ఈటల పుణ్యంతో హుజూరాబాద్ లో కురుస్తున్న సర్కారు డబ్బు ….!

ఇప్పుడు మీడియాలో మారుమోగుతున్న పేరు హుజూరాబాద్. రాజకీయంగా, అభివృద్ధి కార్యక్రమాలపరంగా హుజూరాబాద్ టాప్ లో ఉంది. ఈ నియోజకవర్గం పేరు ఇంతలా మారుమోగడానికి మాజీ మంత్రి ఈటల రాజేందర్ కట్టుకున్న పుణ్యమే. ఆయన ఎమ్మెల్యే…

ఇప్పుడు మీడియాలో మారుమోగుతున్న పేరు హుజూరాబాద్. రాజకీయంగా, అభివృద్ధి కార్యక్రమాలపరంగా హుజూరాబాద్ టాప్ లో ఉంది. ఈ నియోజకవర్గం పేరు ఇంతలా మారుమోగడానికి మాజీ మంత్రి ఈటల రాజేందర్ కట్టుకున్న పుణ్యమే. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం వల్లనే కదా హుజూరాబాద్ కు ఉప ఎన్నిక వచ్చింది. అసలు ఈ పుణ్యంలో సగం సీఎం కేసీఆర్ కు దక్కాలి. ఆయన ఈటలను మంత్రివర్గం నుంచి తీసేయబట్టేకదా ఈటల రాజీనామా చేశాడు. 

అందువల్ల హుజూరాబాద్ ఉప ఎన్నిక రావడానికి కేసీఆర్ అండ్ ఈటల ఇద్దరూ కారకులే. ఏ కారణం వల్ల, ఎవరి కారణం వల్ల ఉప ఎన్నిక వస్తేనేం హుజూరాబాద్ లో మాత్రం సర్కారు సొమ్ము కుంభ వృష్టి కురిసినట్లు కురుస్తోంది. వివిధ పనుల కోసం అంత నిధులు, ఇంత నిధులు అంటూ ప్రభుత్వం నుంచి జోరుగా ప్రకటనలు వస్తున్నాయి. మరి కార్యాచరణ ఎంత వరకు ఉంటుందో చూడాలి.

ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ రెండో విడత గొర్రెల పంపిణీకి ఆరువేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. సరే … ఇది రోటీన్ కార్యక్రమమే. ఇప్పుడు ఎక్కువగా చర్చలు జరుగుతున్నది దళిత బంధు అనే పథకం. ఇన్నాళ్లు లేని ఈ పథకం ఇప్పుడే తెరమీదికి రావడానికి కారణం హుజూరాబాద్ ఉప ఎన్నిక అనడంలో అనుమానమే లేదు. పైగా దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబోతున్నది హుజూరాబాద్ లోనే. 

ఇది కాకుండా ఇంకా చాలా అభివృద్ధి పనులు ప్రభుత్వం ప్రకటించింది. ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకొని ఈ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఉప ఎన్నికే కారణమని స్పష్టంగా తెలుస్తూనే ఉంది.  నాగార్జున సాగర్ ఉప ఎన్నికప్పుడు కూడా ఇలాగే జరిగింది. 'దళిత బంధు' ను యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం అమలు చేయాలనుకుంటోంది. 

పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో ప్రయోగాలు చేస్తోంది. ఈ నియోజకవర్గంలోనే పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలనుకోవడానికి కారణం అక్కడ సుమారు 40 వేలకు పైగా ఎస్సీల ఓట్లు ఉండటమే. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో వందమంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయాలనే విధంగా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం హుజూరాబాద్‌లో మాత్రం అర్హులైన అన్ని దళిత కుటుంబాలకు ఒకేసారి అమలు చేయాలనుకుంటోంది. ఇందుకోసం అదనంగా రూ. 2,000 కోట్లను కూడా ఖర్చు చేయాలనుకుంటోంది. 'దళిత బంధు' పథకం అమలు కోసం విధి విధానాలను రూపొందించే కసరత్తు జరుగుతోంది.

ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. ఇందుకోసం రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో ఇప్పటికే వెయ్యి కోట్లను ప్రభుత్వం కేటాయించింది. రానున్న నాలుగేళ్ళ కాలంలో సుమారు రూ. 40 వేల కోట్లను ఖర్చు చేస్తామని సీఎం ప్రకటించారు. కానీ ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో వీలైనంత తొందరగా మార్గదర్శకాలను జారీ చేసి అమలులోకి తేవాలని భావిస్తున్నారు. దళిత కుటుంబాల్లో ఈ పథకానికి అర్హతను నిర్ణయించడానికి ఎలాంటి అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలన్నదానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

'దళిత బంధు' పథకానికి రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు రూ. 1,200 కోట్లను ఖర్చు పెట్టాలనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం కేవలం హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రం గరిష్ఠంగా సుమారు రూ. 2,000 కోట్లను ఖర్చు చేయాలనుకుంటోంది. అలా అనుకోవడానికి కారణం ఉప ఎన్నిక. రాష్ట్రం మొత్తంమీద ఈ పథకం కింద చేయాలనుకుంటున్న ఖర్చు కంటే ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గానికే ఎక్కువ కేటాయించాలనుకుంటోంది.  ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి బహిష్కరించిన తర్వాత ఆ నియోజకవర్గం మీద  సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు.

కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొదలు జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ వరకు ప్రభుత్వం సుమారు రూ. 660 కోట్లకు పైగానే ఆర్థిక అనుమతులు మంజూరు చేసినట్లు సచివాలయ వర్గాల సమాచారం. ఇందులో ఇప్పటికే సుమారు రూ. 360 కోట్ల మేర విడుదలయ్యాయి. మానేరు రివర్ ఫ్రంట్ పథకానికి రూ. 310 కోట్లు, హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లకు రూ. 35 కోట్లు, జమ్మికుంట మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 30 కోట్లు ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది.

ఇక రాష్ట్రంలో ఆసరా పింఛన్లకు వయో పరిమితిని 57 ఏళ్ళకు కుదించడంపై విధాన నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రం ఇప్పటికే గుట్టుచప్పుడు కాకుండా వివరాల సేకరణ మొదలైంది. కొన్ని గ్రామాల్లో సీసీ రోడ్లకు నిధులు మంజూరయ్యాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను కూడా వెంట వెంటనే విడుదల చేస్తున్నది. ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా అమలుచేయడానికి, ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందించే అధికారులను అక్కడికి బదిలీ చేస్తోంది. ఏది ఏమైనా ఒక ఉప ఎన్నిక ఎంతటి ప్రభావం చూపిస్తుందో అర్ధమవుతోంది కదా.