నెల్లూరు జిల్లా కావలికి చెందిన బొడ్డు నాగలక్ష్మి గురించి రెండు నెలల క్రితం వరకూ ఎవరికీ తెలియదు. కానీ ఆమె సేవా గుణం గురించి బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూసూద్ చేసిన ట్వీట్‌తో దేశమంతా నాగలక్ష్మి గుర్తింపు పొందారు. నాగలక్ష్మి సేవా ఫలాన్ని అందుకునే మంచి రోజు రానే వచ్చింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో సోనూసూద్ ఫౌండేషన్ సహకారంతో నెలకొల్పిన ఆక్సిజన్ ప్లాంట్‌ను శుక్రవారం నాగలక్ష్మి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని సోనూసూద్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం విశేషం.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు నాగలక్ష్మి స్వస్థలం. పుట్టుకతోనే ఆమె అంధురాలు. ప్రస్తుతం తండ్రి, అన్నావదినతో కలిసి ఆమె కావలిలో ఉంటున్నారు. అయితే చూపులేదని, ఇక బతుకు వృథా అని ఆమె ఏనాడూ కలత చెందలేదు. తన అన్న ఆదిరెడ్డి కళ్లతో నాగలక్ష్మి లోకాన్ని చూడడం మొదలు పెట్టింది.
చెల్లిలోని చొరవకు అన్న ప్రోత్సాహం తోడు కావడంతో నాగలక్ష్మికి కొత్త ప్రపంచం పరిచయమైంది. అన్నిటికి మించి బంగారు మనసున్న వదిన తోడు కావడంతో జీవితం “కవితా”మయమైంది. ఈ నేపథ్యంలో వదినాఆడబిడ్డ కలిసి ఓ యూట్యూబ్ చానల్‌ను స్టార్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో కరోనా సమయంలో ప్రజలకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ సాయం అందించడం నాగలక్ష్మిని ఆకర్షించింది. తాను కూడా సోనూసూద్ ఫౌండేషన్‌కు చేతనైన సాయం అందించాలని ఆమె భావించారు. అన్నావదిన సాయంతో సోనూసూద్ ఫౌండేషన్‌కు తన ఐదు నెలల ఫించన్ రూ.15 వేలను పంపి పెద్ద మనసు చాటుకున్నారామె.
అంధురాలైన నాగలక్ష్మి అందించిన ఆ సొమ్ము సోనూసూద్‌ను అమితానందానికి గురి చేసింది. ఆమెపై ప్రశంసలు కురిపించ కుండా ఉండలేకపోయారు. ఈ దేశంలో నాగలక్ష్మి కంటే గొప్ప ధనవంతులెవరూ లేరని ట్వీట్ చేశారాయన. అంతేకాదు, వేరొకరి బాధను చూసేందుకు కళ్లు అవసరం లేదన్నారు. ఆమే నిజమైన హీరో అంటూ ట్వీట్ చేసి దేశానికి నాగలక్ష్మి ఔదార్యం గురించి చాటి చెప్పారు. అలాగే నాగలక్ష్మి విరాళం ఎంతో మందిలో స్ఫూర్తి రగిల్చి, సోనూసూద్ ఫౌండేషన్‌కు అండగా నిలిచేలా చేసింది.
ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరులో తన ఫౌండేషన్ తరపున నెలకొల్పిన ఆక్సిజన్ ప్లాంట్‌ను అదే జిల్లాకు చెందిన నాగలక్ష్మి చేతుల మీదుగా ప్రారంభించేందుకు సోనూసూద్ నిర్ణయించారు. ఈ విషయాన్ని జగన్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం కూడా సంతోషించింది.
ఆక్సిజన్ ప్లాంట్‌ను అదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేతో పాటు మంత్రి కూడా అయిన మేకపాటి గౌతమ్‌రెడ్డి, కలెక్టర్ చక్రధర్‌బాబుతో కలిసి నాగలక్ష్మి ప్రారంభిస్తుండడం మనందరికీ గర్వకారణమని సోనూసూద్ ప్రకటించడం విశేషం. ఈ సందర్భంగా నాగలక్ష్మి ఫొటోను కూడా సోనూసూద్ షేర్ చేశారు. చూపు అనేది హృదయానికి సంబంధించిందని నాగలక్ష్మి తన చర్యల ద్వారా సమాజానికి ఓ గొప్ప సందేశం ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ హృదయ నేత్రిని అభినందిద్దాం.