పాతికేళ్ల ప్రయాణం.. నోట్లు పంచని రాజకీయం.. ఇదీ జనసేన పార్టీ విధానం అంటూ పదే పదే చెప్పుకొస్తుంటారు పవన్ కల్యాణ్. ఆయన వందిమాగధులు కూడా ఇదే విషయాన్ని నొక్కివక్కాణించినా జనసేన పోటీ చేసిన ప్రతిచోటా నోట్ల వరద పారిందనేది బహిరంగ రహస్యం. ఆ సంగతి పక్కపెడితే రాజకీయ పార్టీ నడవాలంటే నిధులు అనివార్యం. అవి ఎలా వచ్చాయి, ఎవరిచ్చారు అనే సంగతి పక్కనపెడితే.. రోజువారీ కార్యకలాపాలకు మాత్రం సొమ్ములు కావాల్సిందే. అందుకే విరాళాల వెంటపడుతుంటాయి రాజకీయ పార్టీలు.
జనసేన కూడా ఇందుకు అతీతం కాదు. అయితే ఆ పార్టీ విరాళాలు అడుగుతున్న విధానమే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ కి గురవుతోంది. నేరుగా జనసేన పార్టీ ట్విట్టర్ అకౌంట్లో కాకుండా తెలివిగా దాని అనుబంధ విభాగం శతఘ్ని నుంచి ఓ పోస్టింగ్ పెట్టారు. వంద రూపాయలు జనగణమన అని జపించి జనసేన ఖాతాలో జమచేద్దాం. మన భవిష్యత్తుని మనమే బలపరుచుకుందాం అని దాని సారాంశం. ఇంతకీ జనగణమన అని ఎందుకు జపించమన్నారో అర్థంకావడం లేదు. ప్రాస కోసం జనసేనతో పాటు జనగణమనని కలిపారని అర్థం చేసుకోవాల్సిందే.
అయితే ఇలా పోస్టింగ్ పెట్టారో లేదో.. అలా ట్రోలింగ్ మొదలైంది. చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీ సరిపోలేదా ఇలా జనం మీద పడ్డారంటూ కామెంట్లతో ఆటాడేసుకుంటున్నారు నెటిజన్లు. డబ్బులు ఇవ్వం అన్నారు కదా, ఇప్పుడు మీరెందుకు అడుగుతున్నారంటూ మరొకరు మొదలుపెట్టారు. డబ్బుల్లేకపోతే స్పెషల్ ఫ్లయిట్ లో ఎవరు తిరగమన్నారంటూ ఇంకొకరు లాజిక్ తీశారు. మొత్తమ్మీద జనసేన పోస్టింగ్ కి విపరీతమైన నెగెటివ్ రెస్పాన్స్ వస్తోంది.
పవన్ కల్యాణ్ తానా సభలకు హాజరవడం కూడా నిధుల వేటలో భాగంగానే అనే ప్రచారం ఉంది. ఆ మధ్య విదేశీ పర్యటనలకు పవన్ వెళ్లినా ఆశించిన స్థాయిలో విరాళాలు రాలేదు. అధికారికంగా ఏపీలో కూడా జనసేనకు పెద్దగా విరాళాలేవీ దక్కలేదు. పవన్ కల్యాణ్ తల్లి, సోదరుడు నాగబాబు, నాగబాబు కొడుకు వరుణ్ తేజ్.. ఇలా ఫ్యామిలీ మెంబర్లు ఇచ్చిన డొనేషన్లే పెద్ద మొత్తాల్లో లెక్కతేలాయి.
పవన్ పై నమ్మకం లేకపోవడంతో అతి కొద్దిమంది వ్యాపారవేత్తలు మాత్రమే జనసేనకు డొనేషన్లిచ్చారు. ఇవన్నీ నిండుకోవడంతో ఇప్పుడు డొనేషన్ల కోసం వెబ్ సైట్లు బార్లా తెరిచారు జనసైనికులు. మరి ఇంత కరువులో ఉంటే.. జనసేనాని స్పెషల్ ఫ్లయిట్ లో తిరగడం ఎందుకు? ఎన్నిసార్లు జనగణమన అని జపించి 100 రూపాయలు అకౌంట్లో వేస్తే ఒక స్పెషల్ ఫ్లయిట్ ప్రయాణానికి ఖర్చులు జమ అవుతాయి? ఇవన్నీ ఆలోచిస్తే జనసేనకు సామాన్యుల నుంచి విరాళాలు రావడం కష్టమే అనిపిస్తోంది.