ఇదో అరుదైన సందర్భం. తన ప్రియుడు కోసం పాకిస్థాన్ నుంచి ఇండియాలోకి అక్రమంగా వచ్చిన సీమా హైదర్, భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరేసింది. అటు తన ఫేస్ బుక్ ఫ్రెండ్ కోసం ఇండియా నుంచి పాకిస్థాన్ వెళ్లిన అంజు, పాక్ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అతడితో కలిసి కేక్ కట్ చేసింది.
కేక్ కట్ చేసిన అంజు..
34 ఏళ్ల అంజు తన ఫేస్‌బుక్ ఫ్రెండ్ ను కలవడానికి చట్టబద్ధంగా పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్వూన్ ప్రాంతంలోని మారుమూల గ్రామానికి వెళ్లింది. ఈ మహిళ ఉత్తరప్రదేశ్‌లోని కైలోర్ గ్రామంలో జన్మించింది. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో పెరిగింది. 2019లో అంజు, పాక్ కు చెందిన 29 ఏళ్ల నస్రుల్లా ఫేస్‌బుక్‌లో స్నేహితులయ్యారు.
నస్రుల్లాను కలవడానికి అధికారిక పాకిస్తాన్ వీసాపై గిరిజన ప్రాంతమైన ఖైబర్ ప్రావిన్స్‌లోని అప్పర్ దిర్ జిల్లాకు వెళ్లింది అంజు. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ ప్రకారం, అంజుకు 30 రోజుల వీసాను మంజూరు చేశారు. ఇది కేవలం అప్పర్ దిర్ జిల్లాకు మాత్రమే చెల్లుతుంది. సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన నస్రుల్లా, ఐదుగురు సోదరులలో చిన్నవాడు. అతను స్థానిక అధికారులకు అంజుపై అఫిడవిట్ ఇచ్చాడు. తమది కేవలం స్నేహం మాత్రమే అంటున్నాడు. లెక్కప్రకారం, మరో వారం రోజుల్లో భారత్ కు తిరిగిరావాలి అంజు. లేదంటే ఆమెను పాకిస్థాన్ లో అరెస్ట్ చేస్తారు.
ఇండియా జెండా ఎగరేసిన సీమా హైదర్..
ఇటు పబ్ జీ ప్రేమకథ సీమా హైదర్ గురించి అందరికీ తెలిసిందే. నొయిడాకు చెందిన సచిన్ ను ఈమె ప్రేమించింది. అతడి కోసం పాక్ లోని తన భర్తను వదలేసింది. నలుగురు పిల్లలతో కలిసి నేపాల్ వచ్చింది. అక్కడే సచిన్ ను పెళ్లాడింది. అట్నుంచి అటు అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించి, సచిన్ ఇంటికి దగ్గర్లోనే ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. ఈ విషయాన్ని భారత్ అధికారులు పసిగట్టారు. అప్పట్నుంచి సీమా హైదర్ వ్యవహారం వార్తల్లో నలుగుతూనే ఉంది.
తను పాకిస్థాన్ తిరిగి వెళ్లనని, నలుగురు పిల్లలతో కలిసి సచిన్ తోనే ఉండిపోతానని అంటోంది సీమా. అంతేకాదు, భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సచిన్ తో కలిసి జాతీయ జెండా ఎగరేసింది. జెండాకు సెల్యూట్ చేసింది. భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేసింది. మెడలో త్రివర్ణ పతాకాన్ని పోలిన చున్నీని ధరించి, 'హర్ ఘర్ తిరంగ' వేడుకల్లో పాల్గొంది. తను ఎలాంటి సినిమాల్లో నటించడం లేదని, అన్ని సినిమా ఆఫర్లను తిరస్కరించానని ఈ సందర్భంగా సీమా స్పష్టం చేసింది.