొందాలంటే వీరికి కమిషన్లు చెల్లించాల్సిందే. ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే యిలాటి అదుపు లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. పార్టీ ఓటమిలో వీళ్లది పెద్ద పాత్ర.

'2017 మార్చి నాటికే టిడిపి పట్ల వ్యతిరేకత బట్టబయలై ఉత్తరాంధ్ర, రాయలసీమ, నెల్లూరు జిల్లాల పరిధిలోని 5 పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో 4గురు టిడిపి అభ్యర్థులు ఓడిపోయారు. అదే ఏడాది ఆగస్టులో నంద్యాలలో ఉపయెన్నిక సందర్భంగా టిడిపి సర్వశక్తులను మోహరించింది. నంద్యాల అభివృద్ధికై 1500 కోట్ల రూ.ల నిధులు కుమ్మరించింది. మంత్రులందరినీ మోహరించింది. 13 వేల కుటుంబాలకు పక్కా యిళ్లు మంజూరు చేసింది. వీటన్నిటితో 27 వేల మెజారిటీ తెచ్చుకోగలగడంతో టిడిపికి ధైర్యం కలిగి, తప్పులు సమీక్షించుకోలేదు. ఇప్పుడు అదే నంద్యాలను వైసిపి 30 వేల మెజారిటీతో గెలుచుకుంది.'' – యిదంతా ఈనాడులో వచ్చిందే!

కులసమీకరణాలు – కాపులు -బిసిల మధ్య దోబూచులాట ఆడి బాబు భంగపడ్డారు. బిసిలు మొదటినుంచీ టిడిపికి అండగా ఉన్నారు. కానీ 2014 ఎన్నికల వేళకు వారి మద్దతు చాలదని బాబు కరక్టుగానే అంచనా వేశారు. అందుకని కాపుల్ని దువ్వారు. రిజర్వేషన్‌ యిస్తామనే అసాధ్యమైన హామీ యిచ్చారు. కాపు కార్పోరేషన్‌ ద్వారా ఏటా వెయ్యి కోట్ల రూ.ల నిధులు విడుదల చేస్తామన్నారు. (2015 నవంబరు దాకా దాన్ని ఏర్పాటు చేయనేలేదు. ఆ తర్వాతి మూడేళ్లలో 3000 కోట్లు విడుదల చేయాలి, కానీ అంత చేయలేదు) ఎన్నికలలో కాపుల మద్దతు, పవన్‌ కళ్యాణ్‌ మద్దతు అన్నీ కలిసి వచ్చాయి. నెగ్గారు కానీ కాపుల డిమాండ్లను మర్చిపోయారు. కాపుల అసంతృప్తిని ముద్రగడ ఎన్‌క్యాష్‌ చేసుకోబోతే బాబు ఆయనను బద్‌నామ్‌ చేసే క్రమంలో కాపుల్లో చాలామందికి ఆగ్రహం తెప్పించారు. పవన్‌ కళ్యాణ్‌ను దువ్వుతూ ఉంటే చాలు, కాపులందరూ జేబులో ఉన్నట్లే అనుకున్నారు.

బిసిల్లో కాపుల్ని చేర్చడానికంటూ మంజునాథ కమిషన్‌ ప్రకటించి సాధ్యమైనంత ఆలస్యం చేశారు. తర్వాత కాపు రిజర్వేషన్‌ గురించి ఓ తీర్మానం చేసి, పైకి పంపేసి చేతులు దులుపుకున్నారు. దీనివలన కాపులు సంతోషించ లేదు కానీ కాపులను బిసిలుగా గుర్తిస్తామనడంతో బిసిలకు కోపం వచ్చింది. కాపు వంటి అగ్రకులస్తులు కూడా తమలోకి వచ్చేస్తే యిక రిజర్వేషన్‌ ఫలితాలు తమకు దక్కవని భయం పట్టుకుంది. మోదీ ప్రభుత్వం అగ్రవర్ణంలో పేదలకి 10% రిజర్వేషన్‌ అంటూ అగ్రవర్ణాలను ఆకట్టుకుంది. వెంటనే బాబుకి కాపులు అగ్రవర్ణాలుగా తోచారు. ఆ రిజర్వేషన్‌లో సగం కాపులకే అని ప్రకటించి యితర అగ్రవర్ణాకు కాపులపై కోపం వచ్చేట్లు చేశారు.

బాబు తమతో ఆడుకుంటున్నారనే ఫీలింగు కాపులలో బాగా నాటుకుంది. ఈసారి టిడిపి ప్రభుత్వానికి కమ్మ ముద్ర బాగా పడింది. అన్నిటా వాళ్లకే ప్రాధాన్యమని, లంచమిచ్చినా కమ్మ వాళ్ల బిల్లులు మాత్రమే పాసవుతున్నాయనే మాట వినవచ్చింది. బాబు హయాంలో కమ్మలకు విపరీతమైన ప్రాధాన్యం రావడం (ఓ సర్వే ప్రకారం రెడ్లలో 80% మంది వైసిపికి వేయగా కమ్మల్లో కూడా 62% మాత్రమే టిడిపికి ఓటేశారట, వారూ యీ యిమేజి మెచ్చలేదని అర్థమౌతోంది) వారిలో కొందరు ఆధిపత్య ధోరణి కనబరచడం కాపులకు ఆగ్రహం కలిగించింది. అందువలన కాపు రిజర్వేషన్‌ తమ చేతిలో పని కాదని జగన్‌ ప్రకటించినా కాపుల్లో అత్యధికులు వైసిపికి ఓటేశారు. అదే సమయంలో కాపు కార్పోరేషన్‌ ద్వారా కాపులకు బాబు ఏదో ఒరగబెడుతున్నాడనే ఫీలింగులో ఉన్న బిసిలు టిడిపికి దూరమయ్యారు. 40% మంది బిసిలు కూడా వైసిపికి వేశారట. రెంటికి చెడ్డ రేవడి కథ గుర్తు చేస్తూ టిడిపి రెండిందాలా నష్టపోయింది. మే 24 ఈనాడు ప్రకారం – టిక్కెట్ల కేటాయింపులో కూడా బిసిలకు న్యాయం చేసినట్లు కనిపించలేదు. రాయలసీమలో ఎనిమిది ఎంపీ స్థానాల్లో వైసిపి మూడు చోట్ల బిసిలకు టిక్కెట్లు యివ్వగా, టిడిపి ఒక్కటే యిచ్చింది.

రిజర్వ్‌డ్‌ కులాల విషయానికి వస్తే ఆంధ్రజ్యోతి మే 27 ప్రకారం – మాదిగలు టిడిపివైపు, మాలలు వైసిపి వైపు ఉన్నారని అంచనా. విభజన తర్వాత ఆంధ్రలో మాలలు ఎక్కువగా ఉన్నారన్న అంచనాతో టిడిపి మాలలను తమవైపు గుంజుకోవడానికి ఎస్సీ వర్గీకరణకు మద్దతు యివ్వలేదు, పార్టీలో మాల నాయకత్వానికి ప్రాధాన్యత పెంచింది. మాదిగలకు కూడా కొన్ని దక్కినా పార్టీలో తమ పలుకుబడి తగ్గిందనే భావన వారిలో కలిగింది. ఈ ఎన్నికలలో మాలల నుంచి అదనంగా ఓట్లు రాకపోగా, మాదిగల నుంచి గతం కంటె మద్దతు తగ్గిందని టిడిపి నాయకుల అంచనా. బిజెపికి దూరమయ్యాం కాబట్టి మైనారిటీ ఓట్లు వైసిపి నుంచి తమకు స్వింగ్‌ అవుతాయనుకున్న అంచనా కూడా తప్పింది. ఈ విధంగా సోషల్‌ యింజనీరింగులో టిడిపి తప్పిదాలు చేసింది.

రాజకీయ పరమైన తప్పిదాలు – 2009లో వైయస్‌ బాబుపై కొట్టిన 'విశ్వసనీయత లేదు' అనే ముద్ర అప్పుడు పనిచేసింది. ఈసారి 'యు టర్న్‌' బాబనే పేరు బాగా పడిపోయింది. హోదా-ప్యాకేజిలతో ఆడిన కోతికొమ్మచ్చులే కాకుండా బిజెపి-కాంగ్రెసుల మధ్య వేసిన కుప్పిగంతులు చూసి జనాలు అసహ్యించుకున్నారు. పొత్తు ఉన్న రోజుల్లో బిజెపిని అవధికి మించి ఆకాశానికి ఎత్తేశారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ఎసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఓడిపోవడంతో యిక బిజెపి పని అయిపోయిందని బాబు భావించి ఇక అప్పణ్నుంచి బిజెపిని, మోదీని ఆయన తిట్టని తిట్టు లేదు. బిజెపి వాళ్లు యుటిలైజేషన్‌ సర్టిఫికెట్ల గురించి ఆరాలు అడిగితే బాబు సరైన సమాధానాలు చెప్పలేక ప్రజల్లో అనుమానాలు రేకెత్తించారు. ఏ ప్రశ్న అడిగినా, ఏ సోదా జరిగినా దాన్ని తెలుగువాళ్లపై దాడిగా మలచబోయారు.

ఇవన్నీ చూసి ఎన్నికల వేళ మోదీ బాబుపై వ్యక్తిగతంగా కక్ష కట్టి, కేంద్రసంస్థల ద్వారా ఎంత సతాయించాలో అంత సతాయించారు. మోదీతో వ్యక్తిగత వైరం కారణంగా టిడిపి అభ్యర్థులకు నిధుల పంపిణీలో అడ్డంకులు వచ్చాయని చాలామంది అభిప్రాయం. ఇది కనీసం 50 చోట్ల పార్టీ విజయావకాశాలను దెబ్బ తీసిందని టిడిపి వారు అనుకుంటున్నారని ఈనాడు భోగట్టా. ఎన్‌డిఏ నుంచి బయటకు వచ్చాక బిజెపి, కాంగ్రెసులకు బాబు సమానదూరం పాటించినా మర్యాదగా ఉండేది. మతిమాలిన రాహుల్‌ గాంధీ చెప్పుడు మాటలు విని, రాష్ట్రాన్ని విడగొట్టి, హైదరాబాదును తెలంగాణకు యిచ్చి, ఆంధ్రను రిక్తహస్తాలతో నిలిపాడన్న సంగతి ఆబాలగోపాలానికి తెలుసు. అయినా అతనితో బాబు మంతనాలాడడం చూసి ఆంధ్రులు తెల్లబోయారు.

లెక్కలు చెప్పకపోయినా నిధులు కురిపించే అనుకూల ప్రభుత్వం కేంద్రంలో వస్తే తనకు అనుకూలంగా ఉంటుందనే ఊహతో జాతీయ రాజకీయాల్లోకి చొరబడి, బాబు రాష్ట్రంపై పట్టు కోల్పోయారు. రాష్ట్రంలో సీట్లు గెలిచి, అప్పుడు అక్కడ తిరిగి వుంటే మర్యాదగా ఉండేది. ఆలూ, చూలూ లేకపోయినా దిల్లీని పట్టుకుని వేళ్లాడడంతో ఆయాసమే మిగిలింది. ఇక పవన్‌ కళ్యాణ్‌ని వాడుకుందామని చూసిన విధానం యిద్దరినీ దెబ్బ తీసింది. పవన్‌ కళ్యాణ్‌తో ఓపెన్‌గా పొత్తు పెట్టుకుందామని బాబుకి సలహా యిచ్చానని కంభంపాటి చెప్పారు. బయట ఉంటే ప్రభుత్వవ్యతిరేక ఓట్లు చీలుస్తాడని బాబు బదులు యిచ్చారట. అటువంటప్పుడు పవన్‌, బాబు ఒకరినొకరు విమర్శించుకోవాల్సింది. అది జరగకపోవడంతో అతను టిడిపికి శత్రువో, మిత్రుడో తెలియక జనాలు కన్‌ఫ్యూజ్‌ అయ్యారు. చివరకు యిదేదో ప్యాకేజీ వ్యవహారమే అనుకుని వైసిపికి ఓట్లేశారు. పవన్‌కు పట్టుందనుకున్న గోదావరి జిల్లాలలో చూస్తే 19 సీట్ల తూగోజిలో టిడిపికి 13 నుంచి 4కి తగ్గాయి. 15 సీట్ల పగోజిలో 15 నుంచి 2కి తగ్గాయి. పవన్‌కు తూగోజిలో 1 దక్కింది.

వ్యూహరచన – ఎన్నికల వ్యూహరచన విషయంలో జగన్‌ ప్రశాంత్‌ కిశోర్‌ను నమ్ముకుని, ఆయన చెప్పినట్లే గుడ్డిగా వెళ్లిపోయాడు. ఆయన ప్రొఫెషనల్‌ కాబట్టి జగన్‌కు తన బలమేమిటో, బలహీనత ఏమిటో స్పష్టంగా చెప్పాడు. బాబు గ్రూపు ఎం అనే సంస్థను సలహాదారుగా నియమించుకున్నా ప్రయోజనం లేకపోయింది. లోపాల గురించి వాళ్లు చెప్పలేదో, యీయన వినలేదో తెలియదు. పార్టీని, ప్రభుత్వాన్ని చూసుకోవడంతో పాటు, జాతీయ రాజకీయాల్లో కూడా తిరగడంతో బాబుకి క్షేత్రస్థాయి వాస్తవాలు చెప్పేవారు లేకపోయారు. ఎన్నికలలో బ్యాక్‌ ఆఫీసు బాగా పనిచేయాలి. దాన్ని చూసుకునే లోకేశ్‌ మంగళగిరికే పరిమితం కావడంతో అది ఎఫెక్టివ్‌గా పని చేయలేకపోయింది.

టిక్కెట్ల పంపిణీలో కూడా టిడిపి తప్పులు చేసిందని ఈనాడు (మే 24) రాసింది. 'పదేళ్ల తర్వాత అధికారంలోకి రావటంతో చాలా చోట్ల ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా వ్యవహరించారు. ఇసుక తవ్వకాలు, బదిలీలు, కాంట్రాక్టుల్లో జోక్యం మితిమీరింది. గ్రామస్థాయిలో జన్మభూమి కమిటీల పైన ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రజల్లో సిటింగులపై వ్యతిరేకత ఉన్నా టిడిపి ఎనిమిది మంది వారసులతో బాటు 98 సిటింగులకు టికెట్లు యివ్వడం బెడిసికొట్టింది. అభియోగాలను ఎదుర్కుంటున్న వారికి మళ్లీ టిక్కెట్లివ్వడం క్షేత్రస్థాయిలో హానికరంగా మారిందని ప్రచారంలోకి వెళ్లాక బాబుకి అర్థమైంది. అందుకే 175 స్థానాల్లో, 25 లోకసభ స్థానాల్లో తననే అభ్యర్థిగా భావించి ఓటేయాలని ప్రజలను కోరారు.

ముక్తాయింపు –  బాబు తమ తప్పుల గురించి తెలుసుకోవాలి, లేదా కార్యకర్తలతో బాగా మసలి వాళ్లు చెప్తే వినాలి. సంస్థాగత ఎన్నికలు నిర్వహించి పార్టీని పునర్నిర్మించాలి. నిజాయితీపరులను గుర్తించి గౌరవించాలి. రాబోయే స్థానిక ఎన్నికలకు, ఉపయెన్నికలకు సంసిద్ధం చేయాలి. అది చేయకుండా వైసిపిని తిడుతూ కూర్చుంటే లాభం లేదు. అవతల జగన్‌ చకచకా చాలా సంస్కరణలు ప్రకటించేస్తున్నాడు. కానీ పూర్వానుభవాల బట్టి చూస్తే ఇవన్నీ సరిగ్గా జరుగుతాయన్న నమ్మకం కుదరటం లేదు. ఓ ఆర్నెల్లు ఆగితే పాయింట్లు దొరకకపోవు. అప్పటిదాకా బాబు తమాయించుకోవాలి. 'ప్రజావేదిక కూల్చడంతో జగన్‌ పతనం ప్రారంభమైంది', 'జగన్‌ నెలరోజుల పాలన వలన పెట్టుబడులు ఆగిపోయాయి','మాపై దాడులు జరుగుతున్నాయి' వంటి ప్రకటనల వలన టిడిపిపై జాలి పెరుగుతుంది తప్ప గౌరవం కలగదు. (సమాప్తం)
– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2019)
[email protected]

ఎమ్బీయస్‌: వెనుకచూపూ కావాలి, చంద్రన్నా! – 1/3

ఎమ్బీయస్‌: వెనుకచూపూ కావాలి, చంద్రన్నా! – 2/3