టీడీపీ విస్తృతస్థాయి సమావేశ తీర్మానాల్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. ఈ మాత్రం దానికి భారీ డైలాగ్‌లు ఎందుకబ్బా? అనే అసహనం ఎవరిలోనైనా కలుగుతుంది. జగన్‌పై ఇంకా పాతచింతకాయ పచ్చడి ఆరోపణలనే పట్టుకుని వేలాడ్డం చూస్తే… టీడీపీకి భవిష్యత్ లేదనే అభిప్రాయాలు బలపడుతున్నాయి. జగన్ లక్ష కోట్లు దోచుకున్నారని గత పదేళ్లుగా చంద్రబాబుతో పాటు ఆయన పార్టీ నేతలు, ఎల్లో మీడియా గొంతు చించుకుంటున్నారు. వినీవినీ జనానికి విసుగెత్తింది. ఇవేవీ పట్టించుకోకుండా జగన్‌కు జనం పట్టం కట్టారు.
జగన్‌పై అవినీతి ఆరోపణల వల్ల టీడీపీకి వచ్చే లాభం శూన్యం. ఈ మాత్రం ఇంగితం కూడా లేకుండా రానున్న ఎన్నికలకు టీడీపీ ఎంచుకున్న ఎజెండా చూస్తే… వీళ్లకేమైనా మైండ్ దొబ్బిందా? అనే అనుమానం కలుగుతోంది. గతంలో తమ పాలనకు, ప్రస్తుత జగన్ పాలనకు మధ్య వ్యత్యాసం చూపుతూ ….ఎవరి హయాంలో మంచి జరిగిందో చెప్పగలిగితే అది ప్రయోజనకరంగా వుంటుంది. ఊహూ, టీడీపీ అలా చేయదట!
జగన్ అవినీతి అంటూ టీడీపీ మళ్లీ పాత పాటే ఎత్తుకుంది. జగన్ అధికారంలో లేనప్పుడు లక్ష కోట్లు దోచుకున్నారని విస్తృతంగా దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో జగన్ దోపిడీ టీడీపీ ఆరోపణల ప్రకారం… రూ.2.02 లక్షల కోట్లు. దీన్ని జనాల్లోకి విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలని టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో టీడీపీ నిర్ణయించింది. వీరి పైత్యం ఏ స్థాయిలో వుందంటే… టీడీపీ నాయకులకు అందజేసిన 47 పేజీల ఎజెండా బుక్‌లో 13 పేజీల్ని కేవలం జగన్ అవినీతి అంశానికే చోటు కల్పించారు. ఇంతకూ అవినీతి ఏందయ్యా అంటే… ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో వైఎస్ జగన్, ఆయన భార్య భారతీరెడ్డి, విజయసాయిరెడ్డిలు ఉన్నారని పేర్కొన్నారు.
ఇదేందబ్బా… కేసీఆర్ తనయ కవిత ఉన్నారని విన్నాం కానీ, వైఎస్ భారతి ఎక్కడి నుంచి వచ్చారని అమాయకంగా ఎవరైనా ప్రశ్నించే అవకాశాలున్నాయి. ఇందుకు టీడీపీ చెప్పేది ఏంటంటే… లిక్కర్ కుంభకోణంలో ట్రైడెంట్ లైఫ్‌సైన్సెస్, ఆ కంపెనీ డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయట. జగతి పబ్లికేషన్స్‌లో ఈ కంపెనీ పెట్టుబడులు పెట్టిన కారణంగా , ఆ సంస్థ చైర్పర్సన్ వైఎస్ భారతికి సంబంధం ఉన్నట్టు టీడీపీ లెక్క తేల్చింది. అలాగే శరత్‌చంద్రారెడ్డి సొంత సోదరుడు రోహిత్‌రెడ్డి. ఈయన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి స్వయాన అల్లుడు. అందువల్ల లిక్కర్ కుంభకోణంలో వీళ్ల పాత్ర ఉన్నట్టు టీడీపీ నిర్ధారించింది.
ఇలా వుంటాయి మరి టీడీపీ అవినీతి ఆరోపణలు. తమ అభిప్రాయాల్ని జనంపై రుద్ది పబ్బం గడుపుకోవాలనే ఎత్తుగడలకు కాలం చెల్లిందని టీడీపీ ఇంకా గ్రహించలేదు. సమాజ ధోరణి మారింది. అందుకు తగ్గట్టు తాము ఆలోచించడం లేదని టీడీపీ గుర్తించడం లేదు. అందుకే సమాజానికి టీడీపీ క్రమంగా దూరమయ్యే పరిస్థితి.
ఎంతోకొంత వాస్తవం వుంటే, మరికొంత కల్పించి చెబితే ప్రయోజనం వుంటుంది. అలా కాకుండా మాయలతో కనికట్టు చేస్తామంటే కుదరదు. జగన్ ప్రజావ్యతిరేక పరిపాలనపై పోరాటం చేస్తేనే టీడీపీకి ప్రయోజనం. అందుకు విరుద్ధంగా రూ.2 లక్షల కోట్ల అవినీతో, మరొకటో అని ప్రజలకు సంబంధం లేని అంశాల్ని నెత్తికెత్తుకుంటే మాత్రం భారీ మూల్యం చెల్లించాల్సి వుంటుంది. అందుకు సిద్ధమైతే… అడ్డుకునే వారెవ్వరు?