తను రాజీనామాకే కట్టుబడినట్టుగా మరోసారి స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. తను ప్రస్తుతం ఏఐసీసీ అధ్యక్షుడిని కాదంటూ రాహుల్ తేల్చిచెప్పాడు. తను మాజీ అధ్యక్షుడినంటూ ఆయన పేర్కొన్నారు. ఏఐసీసీకి మరొకరిని అధ్యక్షుడిగా ఎన్నుకునే ప్రక్రియను ముమ్మరం చేయాలని రాహుల్ గాంధీ తన పార్టీ వాళ్లకు సూచించారు.
ఈ విషయంలో రాజీపడేది లేదని రాహుల్ క్లారిటీ ఇచ్చారు. రాహుల్ రాజీనామా వ్యవహరం ఫలితాలు వచ్చిన రోజు నుంచి రచ్చగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఓటమికి బాధ్యత వహిస్తూ తను రాజీనామా చేసినట్టుగా రాహుల్ గాంధీ ప్రకటించారు. అయితే ఆ రాజీనామా ఉత్తుత్తిదే అని మొదట అంతా అనుకున్నారు. అయితే రాహుల్ మాత్రం ఆ రాజీనామాకు కట్టుబడినట్టుగా తేల్చిచెబుతూ వచ్చారు.
రాహుల్ ను కన్వీన్స్ చేయాలని సోనియా, ప్రియాంకలు కూడా ప్రయత్నించినట్టుగా సమాచారం. అయితే రాహుల్ మాత్రం రాజీపడలేదు. ఈ నేపథ్యంలో రాజీనామా విషయంలో రాహుల్ గాంధీ మరోసారి స్పష్టత ఇచ్చినట్టే అని తెలుస్తోంది. తన స్థానంలో మరొకరిని ఏఐసీసీ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవాలని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది.
మొత్తానికి తనది రాజీడ్రామా కాదు, రాజీనామానే అని రాహుల్ తేల్చిచెప్పాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిగా ఎవరు రాబోతున్నారో!