ఇదో చిన్న పొడుపు కథ. టాలీవుడ్ లో అంతే.. టాలీవుడ్ లో అంతే అనుకుని నిట్టూర్చే కథ. అనగనగా ఓ నిర్మాణ సంస్థ. ఓ తమిళ డబ్బింగ్ సినిమా చేసింది. పెద్ద హిట్ అయి నాలుగు డబ్బులు వచ్చాయి. రెండో ప్రాజెక్టుగా ఓ రైటర్ దగ్గర మాంచి కథ వుంటే తీసుకుంది. పూరి జగన్నాధ్ లాంటి మాంచి మాస్ డైరక్టర్ ను తీసుకువచ్చి కథ వినిపించింది. బాగుంది అన్నారు.
రామ్ లాంటి మాంచి మాస్ హీరోను తీసుకువచ్చారు. వినిపించారు. సూపర్ చేద్దాం అన్నారు. కానీ అక్కడే చిన్న తేడా వచ్చింది. ఆ కథ విన్న డైరక్టర్ ఆ సినిమాను తన బ్యానర్ మీద చేస్తాను. కావాలంటే పార్టనర్ షిప్ అన్నారు. నిర్మాతలు అబ్బే కుదరదు అన్నారు. అయితే చేయను అన్నారు డైరక్టర్.
కట్ చేస్తే, వన్ ఫైన్ మార్నింగ్ కథ విన్న డైరక్టర్, హీరోల కాంబినేషన్ లో, హీరో నిర్మాతగా సినిమా అనౌన్స్ అయిపోయింది. తొలి నిర్మాత, కథకుడు మౌనం వహించారు. ఇంతకీ తొలి కథకుడు, ఆ దర్వకుడికి చెప్పిన కథేంటీ అంటే..
అనగనగా ఓ పోలీస్ అధికారి. చనిపోతాడు. అనగనగా ఓ ఆవారా కుర్రాడు. బలాదూర్ తిరుగుతుంటాడు. కానీ బోలెడు ధైర్యం. ఈ పోలీస్ అధికారి ఆత్మను, ఆ ఆవారా కుర్రాడి మీద ఆవాహన చేయిస్తే, ఇక దుర్మార్గులతో చెడుగుడు ఆడేసి, పోలీసు అధికారి అనుకున్న పనులు అన్నీ ఈ ఆవారా చేసేస్తాడు. అంటే ఈ పోలీసు అధికారి బుర్రలో వున్నది ఆ ఆవారా కుర్రాడి బుర్రలోకి పోయిందన్న మాట.
లేటెస్ట్ గా ఓ సినిమా ట్రయిలర్ వచ్చింది. ఈ బుర్రలో వున్న వ్యవహారాలు మొత్తం చిప్ లోకి మార్చి, ఆ బుర్రలోకి ఎక్కించి, పనులు కానిచ్చేయడం వంటి కాన్సెప్ట్ ఏదో అని తెలుస్తోంది. అవును.. ఇంతకీ తొలిగా ఆ లైన్ చెప్పిన కథేమయింది? కథకుడు ఏమయ్యాడు? అన్యాయం అయిపోయినట్లేనా?
టాలీవుడ్ లో అంతే.. టాలీవుడ్ లో అంతే.