కరోనాతో కలిసి జీవించాల్సిందేనని, అంతకు మించి మార్గం లేదని తెలుగు ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ తనయుడు కేటీఆర్ కూడా ఇదే మాట చెప్పారు. కేంద్రం కూడా క్రమంగా సడలింపులు ఇస్తోంది. నెమ్మదిగా కార్యాలయాలు పనిచేయిస్తున్నారు. కేంద్రం రైళ్లు కూడా నడుపుతోంది. ఏపీలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నా సీఎం జగన్ కేంద్రాన్ని సడలింపులు అడుగుతూనే ఉన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు. తెలంగాణలో రెడ్ జోన్లు మినహా ఆరెంజ్, గ్రీన్ జోన్లలో ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులు తెరిచారు. హైదరాబాదులో మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు నడపడానికి అనుమతులు లేవు. కానీ ప్రభుత్వ ఆఫీసులు, ఐటీ కంపెనీలు పనిచేయడం ప్రారంభించాయి. వరుసగా మూడు రోజులు ఆఫీసుకు ఆలస్యంగా వస్తే జీతం కోస్తామని కూడా అధికారులు హెచ్చరించారు. కరోనాతో కలిసి జీవించడానికి ప్రజలు సిద్దమైపోతున్నారు. మద్యం దుకాణాలకు ఆల్రెడీ అనుమతి ఇచ్చేశారు. తెలంగాణలో అయితే రెడ్ జోన్లో ఉన్న మద్యం దుకాణాలు కూడా తెరుచుకోవచ్చని చెప్పారు. ఈ సమయంలో కొందరు మద్యం దుకాణాలకు పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వం దేవాలయాలు తెరవడానికి ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు.
ఈ విమర్శ కూడా సమంజసమే అనుకున్నాయి ప్రభుత్వాలు. ఏపీలో శ్రీకాళ హస్తి ఆలయానికి అనుమతి ఇచ్చింది. కొన్ని నిబంధనలు పాటిస్తూ ఆలయంలోకి భక్తులను అనుమతించాలని ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏమిటా నిబంధనలు ? ఆలయానికి వచ్చే భక్తులు మాస్కులు తప్పనిసరిగా పాటించాలి. భౌతిక దూరం పాటించాలి, శానిటైజర్ తో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, థర్మల్ స్క్రీనింగ్ గన్స్ ఏర్పాటు చేశామని అధికారులు చెప్పారు. కరెక్టే. ఈ నిబంధనలన్నీ పెట్టారు. బాగానే ఉంది.
కానీ మన ఆలయాల్లో ఎన్నాళ్లు అమలు చేయగలరు ? వారమో, పది రోజులో నిబంధనలు పాటిస్తారు. పాటించేలా చేస్తారు. కానీ రానురాను పరిస్థితి మామూలై పోతుంది. ఎప్పటిమాదిరిగానే గుంపులుగా వెళ్ళిపోతారు. ఒక ఆలయం తెరిచారు కాబట్టి మరో పది ఆలయాలు తెరుస్తారు. హిందూ ఆలయాలు తెరిచారు కాబట్టి మసీదులూ తెరుస్తారు. అవి తెరిచారు కాబట్టి చర్చిలు, గురుద్వారాలు తెరుస్తారు. అన్ని మతాల ఆలయాలు తెరుస్తారు కాబట్టి క్రమంగా పర్వదినాలు, ఉత్సవాలు జరుగుతాయి.
ఇవి జరుగుతాయి కాబట్టి భక్తులు రాకుండా ఉండలేరు . నిబంధనలు పెట్టినా అవి నామమాత్రమే అవుతాయి. దక్షిణ కొరియాలో ఇలాగే జరిగింది. లాక్ డౌన్ ఎత్తేసి క్లబ్బులకు, పబ్బులకు అనుమతి ఇవ్వగానే కరోనా పడగ విప్పింది. కరోనాపై విజయం సాధించామనుకుంటూ చైనాలోని వూహాన్లో లాక్ డౌన్ ఎత్తేశారు. కొత్త కేసులు మళ్ళీ పుట్టుకొచ్చాయి. ఏదైతే అది అవుతుందనుకొని కరోనాతో కలిసి బతకాల్సిందే. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లుగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఫలితం గురించి ఆలోచించకు.