వనిత విజయ్‌కుమార్… సీనియర్ నటుడు విజయ్, నటి మంజుల దంపతుల పెద్ద కూతురు. వివాదాస్పద నటి. నిత్యం వార్తల్లో వ్యక్తి. ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నా ఏదీ కలిసి రాలేదు. ప్రస్తుతం తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన ఓ ఫొటో చిత్ర పరిశ్రమలో వైరల్ అవుతోంది. తమిళ పవర్ స్టార్ శ్రీనివాసన్‌తో పూలదండలు మార్చుకుంటున్న స్టిల్‌ను ఆమె సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.
పైగా వైవాహిక జీవితం విజయవంతంగా సాగాలనే కామెంట్స్ వెల్లువెత్తాయి. దీంతో ఆమెకు నాలుగో పెళ్లి అయ్యిందనే వార్త చక్కర్లు కొడుతోంది. 'చంద్రలేఖ' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన వనిత తమిళ బిగ్‌బాస్ షోలో కూడా పాల్గొన్నారు. దీంతో ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. దీనికి తోడు ఆమె వ్యక్తిగత జీవితంలో పెళ్లిళ్ల కాంట్రవర్సీ… ఎప్పుడూ ఆమె పేరు చర్చల్లో ఉండేట్టు చేసింది.
ఈ నేపథ్యంలో త్వరలో ఆమె నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఓ జ్యోతిష్యుడు జోస్యం చెప్పడంతో ఆమె వైవాహిక జీవితంపై జరుగుతున్న ప్రచారానికి బలం ఇచ్చింది. 'S' అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తితో ఆమె నాలుగో పెళ్లి జరుగుతుందని, వనిత రాజకీయాల్లో కూడా ప్రవేశిస్తారని సదరు జ్యోతిష్యుడు చెప్పిన అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ పరంపరలో తమిళ పవర్ స్టార్ శ్రీనివాసన్‌తో పూలదండలు మార్చుకుంటూ వనిత కన్పించడం తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. జ్యోతిష్యుడు చెప్పినట్టుగానే ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే శ్రీనివాసన్‌తో వనితకు పెళ్లి అయ్యిందనే చర్చ సర్వత్రా జరుగుతోంది. కానీ ఎలాంటి వివరణ లేకుండా కేవలం ఫొటో మాత్రమే షేర్ చేయడం వెనుక వనిత ఉద్దేశం ఏంటో ఎవరికీ అంతు చిక్కడం లేదు.
ఎందుకంటే ఈ ఫొటో నిజమైన పెళ్లిది కాదని, ప్రస్తుతం ఆమె నటిస్తున్న ఓ సినిమాలోని స్టిల్ అని కొందరు చెబుతున్నారు. రియాల్టీ ఏమైనా, ఆ ఫొటో మాత్రం ఆమె నాలుగో పెళ్లి చేసుకుందనే ప్రచారానికి కారణమైంది. నిజానిజాలేంటో వనితే చెప్పాల్సి ఉంది.