ప‌ద‌విపై ఆశ‌లు వ‌దిలేసుకున్న ఆ సీఎం?

రెండేళ్ల కింద‌ట పొలిటిక‌ల్ హైడ్రామా మ‌ధ్య‌న క‌ర్ణాట‌క సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన య‌డియూర‌ప్ప‌ను ఆ హోదా నుంచి బీజేపీ అధిష్టానం దించేయ‌నుంద‌నే ప్ర‌చారం మ‌రింత‌గా ఊపందుకుంటోంది. గ‌త కొన్నాళ్లుగా ఈ విష‌యంలో ర‌క‌ర‌కాల వార్త‌లు…

రెండేళ్ల కింద‌ట పొలిటిక‌ల్ హైడ్రామా మ‌ధ్య‌న క‌ర్ణాట‌క సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన య‌డియూర‌ప్ప‌ను ఆ హోదా నుంచి బీజేపీ అధిష్టానం దించేయ‌నుంద‌నే ప్ర‌చారం మ‌రింత‌గా ఊపందుకుంటోంది. గ‌త కొన్నాళ్లుగా ఈ విష‌యంలో ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌స్తున్నాయి. ప‌ద‌విని నిల‌బెట్టుకోవ‌డానికి య‌డియూర‌ప్ప కూడా ప‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టుగా క‌నిపించారు. 

ఆయ‌న త‌న‌యుడు ఢిల్లీ వెళ్లి మంత్రాంగాన్ని న‌డిపించారు. అయితే అందుకు ప్ర‌యోజ‌నాలు ఏవీ ద‌క్క‌డం లేదని.. య‌డియూర‌ప్ప స్థానంలో మ‌రొక‌రిని నియ‌మించ‌డానికి బీజేపీ హైక‌మాండ్ రంగం సిద్ధం చేసింద‌నే ప్ర‌చారం ఇప్పుడు మ‌రింత‌గా ఊపందుకుంటోంది. ఈ ప్ర‌చారాన్ని చేస్తున్న‌ది ఎవ‌రో కాదు.. క‌ర్ణాట‌క బీజేపీ నేత‌లే కావ‌డం గ‌మ‌నార్హం.

య‌డియూర‌ప్ప‌ను ఆ ప‌ద‌వి నుంచి దించి.. మ‌రొక‌రిని క‌ర్ణాట‌క సీఎంగా నియ‌మించేందుకు అధిష్టానం క‌స‌ర‌త్తు సాగిస్తోంద‌ని బీజేపీ నేత‌లు బాహాటంగానే ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. హిందుత్వ‌వాది అయిన నేత‌నే అధిష్టానం ఎంపిక చేస్తుందంటూ వారు మీడియాతో చెబుతున్నారు. మ‌రోవైపు య‌డియూర‌ప్ప త‌న‌యుడు ఈ అంశంపై స్పందిస్తున్నారు. లాబీయింగ్ చేస్తున్నారు. ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు అయితే చేస్తున్నారు. 

కుమార‌స్వామిని సీఎం పీఠం నుంచి దించి.. య‌డియూర‌ప్ప సీఎం పీఠాన్ని చేప‌ట్టి రెండేళ్లు గ‌డుస్తున్నాయి. అందుకు సంబంధించి సంబ‌రాల‌కు కూడా య‌డియూర‌ప్ప దూరంగా ఉంటున్నార‌ట‌. ఈ సారి ముఖ్య‌మంత్రి అయ్యి రెండేళ్లు అవుతున్న త‌రుణంలో బీజేపీ ఎమ్మెల్యేలంద‌రికీ గ్రాండ్ పార్టీ ఇవ్వాల‌ని కూడా ముందుగా అనుకున్నార‌ట య‌డియూర‌ప్ప‌. అయితే ఇప్పుడు ఆయ‌న‌ను దించేయ‌డానికి అధిష్టానం క‌స‌ర‌త్తును తీవ్రం చేసింద‌నే వార్త‌ల నేప‌థ్యంలో ఆ సంబ‌రానికి ఆయ‌న దూరం అయ్యార‌ట‌. 

క‌ర్ణాట‌క కొత్త సీఎం ఎవ‌ర‌నే అంశంలో ప‌లు పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. సామాజిక‌వ‌ర్గ స‌మీక‌ర‌ణాలు అధికంగా ఉండే రాష్ట్రాల్లో ఒక‌టి క‌ర్ణాట‌క‌. ఇప్పుడు కూడా య‌డియూర‌ప్ప‌ను దించేయ‌డం బీజేపీ హై క‌మాండ్ కు తేలికైన అంశం కాదు. య‌డియూర‌ప్ప‌ను దించేస్తే ఆయ‌న సొంత సామాజిక‌వ‌ర్గం బీజేపీకి దూరం అయ్యే అవ‌కాశాలు లేక‌పోలేదు. గ‌తంలో ఇలాగే జ‌రిగితే.. య‌డియూర‌ప్ప సొంత పార్టీ పెట్టి బీజేపీని ఓడించాడు.  

ఇప్పుడు ఆయ‌న సొంత కుంప‌టి పెట్టేంత ప‌రిస్థితుల్లో లేక‌పోయినా.. ఆయ‌న సామాజిక‌వ‌ర్గం వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా బీజేపీని సపోర్ట్ చేస్తుంద‌నే న‌మ్మ‌కాలు ఉండ‌వు. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క‌లో బీజేపీ ప‌రిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఈ మ‌ధ్య‌నే ఒక ఎంపీ సీటు సానుభూతి ఉప ఎన్నిక‌లో కూడా బీజేపీ జ‌స్ట్ ఐదారు వేల ఓట్ల‌తో బ‌య‌ట‌ప‌డింది. 

మ‌రో రెండేళ్ల లో క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో య‌డియూర‌ప్ప‌ను క‌దిలించ‌డం ఒక ర‌కంగా తేనెతుట్టెను క‌ద‌ప‌డ‌మే. కేంద్రంలో అధికారం చేతిలో ఉంది కాబ‌ట్టే.. బీజేపీ ఈ మాత్రం సాహ‌సానికి అయినా ఒడిగ‌డుతున్న‌ట్టుగా ఉంది.