విశాఖ ఇంటర్నేషనల్ సిటీగా ఎదురుతోంది. అలాంటి విశాఖ సిగలో కలికి తురాయి లాగ ఒక అద్భుతమైన కార్యక్రమం రూపుదిద్దుకోబోతోంది. విశాఖలో రానున్న రోజులలో బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మాణం జరగబోతోంది.
పాతిక ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోయే ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కొద్ది నెలల వ్యవధిలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మొహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు అని వైసీపీ వర్గాలు తెలిపాయి. ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం స్పెషాలిటీ ఏంటి అంటే అన్ని క్రీడలు ఒకే చోట నిర్వహించుకోవచ్చు. ఒక విధంగా ఇది ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గా నిర్మించబోతున్నారు. విశాఖలో ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఉంది.
ఇపుడు దానికి అదనంగా ఈ కొత్త స్టేడియం నిర్మాణంతో విశాఖ క్రీడా రాజధానిగా మారుతుందని వైసీపీ నేతలు అంటున్నారు విశాఖను అన్ని విధాలుగా తమ పాలనలో అభివృద్ధి చేస్తున్నామనడానికి ఈ కార్యక్రమాలే ఉదాహరణ అని చెబుతున్నారు.
విశాఖలో ఈ నెల 16 నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. క్రికెట్ అభిమానులకు అపుడే ఫీవర్ స్టార్ట్ అయింది. రానున్న రోజుల్లో ఇంటర్నేషనల్ మ్యాచెస్ విశాఖ కేంద్రంగా ఎక్కువ జరిగేలా చేసేందుకు కొత్తగా నిర్మిస్తున్న ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉపయోగపడుతుంది అని అంటున్నారు.