ఇటీవల స్టాండప్ కామెడీపై పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. గుజరాత్‌కు చెందిన స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ వైఖరే ఇందుకు కారణం. మతపరమైన విద్వేషాలను రెచ్చగొడుతుంటాడని బీజేపీ నేతల ఆరోపణ. ఇటీవల హైదరాబాద్‌లో మునావర్ షో వివాదానికి తెరలేచింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రదర్శనను అడ్డుకుంటామని బీజేపీ హెచ్చరించింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కామెడీ షోను ఎలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా ముగించారు.
ఇప్పుడు టాలీవుడ్‌లోనూ ఓ స్టాండప్ కమెడియన్ పుట్టుకొచ్చారు. ఆ స్టార్ కమెడియనే పవన్‌కల్యాణ్. పవన్‌లో సీరియస్ యాక్టర్‌నే ఇంత కాలం చూశాం. ఇది వెండితెరపైన. కానీ రాజకీయ తెరపై పవన్‌కల్యాణ్ కామెడీ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ తాజా ప్రకటన చూస్తే… ఎవరికైనా ఇదే అభిప్రాయం కలుగుతుంది.
విజయవాడ పశ్చిమ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో జనసేన జెండా ఆవిష్కరణలకు వైసీపీ వర్గాలు అడ్డుపడుతున్నాయని పవన్ సీరియస్ అయ్యారు. జనసేన ఉనికి లేకుండా చేయడం ఎవరితరమూ కాదని ఆయన హెచ్చరించారు. ప్రజలే పార్టీని కాపాడుకుంటారని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలకు ఇబ్బంది కలగకూడదనే ఇంత జరుగుతున్నా తాను రోడ్డు మీదకి రాలేదని పేర్కొన్నారు.ఈ పరిస్థితిలో మార్పు రాకపోతే మాత్రం తానే నేరుగా రోడ్డు మీదకి వస్తానని ఆయన హెచ్చరించడం గమనార్హం.
పవన్ ప్రకటనలో కామెడీ అంశాలేంటో చూద్దాం. పవన్ అన్నట్టు ఆయన పార్టీ ఉనికిని మరెవరూ నాశనం చేయలేరు. ఎందుకంటే ఆయన వుండగా, ఆ పని మరొకరు చేసే అవకాశాన్ని రానివ్వరని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. జనసేన ఉనికి ఉందని, దాన్ని వైసీపీ నాశనం చేయాలని చూస్తోందని అనుకోవడమే పెద్ద కామెడీ. జనసేనకు ఏ మాత్రం ఉనికి లేకుండా పవనే చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ప్రజలే పార్టీని కాపాడుకోవాలని అనుకున్నా, అది సాధ్యం కాదు. ఎందుకంటే తన చూపంతా చంద్రబాబుపై ఉన్నప్పుడు ప్రజలెందుకు ఆదరించాలో పవన్ జవాబు చెప్పాల్సి వుంది. కాబట్టి చంద్రబాబు కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వను లాంటి స్టేట్‌మెంట్స్ ఇచ్చే జనసేన అధిపతే ఆ పార్టీ ఎదుగుదలకు అడ్డంకి.
ఇక తాను రోడ్డు మీదకి వస్తే… శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే భ్రమలో పవన్ ఉండడం… అన్నిటికీ మించిన పెద్ద కామెడీ. వావ్… మనకూ దొరికాడో స్టాండప్ కమెడియన్ అనేలా పవన్ ప్రకటన, మాటలు ఉంటున్నాయని నెటిజన్ల అభిప్రాయం.