మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై హీరో మంచు విష్ణు రోజురోజుకూ స్వరం పెంచుతున్నారు. మంచు విష్ణు మినహా మరెవరూ ‘మా’ ఎన్నికల గురించి అసలు మాట్లాడ్డం లేదు. కానీ మంచు విష్ణు మాత్రం వరుసగా వివిధ చానళ్లతో మాట్లాడుతూ ‘మా’ ఎన్నికలపై తన మనసులో మాటను బయట పెడుతున్నారు. శ్రుతి మించి మాట్లాడితే…అని హెచ్చరించిన వైనాన్ని మరిచిపోకనే… మరో అంశాన్ని విష్ణు తెరపైకి తేవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తెలుగు సినీ పరిశ్రమ పెద్దలందరూ కలిసి ఏకగ్రీవంగా ఎవరినైనా అధ్యక్షుడిగా ఎన్నుకుంటే ‘మా’ ఎన్నికల బరి నుంచి తాను తప్పుకుంటానని మరోసారి స్పష్టం చేశారు. కానీ ఏకగ్రీవం కాకపోతే మాత్రం ముందుగా అనుకున్నట్టుగా ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని ఆయన తేల్చి చెప్పారు.
కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, జయసుధ.. సినీ పరిశ్రమ పెద్దలందరూ కలిసి ఏకగీవ్రంగా ఎవర్ని ఎన్నుకున్నా తనకు ఓకే అన్నారు. కానీ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ తనకు సోదరుడు లాంటి వ్యక్తి అన్నారు. ఒకవేళ ఆయన్నే ఈ సారి అధ్యక్షుడిగా ఎన్నుకుంటే తానెంతో సంతోషిస్తానని ప్రకటించారు. అంతేకాదు, ఆయన అధ్యక్షుడైతే అందరికీ మంచి జరుగుతుందని మంచు విష్ణు చెప్పడం గమనార్హం.
బాలయ్య మాత్రమే కాదని, ఆయన జనరేషన్‌కు చెందిన కొంతమంది నటీనటులు అప్పట్లో ‘మా’ ఎన్నికల్లో నిలబడలేదన్నారు. వాళ్లల్లో అధ్యక్షుడిగా ఎవరైనా తనకు ఆనందమే అని మంచు విష్ణు ప్రకటించారు. అలాగే ‘మా’ భవన నిర్మాణం కోసం ప్లానింగ్ ఏంటో చెప్పాలని ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు సంధించిన ప్రశ్నపై కూడా మంచు విష్ణు స్పందించారు.
నాగబాబు తనకు తండ్రిలాంటి వ్యక్తి అన్నారు. అంతేకాదు, నాగబాబంటే తనకెంతో ఇష్టమని విష్ణు చెప్పుకొచ్చారు. ‘మా’ భవన నిర్మాణంలో తన ప్లానింగ్ గురించి నాగబాబు ఇటీవల మీడియా వేదికగా అడిగారని పేర్కొన్నారు. సరైన సమయం వచ్చినప్పుడు అందరికీ సమాధానం చెబుతానని మంచు తెలిపారు.
రెండు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. వాళ్లతో మాట్లాడి ‘మా’కు కావాల్సిన భూమిని సంపాదించుకోగలననే నమ్మకం తనకున్నట్టు విష్ణు వివరించారు.
మంచు విష్ణు ‘మా’ ఏకగ్రీవంపై పదేపదే ప్రతిపాదనలు చేయడం వెనుక మతలబు ఏంటబ్బా అనే చర్చ టాలీవుడ్‌లో జరుగు తోంది. రెండురోజుల క్రితం తోటి నటులను రెచ్చగొట్టేలా మాట్లాడిన బాలకృష్ణ అధ్యక్షుడైతే తనకు ఓకే అన్న మంచు విష్ణు వ్యాఖ్యలపై ప్రత్యర్థులు అప్రమత్తమయ్యారు.
మంచు వరుస వ్యాఖ్యల వెనుక ఉద్దేశాలపై లోతుగా విశ్లేషిస్తున్నారు. తాను కాకపోయినా, తన వాళ్లకు అధ్యక్ష పీఠం దక్కించుకునే వ్యూహంలో భాగంగానే మంచు విష్ణు వివిధ ప్రతిపాదనలను తెరపైకి తెస్తున్నారా? అనే అనుమానాలు ప్రత్యర్థుల నుంచి వ్యక్తమవుతున్నాయి.