మోగేదెలాగో తెలియక మూగబోయిన ‘గంట’

గంటా శ్రీనివాసరావుకి రాజకీయ చతురుడిగా పేరు. నచ్చిన నియోజకవర్గం నుంచి, నచ్చిన పార్టీ టికెట్ పై గెలవడం ఆయన స్పెషాలిటీ. నియోజకవర్గం మార్చేందుకు చాలామంది నాయకులు ఆపసోపాలు పడుతుంటే, గంటా మాత్రం అక్కడా ఇక్కడా…

గంటా శ్రీనివాసరావుకి రాజకీయ చతురుడిగా పేరు. నచ్చిన నియోజకవర్గం నుంచి, నచ్చిన పార్టీ టికెట్ పై గెలవడం ఆయన స్పెషాలిటీ. నియోజకవర్గం మార్చేందుకు చాలామంది నాయకులు ఆపసోపాలు పడుతుంటే, గంటా మాత్రం అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా ఎక్కడైనా చాకచక్యంగా పనికానిచ్చేసేవారు. 

వరుసగా రెండుసార్లు ఆయన ఏ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకోలేదంటే.. ఆయన ఎంత గాలివాటం మనిషో అర్థం చేసుకోవచ్చు. ఎక్కిదిగే పార్టీల గడపలు కూడా ఆయనకు ఎక్కువే. అలాంటి రాజకీయ చతురుడు.. ఇప్పుడు సైలెంట్ అయ్యారు. మోగేదెలాగో తెలియక ఆ 'గంట' కొన్నాళ్లుగా మూగబోయింది.

వైసీపీ ఎంట్రీ ఉంటుందా లేదా..?

టీడీపీ పరాభవం తర్వాత అందరికంటే ముందు పార్టీ మారేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. అయితే జగన్ పెట్టిన కండిషన్ వల్ల ఆయన కాస్త వెనకాడారు. పార్టీకి, పదవికి రాజీనామా చేసి బేషరతుగా వస్తేనే పార్టీ కండువా కప్పుతానన్నారు జగన్, దీంతో గంటా లాంటి నేతలు చాలామంది వెనకడుగేశారు. అప్పటికీ నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ వైపుకి వచ్చేశారనుకోండి.

కానీ గంటా మాత్రం అలాంటి సాహసం కూడా చేయలేక ప్లాన్-బి ఆలోచిస్తూ కాలం గడిపారు. ఈలోగా వైసీపీ నేతలతో ఆయనకు మాటల యుద్ధం ముదిరింది. గంటా-విజయసాయి రెడ్డి మధ్య పేలిన మాటల తూటాల వల్ల ఆయన ఆ గట్టుకి వచ్చే అవకాశం లేదని తేలిపోయింది.

గంటా పోటీ ఎక్కడినుంచి..?

గంటా ప్రస్తుతం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. విశాఖ ఉక్కుపోరాటంలో సింపతీ కోసం ఆయన రాజీనామా లేఖను సమర్పించారు, దాన్ని ఆమోదించాలంటూ స్పీకర్ ని కలసి కూడా విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతానికి ఆయన ఎమ్మెల్యే సీటు అలా డైలమాలో పడింది. 

రాజీనామా ఆమోదించినా, లేకపోయినా వచ్చే ఎన్నికల్లో గంటా ఎక్కడినుంచి పోటీ చేయాలనేదే ఇప్పుడు సమస్య. 2024 టార్గెట్ గా ఆయన రాజకీయాలు ఎలా ఉంటాయనేది చర్చనీయాంశంగా మారింది.

లోకేష్ కోసం త్యాగం చేయాల్సిందేనా..?

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీలోనే ఉంటూ భీమిలి నుంచి పోటీ చేయాలనేది గంటా ఆలోచన. అయితే అక్కడ లోకేష్ కోసం గ్రౌండ్ ప్రిపేర్ అవుతోంది. సిట్టింగ్ స్థానం విశాఖ నార్త్ నుంచి పోటీ చేస్తే ఈసారి డిపాజిట్ కూడా రాదని గంటాకు తెలుసు. 

వైసీపీలోకి వెళ్తే ఏ నియోజకవర్గం నుంచి అయినా పోటీ చేసి గెలవొచ్చు. కానీ వైసీపీకి దారులు మూసుకుపోయాయి. పార్టీకి, పదవికి మరోసారి రాజీనామా చేసి, దాన్ని ఆమోదించుకుని వైసీపీలోకి అడుగుపెట్టే పరిస్థితి లేదు.

సో.. గంటా పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరం. రాబోయే రెండేళ్లలో ఆయన రాజకీయ జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి. పుండుమీద కారం చల్లినట్టు రాజకీయాల నుంచి తప్పుకుంటారనే వార్తలు ఇప్పుడు గంటాను మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.